YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

సోనియాను విచారించే దమ్ముందా?

ఆమె ఫోన్ ట్యాపింగ్‌కు కోర్టు అనుమతి తీసుకోగలరా?
జగన్ అరెస్టుకు ముందు పదేపదే ఎవరితో మాట్లాడారు?
ఏ ప్రభుత్వంలో మంత్రి కావాలని ఇదంతా చేస్తున్నారు?
అధికార పార్టీ చేతిలో చీపురుకట్టలా వ్యవహరిస్తే సీబీఐకి ప్రజలే బుద్ధి చెబుతారు
రాజీవ్ హంతకురాలికి సోనియా క్షమాభిక్ష పెట్టారు.. అంటే రాజీవ్‌ను సోనియానే చంపారా?

ఒంగోలు, న్యూస్‌లైన్: ‘‘హైదరాబాద్‌లోని దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు జగన్‌ను ప్రశ్నిస్తుండగా.. ఢిల్లీలో గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, కేంద్ర సహాయమంత్రి వి.నారాయణ స్వామి, కేబినెట్ కార్యదర్శి మధ్య ముమ్మరంగా చర్చలు సాగాయి. ఆ తర్వాత మే 27న ఉదయం సోనియాతో ఆజాద్ భేటీ అయ్యారు. ఆ క్రమంలోనే జగన్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయని దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండియాటుడే చెబుతోంది. మాజీ మంత్రి శంకర్రావు ఇచ్చిన చిత్తు కాగితాన్ని పట్టుకొని విచారణ చేస్తున్న సీబీఐ.. ఇండియాటుడే ప్రచురించిన కథనంపై కూడా విచారణ జరపాలి. జడ్జి పట్టాభి ఫోన్‌ను ట్యాప్ చేయడంతో చాలా విషయాలు తెలిశాయని చెబుతున్న సీబీఐ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఫోన్‌ను కూడా ట్యాప్ చేయాలి. ఆ దిశగా కోర్టు అనుమతి తీసుకోవాలి. జగన్‌ను అరెస్టు చేయకముందు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పదేపదే లోపలకు, బయటకు తిరుగుతూ ఫోన్లో మాట్లాడారు. మీరు ఎవరితో మాట్లాడారు. అకౌంట్‌బులిటీ ప్రకారం మీ ఫోన్‌ను ప్రజల ముందు ఉంచాలి. 

లక్ష్మీనారాయణకు దమ్ముంటే ఆ దిశగా విచారణకు సిద్ధం కావాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ అరెస్టు అక్రమమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రతిపక్షం కనుసన్నల్లోనే ఈ అరెస్టు జరిగిందంటూ ఇండియాటుడే ఓ కథనం ప్రచురించింది. గతంలో సీబీఐలో పనిచేసిన విజయరామారావు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎన్టీఆర్‌కు ద్రోహం చేశారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఇప్పుడున్న జేడీ లక్ష్మీనారాయణ ఏ ప్రభుత్వంలో మంత్రి కావాలని ఇదంతా చేస్తున్నారు. అసలు జగన్ దోషి అని మీరెలా నిర్ధారిస్తారు. తనకు ప్రత్యర్థులుగా ఉండేవారిని భయపెట్టి అదుపులోకి తెచ్చుకునేం దుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సీబీఐని పావుగా వాడుకుం టోంది. జగన్ విషయంలోనూ అదే జరిగిందని అన్నా హజారే బృందంలోని సభ్యుడు క్రేజీవాల్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కోట్లకు అమ్ముడు పోయిందని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ చెప్పిన విషయం ఇప్పుడు రుజువ వుతోంది. ఢిల్లీలో జగన్ అరెస్టుకు కుట్రపన్నారని రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి సీబీఐ సిద్ధం కావాలి. లేని పక్షంలో సీబీఐని విచారించే మరో వ్యవస్థ రావాలి. అది ప్రజావ్యవస్థ కావాలి. అధికార పార్టీ చేతిలో చీపురుకట్టలా సీబీఐ వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. 

అసలు జగన్‌పై పెట్టిన కేసే చెల్లదు. ప్రభుత్వం ఇచ్చిన 26 జీఓలపై విచారణ చేయకుండా, అవి ఇచ్చిన మంత్రులు, ఐఏఎస్‌లను విచారించకుండా హడావుడిగా జగన్‌ను లోపల వేయడమంటే ఉప ఎన్నికల ఓటమి భయమేనని స్పష్టమవుతోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారు తమకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. అలాంటప్పుడు జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారు. జగన్ రేపు నిర్దోషిగా బయటకు వస్తారు. అప్పుడు సీబీఐ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి? అలా తీసుకోవాలంటే ఉరిశిక్ష కంటే కఠినమైన శిక్ష వారికి వేయాలి. అనేక తప్పులు చేసిన చంద్రబాబును బయట తిప్పుతూ ఏ తప్పూ చేయని జగన్‌ను లోపల వేశారు. ఒక రాజకీయపార్టీకి, అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్‌కు నష్టం కలిగించిన సీబీఐని ప్రజలు ఛీ కొడుతున్నారు. వైఎస్ మరణానికి కుటుంబ సభ్యులే కారణమని కొందరంటున్నారు. ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడరు. నేను ఒక్కటే అడుగుతున్నా.. రాజీవ్‌గాంధీని చంపిన నళినికి సోనియా క్షమాభిక్ష పెట్టారు. మరి రాజీవ్‌ను చంపింది సోనియానేనా’’ అని గట్టు ప్రశ్నించారు.

కాంగ్రెస్, టీడీపీ నేతలకు పిచ్చి పట్టింది: జగన్ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ నేతలకు పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి కోసం ప్రత్యేకంగా పిచ్చి ఆస్పత్రి కట్టిస్తామన్నారు. వారి వారి కుటుంబసభ్యులు ఏం బాధపడవద్దని, వారికి మంచి చికిత్స ఇప్పిస్తామని పేర్కొన్నారు. వైఎస్ మరణం తర్వాత రైతుల గోడు పట్టించుకున్న నాథుడే లేడని, 33 మంది కాంగ్రెస్ ఎంపీలు, ప్రత్యేకంగా ఇటీవల నోరు పారేసుకుంటున్నవారు ఎవరైనా రైతు సమస్యలపై పార్లమెంటులో మాట్లాడారా? అని ప్రశ్నించారు. 

జలదీక్ష, రైతుదీక్ష, ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేసి, రైతుల సమస్యలపై గొంతెత్తిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు దారా సాంబయ్య, బాచిన చెంచుగరటయ్య, జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొటారి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!