YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

కిరణ్‌గారూ.. ఏ అబద్ధపు సాక్ష్యాలతో జగన్‌ను 14 ఏళ్లు జైల్లో పెడతారు?

సోనియా ఆదేశాల మేరకే సీబీఐ అరెస్టు చేసిందని జాతీయ మీడియా సైతం చెప్తోంది
జగనన్నను అసలు బతకనిస్తారా?
బొత్సా.. మద్యం కేసుల గురించి మాట్లాడవేం?
చిరంజీవీ.. రూ.35 కోట్ల సంగతేంటి?

నెల్లూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే వైఎస్ జగన్‌ను సీబీఐ ద్వారా వేధిస్తున్నారన్న సంగతిని సాక్షాత్తూ కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారని జగన్ సోదరి షర్మిల అన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే సీఎం అయ్యేవారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలే.. వారి కక్షపూరిత రాజకీయాలను బయటపెట్టాయన్నారు. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల రోడ్‌షోలలో షర్మిల ప్రసంగించారు. జగన్‌పై కాంగ్రెస్, టీడీపీల కుట్రను కడిగిపారేశారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జగనన్నను అరెస్టు చేయడానికి ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగిందని జాతీయ మీడియా సైతం చెప్పిందన్న షర్మిల..‘ఇండియా టుడే’ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు.

‘జగనన్నను గత నెల 25న సీబీఐ విచారణకు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతోనూ, సీబీఐ అధికారులతోనూ ఫోన్లలో మంతనాలు జరిపినట్లు అందులో రాశారు. ఆజాద్ సోనియాతో చర్చించిన తర్వాత 27న ఆమె ఆదేశాలిచ్చింది. జగనన్నను అరెస్ట్ చేశారు’ అని చెప్పారు. ఆదేశాలివ్వడానికి ఆవిడెవరని నిలదీశారు. ‘రాజకీయమంటే హెలికాప్టర్‌ను కూల్చడం, మంచి వాళ్లను జైలుపాలు చేయడమేనా? అసలు జగనన్నను బతకనిస్తారా?’ అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అన్యాయమైన ఆరోపణలు

‘అధికార దాహంతో మేమే నాన్నను చంపుకున్నామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఎన్నికల సమయమని అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన మద్యం కేసులు గురించి మాత్రం మాట్లాడరు’ అని నిప్పులు చెరిగారు. ‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న ఎక్కడో మాట్లాడుతూ జగనన్నను 14 ఏళ్లు జైల్లో పెడతారని అన్నారు. ఏ ఆధారాలతో పెడతారు? విచారణ పేరుతో పెడతారా? అబద్ధపు సాక్ష్యాలతో పెడతారా? వీళ్లు ఏమనుకుంటున్నారు?.. కిరణ్‌కుమార్‌రెడ్డి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండవచ్చవని అనుకుంటున్నారా? అధికార దాహం ఎవరిదో దీన్ని బట్టే తెలుస్తోంది’ అని అన్నారు. వైఎస్ పథకాలన్నీ సోనియా పథకాలని చిరంజీవి అంటున్నారని, ఆ పథకాలు రాజశేఖరరెడ్డి పథకాలు కాబట్టే ఈ రాష్ట్రంలో అమలయ్యాయని, సోనియావే అయి ఉంటే దేశమంతా అమలయ్యేవి కదా అని ప్రశ్నించారు. చిరంజీవి కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ‘చిరంజీవి కుమార్తె ఇంట్లో రూ.35 కోట్లు దొరికాయి. కానీ రూ.35 లక్షలేనంటారు. ఒక్కొక్క అట్టపెట్టెలో రూ.కోటి దాచి పెట్టుకున్నారు. ఇంట్లోనే ఇన్ని కోట్లు ఉంటే బయట ఎన్ని కోట్లు ఉన్నాయో’ అని సందేహం వెలిబుచ్చారు. 

చంద్రబాబు ఓటర్లనే బెదిరిస్తున్నారు

‘ఓటమి తప్పదని తెలిసి చంద్రబాబు ఏకంగా ఓటర్లనే బెదిరిస్తున్నారు. ఓటేస్తే ప్రజల్ని జైల్లో పెట్టిస్తారట.. జగనన్న గెలుపును ఎలా ఆపాలో తెలియక ఆయన మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు’ అంటూ షర్మిల విమర్శించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పెద్దలు బతకనిస్తారా? జగనన్నకు భవిష్యత్ ఉందా? అని దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికలు అంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జగనన్నకు జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా చాటి చెప్పాలి. జగనన్న నిర్దోషి అని దేశానికి అర్థం కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఈ ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని కోరారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!