YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 12 June 2012

ఒంగోలు.. కాంగ్రెస్ దౌర్జన్యం

బాలినేనిపై దూషణల పర్వం.. పోలీసుల లాఠీచార్జితో పలాయనం 
పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ హల్‌చల్ 

ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల పోలింగ్‌కు పాల్పడింది. అందుకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు దాడికి యత్నించారు. పాత మార్కెట్ సెంటర్లోని సెయింట్ థెరిస్సా హైస్కూలులో ఉన్న పోలింగ్ కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ, కాంగ్రెస్ ఏజెంట్లు మధ్యాహ్నం నుంచే వైఎస్సార్ సీపీ ఏజెంటును బెదిరించి బయటకు పంపించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి టీడీపీకి దొంగ ఓట్లు వేయించటంలో నిమగ్నమయ్యారు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్ళిన బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడున్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున వెయిటింగ్‌లో ఉండే ఏజెంటును అనుమతించటంతో బాలినేని అక్కడినుంచి బలరాం కాలనీవైపు వెళ్ళారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్.. బాలినేనికి ఎదురుగా వెళ్ళారు. 

వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ‘సాక్షి’ వాహనంపై పిడిగుద్దులతో అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరందరినీ చెదరగొట్టి ఇరువర్గాల వారిని పంపించి వేశారు. ఆ తరువాత పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాలినేనిని అసభ్య పదజాలంతో దూషించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ సమయంలో ఆమంచి పక్కనే ఉన్నారు. వీరందరూ వెళ్ళిన తరువాత తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం వచ్చి కాసేపు హంగామా సృష్టించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొండపి ఎమ్మెల్యే జి.వి.శేషులు గద్దలగుంట, ఏబీఎం కాలేజీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. పోలీసులు వీరిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించటం విమర్శలకు తావిచ్చింది. ఒంగోలు నియోజకవర్గంలో మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్దలగుంటలోని నాలుగు బొమ్మల స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోకి జర్నలిస్టులు వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వెంటనే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన జర్నలిస్టులను అనుమతించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!