YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

వైఎస్‌కు ‘అనంత’పై ఎనలేని ప్రేమ

‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనంతపురం జిల్లాపై అనంతమైన ప్రేమను చూపించారు. మీ ప్రేమ, ఆప్యాయత గురించి ఎన్నోసార్లు నాకు చెప్పారు. ఇప్పుడు నాకు నేనుగా చూస్తున్నాను. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత మీకు మరింత దగ్గరయ్యారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చూసుకున్నారు. అనంతపురం ప్రజలకు సంపూర్ణంగా తాగునీటిని అందించేందుకు రూ.67 కోట్లతో పీఏబీఆర్ పైప్‌లైన్ వేయించారు. 

రూ.55 కోట్లతో బుక్కరాయసముద్రం చెరువు కట్ట రోడ్డు నిర్మాణం చేపట్టారు. పేదలకు అండగా ఉంటూ నగరంలో 19 వేల మందికి పింఛన్లు మంజూరు చేశారు. 2,194 ఇళ్లు కట్టించారు. ఆయన మరణంతరువాత పథకాలకు పాతర వేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 750 పింఛన్లు ఇచ్చారు. 11 ఇళ్లు మాత్రమే నిర్మించార’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. ఈ ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, పార్టీ అభ్యర్థి గురునాథరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ, షర్మిల మంగళవారం అనంతపురం నగరంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక తాడిపత్రి బస్టాండ్, సప్తగిరి సర్కిల్ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారన్నారు. ఆయన రెక్కల కష్టంతోనే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. 25 ఏళ్ల పాటు ప్రజల మధ్య ఉండి వారి అవసరాలను గుర్తించారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పథకాలను అమలు చేశారని చెప్పారు. ‘నీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్నారు. ఆయన మరణం తరువాత జలయజ్ఞం నిలిచిపోయింది. 

పభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా చూశారు. ఈ విషయంలో వైఎస్‌ఆర్ ఎక్కడా తప్పు చేయలేద’ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున 500 ఎకరాల భూమి ఇస్తే తప్పనిపించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును సీబీఐ విచారణ చేయదని, అదే వైఎస్‌ఆర్‌పై అయితే చేస్తోందని అన్నారు. ‘వైఎస్‌ఆర్ కొడుకుగా పుట్టడమే జగన్‌బాబు చేసిన తప్పా? వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌బాబు ఏ ఒక్క రోజూ కనీసం క్యాంప్ కార్యాలయానికి కూడా వెళ్లలేదు. ఏ ఒక్క అధికారి తోనూ మాట్లాడలేదు. వైఎస్ సీఎం కాకముందే 2003 డిసెంబర్ 25న బెంగళూరులో పవర్ ప్రాజెక్ట్ నిర్మించారు. కరీంనగర్‌లోనూ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. జగన్‌కు కోట్ల రూపాయలు ఉన్నాయని అంటున్నారు. అలా ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీలోని వాటాలను ఎందుకు అమ్ముకుంటార’ని ప్రశ్నించారు. 

ఇచ్చిన మాట కు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయడంతోనే జగన్‌ను వేధిస్తున్నారన్నారు. 26 జీవోల జారీ విషయంలో సమష్టి నిర్ణయం ఉంటుందని, మంత్రులను విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా సీబీఐ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ మరణంపై అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తానెవరినీ నిందించడం లేదన్నారు. అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి తమపైనే కాంగ్రెస్ నాయకులు నీచంగా నిందలు వేస్తున్నారన్నారు. గురునాథరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌బాబుకు అండగా ఉన్నామని కాంగ్రెస్, టీడీపీలకు తెలియజేయండంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!