YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

ఇది 'రాజముద్రే'.యమునికి, శివునికి వెరవని ధీరత్వం (vaartha)


ఏళ్లుగడిచినా చెరగని, చెదరని కీర్తి సముపార్జించి మరణానంతరం కూడా మనముందు మంచి పనుల రూపంలో సజీవులైన ధన్యజీవులున్నారు. అరుదైన ఆ అవకాశం, అదృష్టం అందరికీ దక్కదు. దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్నపుడు పొగడ్తలు, ప్రదక్షి ణలు, పాదాభివందనాలు తదితరవన్నీ సాధారణంగా ఉంటాయి. అధికారంపోగానే ఎలా ఉంటుందో వేరే చెప్ప నక్కర్లేదు. అటువంటిది ఆ వ్యక్తి మరణిస్తే గుర్తుపెట్టుకోవడం అంటే హృదయాల్లో చోటుచేసుకుంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తుంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ జాబితాలో చేరి పోయారేమోననిపిస్తున్నది. ఆయన పరమపదించి రెండున్నర ఏళ్లు దాటిపోయినా నేటికీ ఆయనపై ప్రజలకున్న అభిమానం ఈ ఉప ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆయన అవినీతిపరుడని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమారుడికి అక్రమంగా కట్టబెట్టారని ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఒక క్రిమినల్‌ అని తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేలాది కోట్ల రూపాయలు అక్ర మంగా సంపాదించాడని ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకుని ఊదరగొట్టినా ఆధారాలతో సహా కేసులు పెట్టినా ప్రజలు వాటిని అంతగా పట్టించుకోలేదనే విషయం ఈ ఫలితాలు చెప్ప కనే చెపుతున్నాయి. కుటుంబ యజమానో, యజమానురాలో చనిపోతే ఏమిచ్చిపోయారు వెక్కివెక్కి ఏడవడానికి అనుకునే రోజులివి. మృతదేహం అక్కడ ఉండగానే ఆస్తికోసం, వాటాలకోసం కోట్లాడుకునే దౌర్భాగ్యపురోజులివి. ఈ రోజు చనిపోతే మరుసటిరోజుకు మరిచిపోయే దురదృష్టపురోజుల్లో ప్రజలు ఆయన్ను అంతగా గుర్తు పెట్టుకుని ఆయనపేరుపై కుమారుడు పెట్టిన పార్టీకి బ్రహ్మరధం పట్టారంటే ప్రతి రాజ కీయ నాయకుడు ప్రజా  సేవకులు ఆలోచించాల్సిన విషయం.

 ఈ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీ గెలుపునకు ఆయన ముఖ్యమంత్రిగా ఆరేళ్లు అందించిన సేవా కార్యక్రమాలే ననేది రుజువవుతున్నది.ఇందిరాగాందీ,µ కొంతవరకూ ఎన్టీరామారావు, ఆ తరువాత ప్రజలు ఇంతగా గుర్తుపెట్టుకున్న నాయకుడు మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఆయన ఆ స్థాయికి ఎదగడానికి ఎంతో సుదీర్ఘ పోరాటం ఉంది. మరెంతో చరిత్ర ఉంది. వీటన్నింటికీ మించిన శ్రమ ఉంది. యమునికి, శివునికి వెరవని ధీరత్వం ఉంది. వైఎస్‌ఆర్‌ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడి దుడుకులు మిట్ట పల్లాలు, చీకటి వెలుగులు, విషాదయోగాలు చవిచూశారు. ఇప్పుడాయన్ను గూర్చి ఇంతగా ఎందుకు ప్రస్తా వించాల్సి వస్తున్నదంటే ఆయన పేరుతో పెట్టిన పార్టీ ప్రభం జనాన్ని సృష్టించి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రానికి మార్పు తేబోతున్నది. 120 ఏళ్లుపైగా సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పు కుంటున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం,బిజెపి లాంటి పార్టీలను తిర స్కరించి ప్రజలు వైఎస్‌ఆర్‌ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారనేది తేట తెల్లం అవుతున్నది.  2004 వరకూ వైఎస్‌రాజశేఖరరెడ్డి ఒక తిరుగుబాటు, అసంతృప్తివాదిగా వీటన్నింటినీ మించి ఫ్యాక్షనిస్టుగానే ముద్ర ఉండేది. కానీ పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్నే మార్చివేసింది. ప్రజలకు సన్నిహితం చేసింది. ప్రజావసరాలను గుర్తించ గలిగారు. అధికారంలోకి రాగానే లాల్‌బహదూర్‌స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు ఉచిత విద్యుత్తుతోపాటు 1200 కోట్ల బకాయిలను మాఫీ చేశారు. అక్కడ నుండి రైతుల్లో విశ్వాసం పెంచారు. ఇంతకాలానికి తమగూర్చి ఆలోచించే నాయకుడు వచ్చారని రైతాంగం సంబరపడింది. 
సంక్షేమ కార్యక్రమాలవైపు దృష్టి సారించి కిడ్నీ, గుండె, కేన్సర్‌లాంటి వ్యాధులు సోకితే యముని పిలుపుకోసం ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్న నిర్భాగ్యులెందరికో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి, తమకు ఆపదలో సహాయం చేస్తుందనే విశ్వాసం కలిగించారు.ఎంతోమందికి ఈ సేవలు అందించారు? ఇలా ఎంతకాలం ఎంతమందికి అందించగలరనేది వేరే విషయం. ఆ పథకం గ్రామాల్లో ఉండే లక్షలాది మంది నిరుపేదలకు గుండెనిబ్బరం కలిగించిందనే మాట వాస్తవం. అర్ధరాత్రి అయినా వైద్యసేవలందించే ఏర్పాట్లు చేసిన 108 తదితర పథకాలు వైఎస్‌ఆర్‌ను పేదల గుండెల్లో నిలిపాయి. అంతేకాదు నభూతో నభవిష్యతి అన్నట్లు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా లక్షకోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన జలయజ్ఞం కూడా ఆయన ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం ధాటికి తాళలేక కనుమరుగైపోతున్న కాంగ్రెస్‌కు జీవంపోసి గ్రామగ్రామానికి తీసుకువెళ్లి ప్రజలకు చేరువచేయడంలో వైఎస్‌ఆర్‌ పాత్ర  కీలకమైంది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని కూడా కొంతలో కొంత క్రమశిక్షణతో ఉంచారనే చెప్పవచ్చు. మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించారు. మొత్తం మీద రాష్ట్రానికి సమర్ధుడైన నాయకుడిగా ఆయన ఎదిగారనే చెప్పొచ్చు. ఆయన ఆకస్మిక మరణం ఆయన పట్ల మరింత సానుభూతిని గౌరవభావాలను పెంచాయి. అయితే అవినీతి విషయంలో మాత్రం సమర్ధించలేం. బహుశా రాష్ట్ర చరిత్రలో అవినీతి తారస్థాయికి చేరుకున్నది. అయితే ఈ అవినీతి గూర్చి ఎప్పటికప్పుడు విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎలుగెత్తి చాటుతూనే ఉంది. జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అంటూ పెద్ద ఎత్తునే ప్రచారం చేశారు. 
రాష్ట్రంలోనే కాక ఢిల్లీకి వెళ్లి అవినీతిపై పుస్తకాలు ముద్రించి పంచారు. మధ్యతరగతి ప్రజల్లో కొంత చర్చజరిగి అవినీతి పట్ల అసంతృప్తిగా ఉన్నా బీదా బిక్కి జనంలో మాత్రం పెద్దగా ప్రభావం లేదు. తింటే తిన్నారు. మాకింత పెట్టారు కదా. అయినా తినకుండా ఉన్నదెవరు? ఈ విమర్శిస్తున్న నాయకులు అవినీతికి దూరంగా ఉన్నారా?  అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే ఎవరు ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టించు కోలేదనే విషయం ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌ సానుభూతిని ఓట్లరూపంలో మార్చుకునేందుకు ఆయన కుమారుడు జగ న్మోహన్‌రెడ్డి మొదటినుంచి ప్రయత్నం చేస్తున్నాడనే విషయం వాస్తవం కావచ్చు. ఆ సానుభూతి తగ్గకుండా ఓదార్పుపేరుతో యాత్రలు చేయడం విగ్రహాలు ఏర్పాటు ఇవన్నీ ఆ వ్యూహంలో భాగమనే విషయం కూడా తెలియనిది కాదు. ఈ దశలో  జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పంపిన తీరు సానుభూతిని మరింత పెంచేందుకు ఉపయోగపడింది. ఈ పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌ సతీమణి, కుమార్తె షర్మిల ప్రచార బాధ్యతలు స్వీకరించడంతో వైఎస్‌ఆర్‌ పార్టీకి మరింత ఊపునిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఆ సానుభూతి పవనాలను మరింత ఉధృతం చేసేం దుకు దోహదపడ్డాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్‌ఆర్‌ పార్టీ దుకాణాన్ని శాశ్వతంగా మూసివేయించాలని హస్తినలోని పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు సర్వ శక్తులు ఒడ్డిపోరాడారు. పార్లమెంటు సభ్యులు పాదయాత్రలు చేశారు. కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. 

ఉప ఎన్నికల్లో ఇంతమంది పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు గతంలో ఎప్పుడూ పాల్గొనలేదని రాజకీయ పరిశీలకులు చెపు తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయం సాధించేందుకు టక్కుటమార విద్యలన్నీ కాంగ్రెస్‌ నాయకులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, ప్రజారాజ్యం మాజీ నేత ప్రస్తుత పార్ల మెంటు సభ్యుడు చిరంజీవి నిర్విరామంగా తిరిగారు. అయినా నిష్ప్రయోజనం అయింది. చివరకు చిరంజీవి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన తిరుపతి స్థానాన్ని కూడా వైఎస్‌ఆర్‌పార్టీ ఎగరేసుకుపోయింది. తన సొంత జిల్లాలో కూడా ఒక్కస్థానాన్ని గెలిపించుకోలేకపోయారనే అపప్రథ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మూటగట్టుకున్నారు.  దీనితో ఇతర చోట్ల పరాజ యానికి కారకులని మంత్రులను ఇతర నాయకులను ప్రశ్నించలేని పరిస్థితి ముఖ్యమంత్రిది. ప్రచారం అంతా జగన్మో హన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడానికే సరిపెట్టుకున్నారు తప్ప తాము చేసే ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టబోయే పథకాలు గూర్చి వివరించడంలో విఫలం అయ్యారని చెప్పొచ్చు.
   వైఎస్‌ఆర్‌ విషయంలో కూడా స్పష్టమైన విధానం లేదు. కొందరేమో వైఎస్‌ఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తే మరికొందరు కాంగ్రెస్‌ నాయకులే ఆయన మా నాయకుడంటూ భుజాన వేసుకున్నారు. ఇలా నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పేర్లు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ వార్డు మెంబర్లుగా గెలవలేని  కొందరు నాయకులైతే విజ్ఞత మరిచి స్థాయి విడిచి దిగజారి చేసిన విమర్శలు వైఎస్‌ఆర్‌పార్టీకి లాభంగా పరిణమించాయి. ఒక్కడిని చేసి ఎన్ని విధాలుగా వేధిస్తున్నారంటూ జగన్‌మోహన్‌రెడ్డిపట్ల కూడా సానుభూతి పెరిగింది. ఇవన్నీ విజయంవైపు నెట్టింది. ఇప్పుడిక కాంగ్రెస్‌ నుంచి వలసలు ప్రారంభమవుతాయని ఊహాగానాలు వెలు వడుతున్నాయి. బొటాబొటీ మెజార్టీతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వా నికి రానున్నది కష్టకాలమేనని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజానాయకులనుకొనే వారు ఒక్క విషయం గమనించాలి. ఎదుటివారిని విమర్శించి నాయకులు కాలేరు ప్రజా హృదయంలో చోటు సంపాదించుకోలేరు.ప్రజల నాడిని పసిగట్టి వారి సమస్యలను,అవసరాలను గుర్తించి కొంత  వరకైనా పరిష్కంచరించగల్గతే ప్రజాభిమానం చూరగొని వారి గుండెల్లో పది కాలాలపాటు నిలిచి పోతారు. నాయకులుగా ఎదుగుతారు.
దామెర్ల సాయిబాబ

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!