YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 20 June 2012

ఏ ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ స్వీప్


- వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రతిన
- ఇడుపులపాయలో మహానేతకు ఘన నివాళులు
- కాంగ్రెస్‌కు దమ్ముంటే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
- జగన్ నిర్దోషి అని ప్రజా కోర్టులో తేలింది..
- ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తారు
- తెలంగాణ ప్రజలూ వైఎస్సార్‌సీపీ వైపేనని పరకాల చాటింది

కడప (వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ‘అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష స్థానంలోని తెలుగుదేశం పార్టీ రెండూ కుమ్మక్కయ్యాయి. దీంతో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీయే లేకుండా పోయింది. అందుకే ఆ బాధ్యతను ప్రజలు మాకప్పగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇక నుంచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ నాయకత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటించారు.

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఈ మేరకు వారు ప్రమాణం చేశారు. ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ నూతన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 15మంది ఎమ్మెల్యేలు బుధవారం ఇడుపుల పాయకు వచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్‌ఘాట్‌ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు వేసి మౌనం పాటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని మహా నేతకు అంకితమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యేల తరఫున మేకపాటి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆశీస్సులు, ప్రజల అండతోనే జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని కొనియాడారు. ‘వైఎస్ తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను దోషిగా చిత్రీకరిస్తూ, నిత్యం విమర్శిస్తున్నారు.

అంతటితో ఆగక ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారు. చివరకు జగన్‌ను జైలుకు పంపారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకున్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రవర్తించారు. ప్రజలు వీటన్నిటినీ గమనించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పరిణతి చూపారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అఖండ మెజారిటీతో గెలిపించారు’ అని మేకపాటి, శోభ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జగన్ నిర్దోషి అని ప్రజా కోర్టులో ప్రజలే తీర్పు ఇచ్చారన్నారు.

‘మా పార్టీ సాంకేతికంగా 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచినా నైతికంగా మొత్తం 18 చోట్లా విజయం సాధించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవడం వల్లే రామచంద్రాపురం, నర్సాపురాల్లో ఓడింది. తెలంగాణ ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని పరకాల ఉప ఎన్నిక ఫలితంతో స్పష్టమైంది. పార్టీ అభ్యర్థి కొండా సురేఖను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టీడీపీలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి నీచ రాజకీయాలు చేశాయి. అయినా సురేఖ విజయం అంచుల దాకా వచ్చారు.

మున్ముందు తెలంగాణతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీతో గెలుస్తాం’ అని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని వారు సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు జగన్‌కు అండగా నిలిచారని మేకపాటి అన్నారు. జగన్ త్వరలోనే జైలు నుంచి ప్రజల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో వైఎస్ కంటే మరింత మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం...
‘అసెంబ్లీలోనూ, బయట ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ మేమే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ప్రజా సమస్యలపై పోరాటం, అనుసరించాల్సిన వైఖరి, భవిష్యత్ ప్రణాళికలపై విజయమ్మ ఆధ్వర్యంలో జరిగే భేటీలో నిర్ణయిస్తాం. కాంగ్రెస్, టీడీపీలకు ఉప ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లే రాలేదు’ అని శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన ఎమ్మెల్యేల తొలి శాసనసభా పక్ష సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు.

వైఎస్‌కు నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యేలు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారె డ్డి, మేకతోటి సుచరిత, బాలరాజు, గొల్ల బాబూరావు, ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులున్నారు. ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి సైతం బుధవారం మహానేత వైఎస్ సమాధివద్ద నివాళులర్పించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం నేడు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ఈనెల 21వ తేదీ గురువారం హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం 9 గంటలకు జరుగనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

22 వ తేదీన అసెంబ్లీ స్పీకర్ వద్ద ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనుండగా, శాసనసభా పక్షం తరఫున ఆయా ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలనే అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు కరవు పరిస్థితులు నెలకొని ఉండగా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తొలకరి ప్రారంభం అయినా రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేవు. గ్రామాల్లో మంచినీటి కొరత, విద్యుత్ కొరత పీడిస్తున్నాయి. ఈనేపథ్యంలో సమావేశమవుతున్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!