YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

అదే వేగం.. తగ్గని దూకుడు ! (andhrabhoomi)



హైదరాబాద్, జూన్ 3: ఉత్కంఠ భరిత వాతావరణం. గట్టి పోలీసు భద్రత. రెంటిమధ్య వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ బృందం ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. సమీపంలోనే ఉన్న జైళ్ల శాఖ ఐజి కార్యాలయం ఆవరణలో జైళ్ల శాఖ ఆఫీసర్ల మెస్‌లో విచారణ జరిపింది. ముందు అనుకున్నట్టుగా దిల్‌కుషా, సిబిఐ కార్యాలయంలో కాకుండా, చంచల్‌గూడ జైలుకు సమీపంలోనే సిబిఐ అధికారులు జగన్ విచారణ ప్రారంభించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జగన్‌ను విచారించిన తర్వాత, తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉదయం 10.30కు చంచల్‌గూడ జైలు నుంచి వైఎస్ జగన్ చెక్కుచెదరని నవ్వుతో జైలునుంచి బయటకు వచ్చారు. అనంతరం సిబిఐ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ఇన్నోవా కారులో సమీపంలోని జైళ్ల శాఖ ఆఫీసర్ల మెస్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి రెండు విడతలుగా జగన్‌ను సిబిఐ అధికారులు విచారించారు. ఇంతవరకు దాఖలైన మూడు చార్జిషీట్లలోని అభియోగాలతోపాటు, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు, వాన్‌పిక్ ప్రాజెక్టు యాజమాన్యం ఫలాపేక్షతో ఇనె్వస్ట్ చేసిన పెట్టుబడులు, సండూర్ విద్యుత్ ప్రాజెక్టుకు వచ్చిన పెట్టుబడులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. మొత్తం 37 అభియోగాలకు సంబంధించి అనుబంధ ప్రశ్నలు సహా దాదాపు 68 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే జగన్‌ను అధికారులు ప్రశ్నించారు. జగన్‌కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆఫీసర్ల మెస్‌లో అన్ని వౌలిక సదుపాయాలున్న విశాలమైన గదిలో కూర్చోబెట్టి న్యాయవాదుల సమక్షంలో సిబిఐ అధికారులు రెండు విడతలుగా ప్రశ్నించారు.
గత ఏడాది ఆగస్టులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, అరెస్టు చేసినప్పుడు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదిక, అభియోగపత్రం, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన ఆధారాల ప్రాతిపతికన సిబిఐ ప్రశ్నాపత్రాన్ని రూపొందించింది. ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు మూడు గంటల పాటు సిబిఐ ఎస్పీ వెంకటేష్, మరో ఇద్దరు అధికారులు ప్రశ్నలు వేశారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంటరాగేషన్ నిర్వహించారు. జగన్ చాలా ప్రశ్నలకు చట్టపరిధికి లోబడి పెట్టుబడులు వచ్చాయని బదులిచ్చినట్టు సమాచారం. గత నెల 25నుంచి 28వరకు మూడు రోజుల పాటు అడిగిన ప్రశ్నలనే సిబిఐ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తాను పరిశ్రమలను స్ధాపించానని, అవకతవకలకు ఆస్కారం లేదని జగన్ కరాఖండిగా బదులిచ్చినట్టు సమాచారం. మొదటి మూడు చార్జిషీట్లలో మొత్తం 74 కోట్ల రూపాయల మేర ఫలాపేక్షతో కూడిన పెట్టుబడులు, వాన్‌పిక్ సంస్థ నుంచి 845 కోట్ల రూపాయల నిధులు, మారిషస్ నుంచి, అలాగే కోల్‌కతా కంపెనీలు, ఆరు విదేశీ కంపెనీల నుంచి నిధులు వచ్చిన వెనంపై సిబిఐ అడిగిన ప్రశ్నలకు జగన్ రికార్డులు చూసుకోవచ్చని, ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదని బదులిచ్చినట్టు సమాచారం. ఒకసారి అడిగిన ప్రశ్ననే మళ్లీ అడిగితే బదులివ్వకుండా వౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాన్‌పిక్ సంస్థ నుంచి పెట్టుబడులు వచ్చిన వైనంపై సిబిఐ సోమవారం మళ్లీ ఆరా తీసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కేసులో ఇప్పటికే పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, రిటైర్డు ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని దగ్గరపెట్టుకుని, జగన్ ఇచ్చిన సమాధానాలను పోల్చి తాజాగా మళ్లీ ప్రశ్నావళిని రూపొందించనున్నట్టు సమాచారం.
ఐదు రోజుల కస్టడీలో దాదాపు 30 గంటల పాటు జగన్‌ను ప్రశ్నిస్తారు. తొలి రోజు ఆరు గంటల పాటు విచారణ జరిపారు. మరో 24 గంటల పాటు మిగిలిన నాలుగు రోజుల్లో జగన్‌ను ప్రశ్నించనున్నారు. కోర్టు అనుమతితో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవిని మళ్లీ కస్టడీకి తీసుకుని జగన్‌తో ముఖాముఖి కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేయాలన్న యోచనతో సిబిఐ ఉన్నట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం జగన్ భార్య జైళ్ల శాఖ ఆఫీసర్స్ మెస్‌కు వచ్చారు. ఆ సమయంలో జగన్ తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి పోలీసుల అనుమతి ఉందని తెలియచేసి భారతిని లోపలికి తీసుకెళ్లారు. 20 నిమిషాల తర్వాత భారతి బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. (చిత్రం) సిబిఐ విచారణ కోసం చంచల్‌గూడ జైలునుంచి బయటకు వస్తున్న జగన్.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!