YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

జగన్మోహన్‌రెడ్డి ఒక్కడిని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ స్వయంగా భారీ మూల్యానే్న చెల్లించాల్సి వస్తోంది.

అధికార కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తున్నట్టు లేదు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు వేస్తున్న వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయి. చివరకు తనే ఆత్మ రక్షణలో పడాల్సి వస్తోంది. ఇటీవలి సంఘటనలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కడిని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ స్వయంగా భారీ మూల్యానే్న చెల్లించాల్సి వస్తోంది. కొత్త సమస్యలు కాంగ్రెస్ మెడకు చిక్కుకుంటున్నాయి. జగన్ అక్రమ ఆస్తుల వ్యహారంలో ఆరుగురు మంత్రులు ఇరుక్కోగా ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కుంభకోణంలో తాజాగా మరో మంత్రి చిక్కుకున్నారు.
జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పన్నిన వ్యూహంలో ఆరుగురు మంత్రులు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నారు. ఇతర మంత్రుల్ని కూడా విచారించేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడు ఏ మంత్రి అరెస్టవుతారో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితి నెలకొంది. జగన్ అవినీతి పరుడని నిరూపించేందుకు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు అవినీతి పరులని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో జగన్ ఒక్కడినే అవినీతిపరునిగా చిత్రీకరించి మంత్రుల్ని బయటపడేయటం ఎలా అన్నది తెలియక కాంగ్రెస్ నాయకత్వం తల పట్టుకుంటోంది. జగన్ వ్యవహారంలో నాయకత్వం అనుస్తున్న వైఖరికి మంత్రుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. కేవలం ఒక్కడి కోసం ఇంతమందిని ఇరికించాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ మంత్రివర్గంలో పని చేయడమే ఒక మహాపరాధం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. ఎలాగోలా వ్యవహారంలో మిగిలిన మంత్రుల్ని కాపాడ గలిగినా, మరో వివాదంలో కాంగ్రెస్ చిక్కుకుంటుంది. జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఇరుక్కున్న ఆరుగురు మంత్రుల్లో ఒకరిని సిబిఐ అరెస్టు చేసింది. బలహీన వర్గాలకు చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేయడం బలహీన వర్గాల నుంచి అందునా మోపిదేవి సామాజిక వర్గమైన మత్స్య కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మోపిదేవి బయటికి వచ్చేంత వరకు చేపల వేటకు వెళ్ళ కూడదని కూడా కొన్ని ప్రాంతాల్లో మత్స్యకార్మికులు తీర్మానించారు. బిసి అయినందునే తనను బలి పశువుని చేశారని అరెస్టు సందర్భంగా మోపిదేవి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో ఇతర మంత్రుల్ని రక్షించినట్లయితే మోపిదేవి వాదన బలపడటంతోపాటు బిసి నుంచి కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. దీనివల్ల రాజకీయంగా కాంగ్రెస్ భారీగా నష్టపోవాల్సి వస్తుంది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో మరో ఒకరిద్దరు మంత్రులు అరెస్టయిన పక్షంలో కేవలం జగన్ మీదనే అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ చేసినా మీ మంత్రుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎదుటివారు అవినీతి పరులని చెప్పడానికి ముందు తమ వారు కూడా అవినీతి పరులని అంగీకరించాల్సి ఉంటుంది. జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.


source:  andhrabhoomi.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!