మీడియా ద్వారా ప్రజలకు నా భావాలు వెల్లడించేందుకు జైలు అధికారులు అనుమతివ్వడం లేదు..
ఇది ప్రాథమిక హక్కును హరించడమే
{పజలకు తమ భావాలను చేరవేసే హక్కు రాజకీయ ఖైదీలకుంది
అండర్ ట్రయల్ ఖైదీకి ఆంక్షలు వర్తించవు.. వారు ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు
రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
ఒక వర్గం మీడియా నాపై సమాంతర విచారణ చేస్తోంది
నా కుటుంబంపై, నా పార్టీపై దుష్ర్పచారం చేస్తోంది
{పజల దృష్టిలో నన్ను చెడుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు
నిజానిజాలు ప్రజలకు చెప్పుకొనే హక్కు నాకుంది
లేఖలు, సందేశాలకు అనుమతించేలా ఆదేశించండి
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో తన భావాలను మీడియా ద్వారా లేఖలు, మౌఖిక సందేశాల రూపంలో ఓటర్లకు తెలియచేసేందుకు జైలు అధికారులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చంచల్‌గూడ జైలులో ఉన్నంత కాలం తన భావాలను ఓటర్లకు తెలియజేసేందుకు అనుమతించేలా హోం శాఖను, జైలు శాఖాధికారులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీఐజీ, సీబీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన భావాలను లేఖలు, మౌఖిక సందేశాల రూపంలో ఓటర్లకు తెలియజేసేందుకు అనుమతినివ్వకపోవడం తన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రాథమిక హక్కుల విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు తమ భావాలను, ఆలోచనలను చేరేవేసే హక్కు రాజకీయ ఖైదీలకు ఉందని, దాన్ని కాలరాయడం రాజ్యాగ విరుద్ధమే గాక, మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుందని పేర్కొన్నారు.
అండర్ ట్రయల్ ఖైదీకి ఆంక్షలు వర్తించవు
‘‘నేను ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని. ప్రస్తుతం రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారి తరఫున ప్రచారం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ బాధ్యతలను నిర్వర్తించకుండా చేసే కుట్రలో భాగంగానే నన్ను జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం అత్యవసరం. కాని ప్రస్తుతం ఈ విషయంలో రాజీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నా భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే విషయంలో నాపై విధిస్తున్న ఆంక్షలే ఇందుకు నిదర్శనం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ప్రజల్లో నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. నా నిర్దోషి త్వాన్ని రుజువు చేసుకునే హక్కు నాకుంది. సమాజంలో హుందాగా జీవించే హక్కును రాజ్యాంగం నాకు ప్రసాదించింది. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశాలతో నాకు వ్యతిరేకంగా ప్రజలకు అవాస్తవాలను ప్రచారం చేసే కార్యక్రమాన్ని నా రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థులు చేపట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి నా భావాలను ప్రజలతో పంచుకునే విషయంలో జైలు అధికారులు అనవసరమైన ఆంక్షలు విధిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడిగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక పౌరుడిగా నా భావాలను ప్రజలతో పంచుకునే హక్కు ప్రతి దశలోనూ నాకుంది. ఇందుకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఆ హక్కుల అమలుపై ఇప్పుడు జైలు అధికారులు అమలుపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన హక్కులు ప్రసాదించింది. జైలులో ఉన్నాను గనుక ఈ హక్కులపై ఆంక్షలు విధిస్తామంటే కుదరదు. ఇలా చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు సైతం విరుద్ధం. అండర్ ట్రయల్ ఖైదీల నుంచి ఇంటర్వ్యూలు, ఇతర సందేశాలు తీసుకునేందుకు జైలు నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిపై ఎలాంటి ఆంక్షలూ విధించడానికి వీల్లేదు. బయటి ప్రపంచాన్ని ఉద్దేశించి అండర్ ట్రయల్ ఖైదీ పంపే లేఖల విషయంలో ఎలాంటి పరిశీలన గానీ, జైలు అధికారుల సంతకం గానీ అవసరం లేదు. శిక్ష పడిన ఖైదీ విషయంలో అమలు చేసే ఆంక్షలను అండర్ ట్రయల్ ఖైదీ విషయంలో అమలు చేయడం సరికాదు.
అండర్ ట్రయల్ ఖైదీని అతనిపై ఆరోపణలు రుజువయేదాకా అమాయకుడిగానే భావించాలి. రాజకీయ కోణంలోనే నా అరెస్టు జరిగింది. ఓ వర్గం మీడియా నాపై, నా కుటుంబంపై, నా పార్టీపై దుష్ర్పచారం చేస్తోంది. దర్యాప్తుకు సంబంధించి అందుతున్న ఉద్దేశపూర్వక లీకుల ఆధారంగా ఇదంతా సాగుతోంది. ఈ కేసులో మీడియా సమాంతర విచారణ చేస్తోంది. ప్రజల దృష్టిలో నన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేందుకు నా రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం నాకిచ్చిన హక్కుల ఆధారంగా ప్రజలతో నా సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాను. అందులో భాగంగానే నా భావాలను మీడియా ద్వారా లేఖలు, సందేశాల ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. అందుకు అనుమతించేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయండి’’ అని జగన్ తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
No comments:
Post a Comment