YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

జగన్ అరెస్టుకు ఢిల్లీలో కుట్ర!


సోనియా, ఆజాద్, వయలార్‌ల నిర్ణయాన్ని సీబీఐ అమలుచేసింది
జగన్ త్వరలోనే బయటకు వస్తారు
టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అంబటి పిలుపు
తిరుపతి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో గులాంనబీ ఆజాద్, వయలార్ రవి తదితరులు సమావేశమై తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ అమలు చేసి జగన్‌ను అరెస్టు చేసిందని విమర్శించారు. అంబటి ఆదివారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ను ఎక్కువ కాలం జైలులో నిర్బంధించలేరని స్పష్టంచేశారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని.. అందువల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నిరుత్సాహపడాల్సిన పనిలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని నిర్బంధం చేస్తే ఒక పని అయిపోతుందని, ప్రచారం ఎక్కడికక్కడే స్తంభించిపోతుందని కాంగ్రెస్, టీడీపీలు భ్రమించాయని పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ ప్రచార సభలకు అశేష జనవాహిని తరలి వస్తోందని చెప్పారు. అది చూసి బెంబేలెత్తి విజయమ్మ ప్రచారానికి అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. జగన్ అరెస్ట్, తదనంతర పరిణామాలను చూసి ప్రజలు కాంగ్రెస్, టీడీపీలను అసహ్యించుకుంటున్నారని తెలిపారు.


జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తీసుకెళితే అక్కడ ఇరువైపులా బ్యారక్‌లలో ఉన్న విచారణ ఖైదీలు లేచి నిలబడి జగన్‌కు అనుకూలంగా, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. జగన్‌ను కోర్టు హాలులో ప్రవేశపెట్టే సమయంలో కోర్టుహాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయి వారంతా ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడడం వంటి సంఘటనలు జగన్ అరెస్ట్‌ను రాష్ట్రం ఖండిస్తోందనడానికి నిదర్శనమని అంబటి పేర్కొన్నారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో ఢిల్లీ ఆదేశాల మేరకు 60 రోజుల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా ఏడుగురు నిందితులను వదిలిపెట్టిన సీబీఐ.. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి ద్వంద్వ ప్రమాణాలను పాటించిందని దుయ్యబట్టారు.

జగన్ ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని, చట్టబద్ధంగానే వ్యాపారాలు చేస్తున్నారని రాంబాబు స్పష్టంచేశారు. ఆయన అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందే తప్ప మరొకటి కాదన్నారు. ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని.. దీనిపై 12న తీర్పు ఇవ్వనున్నారని తెలిపారు. తమ పన్నాగాలన్నీ భగ్నం కావడంతో చివరి ప్రయత్నంగా డబ్బుతో ఓటర్లను కొనేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని అంబటి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!