YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

ఆట ఇప్పుడే మొదలైంది..!



మండపేట/రామచంద్రపురం(తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: ‘‘రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను జైల్లో పెడితే ఆ పార్టీ పనైపోతుందని పాలక, ప్రతిపక్షాలు భావించాయి. అయితే వారు మొదలుపెట్టిన ఆట అయిపోలేదు. విజయమ్మ ప్రచారంతో ఇప్పుడే మొదలైంది’’ అని పార్టీ నాయకురాలు, సినీనటి రోజా వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం జిల్లాకు వచ్చిన ఆమె.. మండపేట, రామచంద్రపురంలలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై జనానికి ఉన్న అభిమానాన్ని దూరంచేసే సత్తా జైలు గోడలకు లేదన్నారు. ఆ వాస్తవాన్ని తట్టుకోలేకే విజయమ్మ సూట్‌కేసులలోని దుస్తులను సైతం రోడ్డున పడేసి తనిఖీలు చేసి అక్కసు వెళ్లగక్కుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్రమంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి వాహనాలు, సూట్‌కేసుల్లోని దుస్తులను తనిఖీ చేయించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇంతకంటే ఎక్కువగా అధికార దుర్వినియోగం చేసిన కడప, కోవూరుల్లో పట్టిన గతే ఈ 18 నియోజకవర్గాల్లోనూ పడుతుందని హెచ్చరించారు. వైఎస్ మృతి పట్ల ఆయన అభిమానుల్లో ఉన్న అనుమానాలనే విజయమ్మ ప్రస్తావిస్తున్నారని, కాంగ్రెస్ పెద్దలు భుజాలు తడుముకోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయని రోజా పేర్కొన్నారు. నాడు భర్తను పోగొట్టుకున్న ఆ మహా ఇల్లాలు నేడు కొడుకును అకారణంగా జైలులో పెట్టారని బాధపడుతుంటే, కనీసం జాలిలేని పాలక ప్రతిపక్షాలకు తోడు ఎల్లో మీడియా ఆమెను ఏకవచనంతో సంబోధించే స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం సీబీఐ ద్వారా బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

దేశంలోని సీఎం, మాజీ సీఎంల భారీ కుంభకోణాలకు సంబంధించి ఎన్నో కేసులను పక్కనపెట్టి ఉప ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సోనియాగాంధీతోపాటు ఇటలీలోని ఆమె బంధువులను రక్షించేందుకు బోఫోర్స్ కుంభకోణం మూలాల్లోకి వెళ్లకుండా ఆ కేసును సీబీఐ నీరుగార్చిందన్నారు. మద్యం మాఫియాలో కూరుకుపోయిన బొత్సను కాపాడేందుకే వెనుబడినవర్గాలకు చెందిన మంత్రి మోపిదేవిని అన్యాయంగా ఇరికించారని దుయ్యబట్టారు. జగన్‌కు జైలుశిక్ష ఖాయమంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి న్యాయమూర్తి అవతారమెత్తుతున్నారని, 2014లో అసలైన శిక్ష కాంగ్రెస్ నాయకులందరికీ ప్రజలే వేస్తారని స్పష్టంచేశారు. రైతుల కోసం 17 మంది ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేస్తే, రాజ్యసభ సీటు కోసం చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. కాగా, జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మండపేటలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్, నియోజకవర్గ ఉప ఎన్నికల ఇన్‌చార్జి చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు తదితరులు రోజా వెంట ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!