YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

తుస్సుమన్న బాబు షో


 టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి శృంగభంగం ఎదురైంది. రాయదుర్గం, అనంతపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలకు జనం కరువయ్యారు. రూ.200 నగదు, బిర్యానీ ఇస్తామన్నా జనం రాకపోవడంతో టీడీపీ అభ్యర్థులు బేజారెత్తారు.

రోడ్‌షోలకు జన సమీకరణ చేయకపోతే ఎలా అంటూ అధినేత రుసరుసలాడటంతో టీడీపీ అభ్యర్థులు, అగ్రనేతలు డీలా పడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 1, 2 తేదీల్లో చంద్రబాబు అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటించిన విషయం విదితమే. అప్పుడు కూడా ఆ పార్టీ నేతలు ఊహించిన స్థాయిలో జనం రాలేదు. ఆ సమయంలోనూ పార్టీ నేతలపై చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. సరిగ్గా నెల తర్వాత మంగళవారం మరోసారి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుమ్మఘట్ట మండలం పూలకుంట క్రాస్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పూలకుంట క్రాస్‌లో ఒకింత మెరుగ్గా జనం కనపడ్డారు.

ఆ తర్వాత గ్రామాల్లో మొహం చాటేశారు. రంగసముద్రం, తాళ్లకెర, బీటీపీ, గుమ్మఘట్ట, గోనబావి, కలుగోడు గ్రామాల్లో జనం లేక బాబురోడ్‌షో తుస్సుమంది. ‘దుర్గం’లో రోడ్‌షోలకు జన సమీకరణలో విఫలం కావడంతో చంద్రబాబు చిర్రుబుర్రులాడారని, దీంతో పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు కలుగోడు నుంచి అనంతపురానికి చేరుకున్నారు. ఇక్కడా ‘దుర్గం’పరిస్థితులే పునరావృతమయ్యాయి. నగరంలోని కృష్ణ థియేటర్ వద్ద నుంచి గుత్తిరోడ్డు, తాడిపత్రి బస్టాండు, పవర్ ఆఫీసు, సంగమేశ్ సర్కిల్, కలెక్టరేట్ మీదుగా నవోదయ కాలనీ వరకూ రోడ్‌షో నిర్వహించారు. తాడిపత్రి బస్టాండు వద్ద మాత్రమే ఒకింత మెరుగ్గా జనం కన్పించారు. వీరిని కూడా శింగనమల నియోజకవర్గం నుంచి రూ.150 కూలి, భోజనం పెట్టించి తీసుకొచ్చారు. తాడిపత్రి బస్టాండు తర్వాత నవోదయకాలనీ వరకూ నిర్వహించిన రోడ్‌షోలకు జనం మొహం చాటేశారు.

దీంతో చిర్రెత్తిపోయిన చంద్రబాబు అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ నేతలపై ఆగ్రహించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి ఆర్డీటీ అతిథి గృహంలో బసచేసిన చంద్రబాబు.. అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని ‘క్లాస్’ తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇదేరోజు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిర్వహించిన రోడ్‌షోలకు జనం విశేషంగా తరలిరావడం, చంద్రబాబు రోడ్‌షోలకు మొహం చాటేయడం టీడీపీ అభ్యర్థులకు మింగుడుపడడం లేదు. అధినేత రోడ్‌షోలకు జన స్పందన లేకపోవడం ఆ పార్టీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్రేణుల్లో మానసిక స్థైర్యం దెబ్బతినడం, ప్రజాభిప్రాయం అనుకూలంగా లేకపోవడంపై వారు కలవరపడుతున్నారు.

1 comment:

  1. CBN could have gone to the supremo of the present INC for advise?

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!