YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

ఎవరికి తోచినట్లు వారు కథనాలు ఇస్తున్నారు.. వారిని ఎవరు నియంత్రించాలి?

ఎవరికి తోచినట్లు వారు కథనాలు ఇస్తున్నారు.. వారిని ఎవరు నియంత్రించాలి?
జగన్ కేసులో దర్యాప్తు వివరాలను సీబీఐ మీడియాకు లీక్ చేస్తోందంటూ పిల్
ఆ వివరాలను మీడియాతో పంచుకోకుండా సీబీఐ జేడీని ఆదేశించాలని పిటిషనర్ వినతి
విచారణ సందర్భంగా పట్టాభి వ్యవహారాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి
సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న పిటిషనర్ తరపు న్యాయవాది 
ఈ వ్యవహారంలో జేడీ లక్ష్మీనారాయణ క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్:సీబీఐ కోర్టు జడ్జి పట్టాభి రామారావు సస్పెన్షన్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, మీడియాలో ఇష్టానుసారంగా వస్తున్న కథనాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పట్టాభి రామారావు వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ పనిచేస్తోందంటూ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పట్టాభి రామారావు వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలకు ఆధారాలేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరికి తోచినట్లు వారు కథనాలు ఇస్తూ పోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దర్యాప్తునకు సంబంధించిన విషయాలను సీబీఐ అధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారని, దర్యాప్తు వివరాలను మీడియాతో పంచుకోకుండా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.ఈశ్వరప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘‘సీబీఐ అధికారికంగా మీడియాకు ఏ సమాచారమివ్వాలన్నా అధికార ప్రతినిధి ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం సీబీఐ మాన్యువల్‌లోనే స్పష్టంగా ఉంది. ఒకవేళ సీబీఐ అదనపు డెరైక్టర్ అనుమతి తీసుకున్న తరువాత జాయింట్ డెరైక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడవచ్చు. కానీ, ప్రస్తుతం అలా జరగడంలేదు. సీబీఐ అధికారులు తయారు చేసుకున్న మాన్యువల్‌ను వారే పట్టించుకోవడంలేదు. రేపు ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాం.. ఫలానా వ్యక్తిని విచారిస్తున్నాం.. ఫలానా వ్యక్తిని సెక్షన్ 161 కింద స్టేట్‌మెంట్ కోసం తీసుకుపోతున్నాం.. అంటూ ముందురోజే మీడియాకు చెబుతున్నారు. దీనివల్ల ఆ వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. 

ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. సీబీఐ దర్యాప్తునకు ప్రచారం అవసరంలేదు. ఈ విషయం సీబీఐకి కూడా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఆ సంస్థ అధికారులు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు వివరాలను మీడియాతో పంచుకుంటున్నారు. దర్యాప్తులో మీడియా భాగం కాదు’’ అని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ ఈశ్వరయ్య కల్పించుకొని.. ‘‘మిస్టర్ వెంకటరమణ.. పట్టాభి రామారావు సస్పెన్షన్ వ్యవహారం మీకు తెలుసు. ఈ విషయంలో మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిజమా? ఆ కథనాలకు ఆధారాలు ఏమిటి? ఎవరికి తోచినట్లు వారు, వారి వారి ఊహాగానాలకు అనుగుణంగా కథనాలు ఇస్తూ పోతున్నారు. అటువంటి వారిని ఎవరు నియంత్రించాలి’’ అని ప్రశ్నించారు. దీనికి వెంకటరమణ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత కేసులో కూడా మీడియా ఊహల ఆధారంగా కథనాలు ఇస్తోంది. వాటిని ఎప్పుడూ సీబీఐ అధికారులు ఖండించడంలేదు. పలు సందర్భాల్లో సీబీఐ ఉన్నతాధికారులు చెప్పారంటూ కథనాలు ఇస్తున్నారు. 

దర్యాప్తు అధికారి, విచారణకు హాజరయ్యే వ్యక్తి మధ్య జరిగే సంభాషణలను స్వయంగా విని రాస్తున్నట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి. విచారణకు హాజరయ్యే వ్యక్తి అతనికి వ్యతిరేకంగా చెప్పుకోడు. అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగిన సంభాషణ మీడియాకు ఎలా తెలుస్తుంది? సీబీఐ మాత్రమే మీడియాకు చెబుతోంది. ఈ మొత్తం కేసులో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తే.. సీబీఐ ఉన్నతాధికారుల సమాచారం మేరకు అంటూ రాస్తున్నారు. దీని ప్రకారం సమాచారాన్ని మీడియాతో పంచుకుంటున్నది ఎవరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సీబీఐ అధికారులు మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’’ అని వివరించారు. 

ఈ సమయంలో జస్టిస్ పుర్కర్ జోక్యం చేసుకుంటూ.. మాన్యువల్‌కు ఎటువంటి చట్టబద్ధత లేదు కదా.. అని ప్రశ్నించారు. దీనికి వెంకటరమణ స్పందిస్తూ.. ‘‘మాన్యువల్‌కు చట్టబద్ధత లేని మాట నిజమే. అయితే మాన్యువల్‌ను తయారు చేసిన అధికారులు దానిని తప్పక పాటించాలి. రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రావడంలేదు. అన్ని దర్యాప్తులూ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. మేము చేసిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ రాతపూర్వకంగా చెబితే, భారీ జరిమానాతో కోర్టు మా పిటిషన్‌ను కొట్టివేయవచ్చు’’ అని ధర్మాసనానికి నివేదించారు. ఈ వాదనలను సీబీఐ న్యాయవాది కేశవరావు తోసిపుచ్చారు. మీడియాతో ఎటువంటి సమాచారాన్ని పంచుకోవడంలేదని తెలిపారు. పిటిషనర్‌వి ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను మీడియా ప్రచురిస్తుంటే, వాటిని తాము చెప్పినట్లుగా చెప్పడం సరికాదని అన్నారు. వాదనలను విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

1 comment:

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!