YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

వారం రోజులుగా నిరీక్షణ




పొడవైన తెల్లగడ్డం.. మాసిన జుట్టు.. పంచకట్టుతో ఉన్న ఓ వృద్ధరైతు.. చంచల్‌గూడ జైలుకు సమీపంలో వారం రోజులుగా నిరీక్షిస్తున్నాడు. సుదూర ప్రాంతం నుంచి జననేత జగన్‌ను చూసేందుకు రాజధాని నగరానికి వచ్చిన ఆ వృద్ధుని నిరీక్షణ ఎట్టకేలకు బుధవారం ఫలించింది. చంచల్‌గూడ జైలులోకి వెళుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసిన ఆయన కళ్లలో ఒక్కసారిగా వెయ్యి వోల్టుల బల్పు వెలిగినంత సంతోషం. జగన్‌ను చూసేందుకు ఎదురుచూస్తూ ఏడ్చిన ఆ కళ్లలో.. ఆ వెంటనే సంతోషంతో కూడిన ఆనంద బాష్పాలు.

మే 29 నుంచీ ఇక్కడే..

ప్రకాశం జిల్లా నరిపూడి మండలం చిలంకూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల రైతు లక్ష్మీ నర్సయ్య.. జగన్ అరెస్టు విషయం తెలుసుకొని మే 29న హైదరాబాద్‌కు వచ్చాడు. మరుసటి రోజు నుంచి ప్రతిరోజూ చంచల్‌గూడ వద్దకు వచ్చి సాయంత్రం వరకు నిరీక్షిస్తున్నప్పటికీ లక్ష్మీనర్సయ్య నిరీక్షణ ఫలించడంలేదు. పోలీసులు వెళ్లిపొమ్మన్నప్పటికీ.. ‘నా బిడ్డ జగన్‌ను చూడాల్సిందే.. అప్పటి వరకూ కదిలేది లేదు’ అంటూ అతడు రోజూ జైలు చుట్టే తిరుగుతున్నాడు. ప్రతిరోజూ చంచల్‌గూడ వద్దకు వస్తున్నప్పటికీ జగన్ బయటకు వస్తున్న సమయంలో అక్కడకు అనుమతించడంలేదని ఆయన మీడియా వద్ద వాపోయాడు. ఒక్కసారి జగన్‌ను చూపించండంటూ జైలు ప్రధాన ద్వారం వద్దనున్న పోలీసుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీటి పర్యంతమవుతున్న అతన్ని సముదాయించిన పోలీసులు జగన్‌ను చూసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు బుధవారం సీబీఐ విచారణ అనంతరం తిరిగి జైలుకు తరలించే క్రమంలో జగన్‌ను కొద్ది దూరం నుంచి చూసే అవకాశాన్ని లక్ష్మీనర్సయ్యకు పోలీసులు కల్పించారు. జైలు ప్రధాన ద్వారం సమీపంలోని బారికేడ్ పక్కన నిల్చుని.. జైలు లోపలికి వెళుతున్న జగన్‌ను దగ్గర నుంచి చూడగలిగాడు. ఆ సమయంలో ఆయన కంట కన్నీరు కనిపించింది.

మాలాంటోళ్లకు మేలు జరగాలంటే..

లక్ష్మీనర్సయ్య విలేకరులతో మాట్లాడుతూ... ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చచ్చిపోయి ఎక్కడున్నాడో... పెజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. మాలాంటోళ్లకు మేలు జరగాలంటే జగన్ ఖైదు నుంచి బయటకు రావాలి. జగన్‌ను చూడాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు ఆయన్ను చూడగల్గా. ఆయనను చూడటంతోనే ఇన్ని రోజులు ఎదురుచూశాననే విషయమే మర్చిపోయాను’’ అని సంతోషం వ్యక్తంచేశాడు. జననేత జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు వార్త విని తట్టుకోలేక ఆయనను ఒకసారి చూద్దామనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి చంచల్‌గూడకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విచారణ నిమిత్తం జగన్‌మోహన్‌రెడ్డిని బయటకు తీసుకుని వె ళ్లే సమయంలో చంచల్‌గూడ జైలు రోడ్డుకు రెండు వైపులా పోలీసులు ట్రాఫిక్‌ను నిలుపుదల చేయడంతో ఎవరూ ఆ ప్రాంతానికి రాలేకపోతున్నారు. జననేత జగన్‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న అభిమానులకు దీంతో నిరాశే మిగులుతోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!