యావద్దేశం దృష్టి నిలిపిన రాష్ట్ర ఉప ఎన్నికల్లో ఫలితాలు అందరూ ఊహించినట్టే వచ్చాయి. పైకి ఎన్ని బీరాలు పలికినా వీటిలో గెలుస్తామన్న ఆశ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు బొత్తిగా లేదు. కనీసం చెరి మూడు స్థానాలనైనా దక్కించుకుంటే ఎంతో కొంత పరువు నిలుస్తుందనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పెద్దలు ఆశించారు. అత్యధిక స్థానాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి వెళతాయని అంతా అనుకున్నదే కనుక ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో 15నూ, నెల్లూరు పార్లమెంటరీ స్థానాన్నీ ఆ పార్టీ దక్కించుకోవటంలో మామూలుగా అయతే ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలోని రెండు పెద్ద రాజకీయ పార్టీలు, ఒకవర్గం మీడియా, మొత్తంగా అధికార వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో ఏకమై వైకాపాను రాజకీయంగా సమాధి చేయాలని ముప్పేట దాడికి దిగటంవల్లే ఈ ఉపసంగ్రామం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది.
2009 సాధారణ ఎన్నికల్లో 16+1 స్థానాల్లో గెలిచిన పాలక కాంగ్రెసు ఈ ఉప ఎన్నికల్లో విశ్వప్రయత్నం చేసి కూడా వాటిలో రెండు మినహా అన్ని చోట్లా భంగపడటం అధికార పక్షానికి కోలుకోలేని దెబ్బ. ఇక ‘రెండు కళ్ల బాబు’కు ఇప్పటికే తెలంగాణాలో ఒక కన్ను పోగా, ఈమారు సీమాంధ్రలో రెండో కన్నూ పోయింది. కాంగ్రెస్‌లో ముసలం పుట్టి వైరి వర్గం ఓట్లు నిలువునా చీలిన అనుకూల స్థితిలోనూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం 18+1లో ఒక్క సీటూ గెలవలేక, ఆరు చోట్ల డిపాజిట్లు గల్లంతై బొక్కబోర్ల పడటమంటే రాష్ట్ర రాజకీయాల్లో తన డెత్ వారంటును స్వహస్తాలతో రాసుకున్నట్టే.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అతితెలివికి పోకుండా, వాస్తవికంగా వ్యవహరించి, ఎవరి హద్దులను వారు గుర్తెరిగి మామూలుగా పోటీ చేసి ఉంటే తాజా పరాభవం ఆ పార్టీలకు ఇంతగా తలవంపులు తెచ్చేదికాదు. ఉమ్మడి శత్రువైన జగన్‌ని అణగదొక్కాలన్న పట్టుదలతో రెండు పార్టీలూ పాత వైరాలను మరచి, దాదాపు ఒక సంవత్సరంగా కూడబలుక్కున్నట్టు వ్యవహరిస్తూ ఎంతకైనా తెగించటంతో ఉప ఎన్నికల సంగ్రామం వాటికీ, వైకాపాకూ నడుమ పరువు పందెంగా మారింది. తమ అభిమాన నాయకుడైన రాజశేఖరరెడ్డిని బద్‌నామ్ చేసి, ఆయన కుమారుడిని వేటాడటం కోసం పాలక, ప్రతిపక్ష పార్టీలు అనైతికంగా కుమ్మక్కు అయ్యాయన్న అభిప్రాయం జనాల్లో నాటుకుంది. వై.ఎస్. కుటుంబంమీద, ముఖ్యంగా జగన్‌మీద పగబట్టిన ఒకవర్గం మీడియా అతడిని నికృష్ట ఆర్థిక నేరస్థుడిగా, క్షమించరాని పాపాలభైరవుడిగా చిత్రిస్తూ పొద్దస్తమానమూ చేసిన ప్రచారపు అతి కూడా అసంకల్పితంగా జగన్ పక్షానికే లాభం చేసింది. రాజకీయంగా వ్యతిరేకించటంతో ఊరుకోకుండా కాంగ్రెస్, ‘దేశం’ క్షేత్రస్థాయిలోనూ జగన్‌కు వ్యతిరేకంగా లాలూచీ అయి కొన్ని స్థానాల్లో ఒకరి ఓట్లను ఒకరికి బదలాయించుకుంటున్నారన్న వార్తలు ఇరుపక్షాలకు చెడ్డపేరు తెచ్చాయి. స్థానిక స్థాయిలో అనేక స్థానాల్లో ఆఖరి నిమిషంలో అలాంటి ఆపద్ధర్మపు సర్దుబాట్లు జరిగినా వాటివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరింది రెండు చోట్లే. రామచంద్రాపురం, నరసాపురం స్థానాల్లో ‘తెలుగుదేశం’ ఓట్ల సాయంతో కాంగ్రెస్ గట్టెక్కటం రెండు పార్టీలకూ సిగ్గుపడాల్సిన విషయమే.
ఏ స్థానంలో ఎవరు గెలిచినా పదవిలో ఉండేది రెండేళ్లలోపే. అది కూడా ఈలోగా ఏ మధ్యంతర ఎన్నికలో తోసుకురాకుండా ఉంటేనే! అంతోటి భాగ్యానికే.. ఇవేవో జనరల్ ఎన్నికలైనట్టు, వీటిలో గట్టెక్కటం జీవన్మరణ సమస్య అయినట్టు అన్ని పార్టీలు బరితెగించి డబ్బు సంచులను లెక్కలేకుండా దించి.. నగదుతోబాటు నగలను, చీరలను, సారా పీపాలను విచ్చలవిడిగా పంచి ప్రజల తీర్పును కొనుగోలు చేయాలని శాయశక్తులా తంటాలు పడితేనేమి? ఓటర్లు వారికంటే తెలివిమీరినవాళ్లు. ఎవరు ఇచ్చింది వాళ్ళ దగ్గర పుచ్చుకుని, తాము ఇవ్వదలిచిన తీర్పును విస్పష్టంగా ఇచ్చారు. వై.ఎస్. పాలన యావత్తూ అవినీతిమయమైనట్టు, ప్రజాహితానికి తీరని ద్రోహం జరిగినట్టు ఒక వర్గం మీడియా చొక్కాలు చించుకుని ఎంత ప్రచారం చేసినా, మోసపోవటానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు తెగేసి చెప్పారు. వై.ఎస్. అధికార దుర్వినియోగం, కుమారుడికోసం ‘క్విడ్‌ప్రోకో’ల బాగోతం, జగన్ ఆర్థిక నేరాలు వగయిరాల గురించి 2009 ఎన్నికలలో వినిపించిన వాదనలనే ఈ ఉప ఎన్నికల్లోనూ ఎవరు ఎంతలా అరగదీసినా ప్రజాకోర్టులో ఆ వాదాలేవీ నిలవలేదు. దీన్ని బట్టి జగన్‌పై మోపిన అభియోగాలన్నీ నిరాధారమని తేలాయని చెప్పడం సరికాదు. ప్రజాకోర్టులో అతడి పార్టీ రాజకీయంగా గెలిచింది కాబట్టి సిబిఐ కోర్టులో అతడి కేసులను ఎత్తివేయాలనో, జుడిషియల్ నిర్బంధంనుంచి అతడిని వెంటనే విడుదల చేయాలనో ఎవరు డిమాండు చేసినా తప్పే. కేసులను మోపడం రాజకీయ ప్రేరేపణతోనే జరిగి ఉండవచ్చు. కాని విచారణ ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక చట్టం తన పని తాను చేసుకుపోవలసిందే. తప్పొప్పులు న్యాయపరీక్షలో నిగ్గుతేలవలసిందే.
అన్ని స్థానాల్లోకీ ఎక్కువ ఉత్కంఠను రేకెత్తించిన పరకాల సీటును హోరాహోరీ పోటీలో వైకాపా నుంచి తక్కువ మెజారిటీతోనైనా తెరాస గెలుచుకోవడం తెలంగాణావాదానికి విజయం. తండ్రి మరణానంతరం వై.ఎస్.జగన్ మీదా... ఎన్నికల అదనులో అతడిని అరెస్టు చేసిన దరిమిలా ప్రచార శంఖం పూరించిన వై.ఎస్. సతిమీదా వెల్లువెత్తిన సానుభూతిని పరకాల పోరుగడ్డలో తెలంగాణ సెంటిమెంటు జయప్రదంగా నిలువరించటం పెద్ద విశేషం. అదృష్టం కలిసివచ్చి పాలమూరులో బోణీ చేసినట్టే పరకాలలోనూ పాగావేసి, తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుగన్న ‘కమలా’నికి కనీసం డిపాజిటు కూడా దక్కకపోవటం మాడు పగిలే భంగపాటు.
ఉప ఎన్నికల బరిలో మూడుసీట్లు (పరకాల, నరసాపురం, రామచంద్రాపురం) జారవిడుచుకుని, ఒక సీటును (తిరుపతి) అదనంగా గెలుచుకుని, అతి తక్కువ నష్టంతో బయటపడ్డది వైకాపా కాగా అన్నిటికంటే దారుణంగా దెబ్బతిన్న పార్టీ సోనియమ్మ కాంగ్రెసు! జగన్ ధిక్కారానికి శాస్తి చేసితీరాలన్న పంతంతో ఎన్ని కేసులు పెట్టించి, సిబిఐనీ, సర్కారీ ఏజన్సీలనూ ఉసికొలిపి ఎన్ని దాడులు చేయించి ఎంతలా సతాయించినా.. ఎఐసిసి హేమాహేమీలను రంగంలోకి దింపి ఉప ఎన్నికల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ ప్రచారాన్ని ఎంతలా పరుగులు తీయించినా కాంగ్రెసు అధినేత్రికి మిగిలింది నిరాశే. రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం రాజశేఖరరెడ్డి తన ప్రయోజకత్వంతో ఒంటిచేత్తో సాధించి పెట్టిందేనన్న సంగతి మరచి.. అసలైన ఆ ఆలంబనానే్న చేచేతులా వదిలేసుకుని... జనంలో చెల్లని ‘దేశం’ వాదానే్న తామూ దొరకపుచ్చుకుని వై.ఎస్.ను పాపాత్ముడిగా చిత్రించటమంటే కూచున్న కొమ్మను నరికేసుకోవటమేనన్న ఇంగితజ్ఞానం కాంగ్రెసు పెద్దలకు లోపించింది. సొంతంగా పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీ దుకాణానే్న నడపలేక కాంగ్రెసుకు తెగనమ్ముకున్న చిరంజీవి బ్రహ్మాండమేదో బద్దలు కొడతాడని వెర్రి నమ్మకం పెట్టుకుంటే, అతగాడు శక్తివంచన లేకుండా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ప్రజారాజ్యం స్థాయికి తీసుకొచ్చిపెట్టాడు. 2009లో సొంతంగా గెలుచుకున్న 16 అసెంబ్లీ స్థానాల్లో రెండు (అవి కూడా టి.డి.పి. లోపాయకారీగా సాయం పట్టటంవల్ల) మినహా అన్ని చోట్లా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. సుమారు మూడేళ్లుగా కాంగ్రెసు నాయకత్వం చేస్తున్న తప్పులకు.. తాజా తోలుబొమ్మ కిరణ్‌కుమార్ రెడ్డి అసమర్థ నిర్వాకానికి.. గాంధీభవన్‌ను నడిపిస్తున్న బ్రాందీ వ్యాపారి నిరర్థక వాచాలత్వానికి ఈ పరాజయం నిలువెత్తు నీరాజనం. సొంత జిల్లాల్లోనే పార్టీని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి, సొంత ప్రాంతంలో కుదేలైన పి.సి.సి. నేత రాష్ట్రంలో పార్టీని ఏమి ఉద్ధరిస్తారన్నది కాంగ్రెసు వారి మదిలో వద్దన్నా మెదిలే ప్రశ్న. చిరంజీవి తాను ఖాళీ చేసిన తిరుపతి సీటును కాంగ్రెసుకు మళ్లీ దక్కించలేకపోతేనేమి? ఆ పార్టీ నెగ్గిన రెండు చోట్లా గెలిచిన అభ్యర్థులు ఆయన కొట్టు కట్టేసిన పార్టీకి చెందినవాళ్లే. అందునా ఆయన సామాజిక వర్గీయులే. కాబట్టి వచ్చిన రెండయినా తన పురుషార్థం వల్లేనని చిరంజీవి ఎంచక్కా చెప్పుకోవచ్చు.
ఎన్నికలు జరిగిన 18+1 స్థానాల్లో మూడు మినహా అన్నిటినీ వైకాపాయే గెలుచుకోవటం.. అందులోనూ చాలా చోట్ల అది కళ్లు చెదిరే భారీ మెజారిటీతో జాక్‌పాట్ కొట్టటం కాంగ్రెసుకు చిట్టచివరి ప్రమాద సూచిక! ఇంకో రెండేళ్లలోగా ఎదుర్కొనక తప్పని జనరల్ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్నదానికి ఇది చిన్న మచ్చుతునక. ఇప్పటి తరహాలో, ఇదే నాయకత్వం కింద, ఇలాగే సాగితే 2014లో పుట్టి మునగడం ఖాయమన్నది గోడమీదిరాత! పోటీ జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల మూడో స్థానానికి దిగజారి, 7 చోట్ల ధరావతును కూడా విజయవంతంగా కోల్పోయాక అధికార పక్షం ముందుగతి గురించి ఎంతటి ఆశావాదికీ నమ్మకం చిక్కదు. కోస్తా ఆంధ్రలో కాంగ్రెసుకు డిపాజిటు పోవటం ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం. కాంగ్రెసు మునిగే పడవ అన్నది రూఢి అయ్యాక దానినుంచి బయటపడాలని చూసేవారు సహజంగానే ఎందరో ఉంటారు. పెట్టుడు కేసులతో, సిబిఐ ఓవరాక్షన్లతో, మీడియా దుష్ప్రచారాలతో జగన్ గొంతును నులమలేరని ఉప ఎన్నికల ఫలితాలు చాటి చెప్పిన దరిమిలా భవిష్యత్తులేని కాంగ్రెస్, టి.డి.పిలనుంచి అతడివైపు ఎమ్మెల్యేల వలసలు ఇకమీదట ముమ్మరమైతే ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్ కొట్టిన తొలి గండిని చిరంజీవి సాయంతో ఎలాగో భర్తీ చేసుకోగలిగారు. దానిని మించిన గండి మళ్లీ పడితే మోకాలు అడ్డటానికి ఇంకే చిరంజీవి మిగిలి ఉన్నాడు? ఇప్పుడున్న బొటాబొటి మెజారిటీకి కొత్త వలసలవల్ల మోసం వస్తే కాంగ్రెసు ఓటి సర్కారు ఎంతకాలం నిలబడుతుంది? కొరగాని ముఖ్యమంత్రిని మార్చివేస్తారా? అంతమాత్రాన కాంగ్రెసుకు దశ తిరుగుతుందా? పుట్టిమునకను తప్పించుకోవటానికి కాంగ్రెసు వారు ఎవరితో ఎలాంటి సంధి చేసుకొంటారు? రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి... అన్నది ఇప్పుడే చెప్పలేం. ఒక వర్గం మీడియా వాద్య సహకారంతో పట్టపగ్గాలు లేని సిబిఐ దూకుడు మునుముందు ఏ గేరులో పడుతుందన్నది వేచి చూడాల్సిన వినోదం.

No comments:
Post a Comment