YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

కాంగ్రెస్‌ను వీడినందుకే దోషిని చేశారట!:విజయమ్మ

కాంగ్రెస్‌లోనే ఉంటే జగన్‌ను మంత్రిని చేసేవారట.. సీఎంను కూడా చేసేవారట
ఆ పార్టీ ఢిల్లీ పెద్ద ఆజాదే ఈ విషయం చెప్తున్నారు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎన్నికల ప్రచారంలో విజయమ్మ
వాళ్ల దగ్గర ఉంటే జగన్ ఏ తప్పూ చేయనట్టేనని ఒప్పుకొంటున్నారు

ఒంగోలు, నెల్లూరు, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పల్లా.. ఓదార్పు యాత్ర చేయడం, కాంగ్రెస్ పార్టీని వీడడమేనని, అందుకే ఆయనపై సీబీఐ విచారణలు, అరెస్టులు జరుగుతున్నాయన్న విషయాన్ని సాక్షాత్తూ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలే చెప్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. ‘‘ఈరోజు వాళ్లే చెప్తున్నారు. ఢిల్లీ పెద్దలు చెప్తున్నారు.. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటే.. మంత్రిని చేసేవారట.. సీఎంను కూడా చేసేవారట. అంటే వాళ్ల దగ్గర ఉంటే.. జగన్‌బాబు ఈ తప్పులేవీ చేయనట్టేనని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఒప్పుకొంటున్నారు’’ అని ఆమె అన్నారు. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలో భాగంగా కందుకూరులోని పామూరు బస్టాండ్ సెంటర్లో, కలిగిరి, జలదంకి, వింజమూరు, ఆత్మకూరులలో కుమార్తె షర్మిలతో కలిసి ఉద్వేగంగా ప్రసంగించారు. గతంలో ఏ పార్టీ సభకూ లేని రీతిలో భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయమ్మ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

ఓదార్పు చేయొద్దన్నారు..

రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వస్తానంటూ జగన్ బాబు నల్లకాల్వలో మాట ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడి ఆయన ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు. యాత్రకు వెళతానంటే అధిష్టానం రెండు నెలలు ఆపింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య ఇంటికి పిలిచి అల్పాహారం ఇచ్చి.. ఓదార్పు చేసుకోమన్నారు. ఆ తర్వాత పెద్దలు ఓదార్పు యాత్ర మానుకోమన్నారు. ఆ రోజు జగన్‌బాబు ఒకటే మాట చెప్పాడు. ఇచ్చిన మాట తప్పనని చెప్పాడు. ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దాదాపు 700 మంది ‘సాక్షి’పై రైడ్ చేశారు. ఇన్ని జరుగుతున్నా మేం కాంగ్రెస్‌లోనే ఉన్నాం. ఉండాలనుకున్నాం. కానీ విధిలేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. అలా వచ్చాక జగన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టా రు. తర్వాత ఆ పార్టీ జెండాపై కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచాం.

బాబు విషయంలో అలా.. జగన్ విషయంలో ఇలా..

టీడీపీ అధినేత చంద్రబాబు మీద నేను కేసు వేసినప్పుడు.. ఆయనపై విచారణ చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలా ఆదేశించి నెలరోజులైనా దర్యాప్తు మొదలుపెట్టలేదు. అదే జగన్‌బాబుపై దర్యాప్తు చేయాలని కోర్టు చెప్పిన క్షణమే 28 సీబీఐ టీమ్‌లు రెడీ అయిపోయి.. రైడ్‌లకు దిగాయి. జగన్‌బాబు మీద అంత వేగంగా దాడులకు దిగిన సీబీఐ అధికారులు.. అదే చంద్రబాబు మీద నెలరోజులైనా ఎందుకు కదల్లేదు? ఆ నాటి నుంచి తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకాలం చేసినా ఆధారమేదీ దొరకలేదు. తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా జగన్‌బాబును పిలిచి విచారించని సీబీఐ ఇప్పుడు 18 స్థానాల్లో ఉప ఎన్నికలు దగ్గరపడేసరికి హడావుడిగా ఆయనకు సమన్లు పంపింది. 

కోర్టు విచారణకు హాజరవ్వాల్సి ఉన్నా... ముందు రోజే హడావుడిగా అరెస్టు చేసింది. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అన్ని సీట్లూ దక్కించుకుంటుందేమోనన్న భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐ ద్వారా జగన్‌బాబును అరెస్టు చేయించారు. ప్రజల మధ్య నుంచి ఆయన్ను తీసుకెళ్లిపోయారు. కానీ జగన్‌బాబు ఎక్కడ ఉన్నా.. ప్రజలంతా ఆయనకు అండగా ఉంటారని వాళ్లకు తెలీదు. నాకు ఎక్కడా న్యాయం దొరకలేదు.. అందుకే ఆడబిడ్డలా మీ వద్దకు వచ్చా... ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చా. మీరే న్యాయ నిర్ణేతలు. ప్రజల మన్నన లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి.

ప్రచారంలో విజయమ్మ వెంట నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఒంగోలు పార్టీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు తదితరులున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!