YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 21 October 2012

పాదయాత్రలో మహిళా ప్రభంజనం


* నాలుగో రోజు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న వనితలు
* జోరు వర్షంలోనూ ఆగని షర్మిల.. ఆమె వెంటే జనం!

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఒక మహిళ ప్రజాసమస్యలపై 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు సాహసించడం ఓ చరిత్రాత్మక ఘట్టమైతే.. ఇదే ప్రేరణతో మహిళలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనడం మరో విశేషం. యాత్ర నాలుగో రోజు ఆదివారమైతే మహిళలు పెద్ద సంఖ్యలో ‘మరో ప్రజాప్రస్థానం’లో పాల్గొన్నారు.

ఆదివారం పులివెందుల నుంచి లోపట్నూతల వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిలతో కలసి షర్మిల చేసిన ఈ పాదయాత్రలో ఉదయం నుంచి భోజన విరామం వరకు దాదాపు 10 వేల మంది కదం తొక్కారు. వీరిలో దాదాపు ఏడెనిమిది వేల మంది మహిళలే!! భోజన విరామం కంటే ముందు చిన్నకుడాల క్రాస్‌రోడ్డు వద్దకు పొద్దుటూరు నుంచి దాదాపు 2,500 మంది మహిళలు తమ పిల్లలను వెంటేసుకుని వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు.

వీరిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ‘నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం రాలేదు. నాన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం ఇచ్చారు. రూ. 200 కోట్ల రుణాలు మాఫీ చేశారు. మరో రూ. 312 కోట్ల రుణమాఫీకి జీవో కూడా జారీ చేసినా.. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదు. ఇంతకుముందు ఎవరూ చేయలేని ఆలోచన నాన్న చేశారు. చేనేత కార్మికులు మగ్గాల మీద పనిచేస్తున్నప్పుడు కంటిచూపు దెబ్బతింటుందన్న ఆవేదనతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక ఆ పెన్షన్ రూ. 1,000కి పెరుగుతుంది..’ అని పేర్కొన్నారు.

జడివానలోనూ ఆగని పాదయాత్ర..
సాయంత్రం లింగాలవైపు పాదయాత్ర సాగుతుండగా 6 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. లింగాల మూడు కిలోమీటర్లు ఉందనగా వర్షం జడివానగా మారింది. అదే వర్షంలో షర్మిల ముందుకు సాగారు. షర్మిలతోపాటే పాదయాత్రలో ఉన్న అభిమానులంతా ముందుకు సాగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి తోటలు కొట్టేస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాలు రావడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది. ‘వర్షం వస్తే రాజన్న వచ్చినట్టే ఉంది..’ అని స్థానికులు అనడం వినిపించింది.

గుచ్చి గుచ్చి ప్రశ్నించిన ఇంటెలిజెన్స్ అధికారులు
పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో ఇంటెలిజెన్స్ అధికారులు ఈ జనం ఎలా వస్తున్నారంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ‘ఇక్కడికి రావడానికి ఎంత లెక్క(డబ్బులు) ఇచ్చారని అడుగుతున్నారు. పోలీసుల మాదిరే ఉన్నారు..’ అని పాదయాత్రలో పాల్గొన్న పలువురు అభిమానులు ‘న్యూస్‌లైన్’ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంటెలిజెన్స్ అధికారులు పాదయాత్రలో ప్రజలను ప్రశ్నించడం నిజమేనని ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలింది. రాత్రి జడివానలోనూ అభిమానుల పాదయాత్ర చూశాక ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఈ అభిమానాన్ని కొనలేమని బహుశా ఆ అధికారులకూ అర్థమై ఉంటుందని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!