YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

ఉప ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు
విజయమ్మపై బొత్స వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం
వైఎస్ మరణంపై అడిగే హక్కు ఆమెకే ఉంది
కాంగ్రెస్ నేతలూ.. చేతనైతే బదులివ్వండి... లేదంటే ఊరుకోండి
ఎవరెన్ని కుట్రలు పన్నినా.. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు..
ఉప ఎన్నికల్లో కొండా సురేఖ విజయం తథ్యం

నెల్లూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ నిర్బంధించినా.. ఆయన తప్పు చేసినట్టు జనం నమ్మడం లేదని, ఈనెల 15న వచ్చే ఉపఎన్నికల ఫలితాలు జైలు గోడలను సైతం బద్దలు చేసేలా ఉంటాయని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ అన్నారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం కుక్కిన పేనులా ఉన్న కాంగ్రెస్ నేతలు.. నేడాయన కుటుంబంపై విమర్శలు చేయడంపై జూపూడి మండిపడ్డారు. ఉప ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఉంటుందో.. పతనమవుతుందో తెలియదని, రాష్ట్రపతి పాలన కూడా రావచ్చని అభిప్రాయపడ్డారు. వై.ఎస్.విజయమ్మపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ‘కాంగ్రెస్ నేతలకు అన్నం పెట్టి ఆదరించిన విజయమ్మపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న నేతలందరికీ రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. వైఎస్ మరణంపై ఆయన సతీమణి విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. అడిగే హక్కు కూడా ఆమెకే ఉంది. 

దమ్ముంటే వైఎస్సార్ మరణంపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. లేకుంటే ఊరుకోవాలి’ అని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు. గతంలో మహామహులెందరో జైలుకెళ్లారని చెప్పారు. జార్జి ఫెర్నాండెజ్, పుచ్చలపల్లి సుందరయ్య, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు జైల్లోనే ఉండి ఉద్యమాలు నడిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం కుట్ర.. ఆయన కుటుంబసభ్యులకే తెలుసని బొత్స ఆరోపించడం సిగ్గు చేటన్నారు. దేశంలోనే సంచలనం కలిగించిన మహానేత మరణం కేసును మూడునెలల్లో పూర్తి చేసిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. జగన్ కేసును తొమ్మిది నెలలుగా విచారణ జరపడంలో ఆంతర్యమేమిటన్నారు. ములాయం సింగ్, అద్వానీ, లాలూప్రసాద్ యాదవ్, జయలలిత వంటి నేతలపై అనేక కేసులు ఉన్నప్పటికీ సీబీఐ వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా చిరునవ్వుతో జగన్ నిర్దోషిగా బయటకొస్తారన్నారు.జననేత లేని సమయంలో పార్టీని నడిపించేం దుకు ముందుకొచ్చిన వైఎస్ విజయమ్మకు ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ కొండా సురేఖ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని జూపూడి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఆమె కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. 

ఆ రూ.130 కోట్లు ఎక్కడివి?

ఉపఎన్నికల్లో డిపాజిట్లు అయినా కాపాడుకునేందుకు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బరామిరెడ్డి వేయని వేషాలంటూ ఏమీ లేవని జూపూడి విమర్శిం చారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హెలికాప్టర్ లోంచి దించిన రూ.130 కోట్లను ఆయన ఎక్కడనుంచి తెచ్చారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు టీఎస్సార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ తప్పూ చేయని జగన్‌కు ఈ ఉపఎన్నికల్లో 18అసెంబ్లీ స్థానాలతోపాటు నెల్లూరు ఎంపీ స్థానాన్నిప్రజలు బహుమతిగా ఇవ్వబోతున్నారని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!