హైదరాబాద్/సికింద్రాబాద్, న్యూస్‌లైన్: తిరుపతి తరవాత అంతటి ఆదరణ ఉన్న పుణ్యక్షేత్రం షిర్డీ. రాష్ట్రం నుంచి నిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తున్నా సరైన రవాణా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. దీన్ని ప్రైవేట్ ట్రావెల్స్ రెండు చేతులా అందిపుచ్చుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కానీ వాటి నిర్లక్ష్యం, కక్కుర్తి వల్ల అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఇటు ఆర్టీసీ, అటు దక్షిణ మధ్య రైల్వేలతో పాటు ఏపీ టూరిజం కూడా షిర్డీ మార్గంపై దృష్టి పెట్టడం లేదు.హైదరాబాద్ నుంచి షిర్డీకి నిత్యం కేవలం ఐదు ఆర్టీసీ బస్సులు మాత్రమే (2 సూపర్ లగ్జరీ, 2 గరుడ, ఒక వెన్నెల) మాత్రమే నడుస్తున్నాయి. వారాంతాల్లో కూడా వాటి సంఖ్యను ఆర్టీసీ పెంచడం లేదు. ‘హ్యాపీ టూరిజం’ అని గొప్పగా చెప్పుకునే ఏపీ టూరిజం కూడా కేవలం పది బస్సులే నడుపుతోంది. ధర కూడా సూపర్ లగ్జీరీ రూ.602, గరుడ రూ.800, వెన్నెల స్లీపర్ రూ.1,300 దాకా ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు వాటి పట్ల ఆసక్తి చూపడంలేదు.
సికింద్రాబాద్ నుంచి నిత్యం రెండు రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నా నిజానికి ఇక్కడి నుంచి నేరుగా వెళ్తున్నది ఒక్క రైలు మాత్రమే! అది కూడా నాగర్‌సోల్ వరకే వెళ్తుంది. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో 40 కిలోమీటర్లు ప్రయాణించి షిర్డీ చేరాలి. పసిపిల్లలు, లగేజీతో వెళ్లేవారికి ఇది బాగా ఇబ్బం దికరం. ఇక విశాఖ నుంచి వారానికి ఐదు, కాకినాడ నుంచి రెండు, విజయవాడ నుం చి ఒక్క షిర్డీ రైళ్లు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. తీవ్ర రద్దీ కారణంగా ప్రారంభ స్టేషన్లు మినహా మిగతా చోట్ల నుంచి వాటిలో రిజర్వేషన్ దొరకడమే దుర్లభం!
గత్యతరం లేక: రవాణా సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పూర్తిగా సొమ్ము చేసుకుంటున్నాయి. రోజూ 20 నుంచి 25; వారాంతాల్లో 40 నుంచి 50 దాకా బస్సులు నడుపుతున్నాయి. రద్దీ లేనప్పుడు టికెట్ ధర విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించడం, కాలనీల దాకా వచ్చి ఎక్కించుకోవడం, తిరిగి అక్కడే దింపడంతో ప్రైవేట్ బస్సులకు ఆదరణ లభిస్తోంది. అయితే కాసుల కక్కురితో తరచూ అవి మృత్యుశకటాలుగా మారుతున్నాయి. డీజిల్ ఆదా చేసే కక్కుర్తితో షార్ట్ కట్ రూట్లలో వెళ్లి అతి వేగంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి జహీరాబాద్-ఒమర్గా-నల్‌దుర్గ్-తింబుర్ని-షోలాపూర్-అహ్మద్‌నగర్ మీదుగా షిర్డీకి ప్రధాన మార్గముంది. 748 కి.మీ. ఉండే ఈ రూటును కాస్త భద్రమైనదిగానే చెప్పొచ్చు. డీజిల్ ఖర్చు తగ్గుతుందని షోలాపూర్ సమీపం నుంచి తుల్జాపూర్ రూట్‌కే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ రూట్లో దూరం 586 కి.మీ.కి తగ్గుతోంది. కానీ సింగిల్ రోడ్డు కావడం, సరైన మౌలిక వసతులూ లేకపోవడం తరచూ ప్రమాదాలకు దారి తీస్తోంది.
‘ప్రమాద’ మార్గమే: షోలాపూర్, ఉస్మానాబాద్ మార్గంలో జరిగిన ప్రమాదాల్లో రాష్ట్రవాసులు దుర్మరణం పాలవడం పరిపాటిగా మారింది. 2010 మార్చిలో కాళేశ్వరి ట్రావెల్స్‌కే చెందిన బస్సు షిర్డీ వెళ్తూ ఇదే మార్గంలో ప్రమాదానికి గురవడంతో రాష్ట్రానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
2011 మేలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఉస్మానాబాద్ సమీపంలోనే నల్‌దుర్గ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఘాట్ దిగుతూ ప్రమాదానికి గురవడంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరితో పాటు మొత్తం నలుగురు మరణించారు. 2012 జనవరిలో రామ్‌నగర్ డివిజన్ రిసాల్ ప్రాంతానికి చెందిన కేఎన్ విన్నూ ముదిరాజ్ షిర్డీ నుంచి ఓల్వో బస్సులో తిరిగి వస్తూ షోలాపూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించారు. నగరానికే చెందిన బీఏ శ్రీనివాసరావు కూడా ఇటీవల ప్రైవేట్ వాహనంలో షిర్డీ వెళ్లి వస్తూ బీదర్ సమీపంలో ప్రమాదం బారిన పడ్డారు. ఆయనతో సహా కుటుంబంలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు.
28 మృతదేహాల అప్పగింత
షోలాపూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షిర్డీ యాత్రికుల మృతదేహాలను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో వారి కుటుం బ సభ్యులకు అందజేశారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 8 వరకు మొత్తం 28 మృతదేహాలను గుర్తించి సంబంధీకులకు అప్పగించారు. సుదూర ప్రాంతాలకు తరలించాల్సి ఉండటంతో మృతదేహాలు పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహించినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాందాస్ తెలిపారు. ప్రమాదంలో మొత్తం 29 మంది మరణించడం తెలిసిందే. ఒకరి మృతదేహాన్ని స్వస్థలం నాగపూర్ పంపించారు.
ఎంజీబీఎస్‌లో బాధితుల లగేజీ: షిర్డీ బస్సు ప్రమాద మృతులు, క్షతగాత్రుల లగేజీని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. వాటిని ఎంజీబీఎస్‌లోని క్లాక్‌రూంలో భద్రపరిచారు. బాధిత కుటుంబాలకు వాటిని అప్పగించే బాధ్యతను చార్మినార్ తహసీల్దార్ ఆర్.రత్నకల్యాణికి అప్పగించారు. బాధిత కుటుంబాలు గుర్తింపు కార్డులతో ఎంజీబీఎస్‌లోని 45వ ప్లాట్‌ఫామ్ వద్ద పోలీస్ ఔట్‌పోస్టులో సంప్రదించాలని ఆమె సూచించారు.
No comments:
Post a Comment