హైదరాబాద్, న్యూస్‌లైన్:
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందువల్ల వాటిపై విచారణకు ఆయన సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో లోక్‌సభ సీటు ఇస్తానని చెప్పి తనవద్ద డబ్బు తీసుకున్నారని, కోటిరూపాయలకుపైగా స్వయంగా అందజేయగా.. మరో రూ.4 కోట్లను తన లండన్ బ్యాంక్ అకౌంట్ల నుంచి బాబుకు అకౌంట్ ఉన్న సింగపూర్ బ్యాంక్‌కు పంపించానని, తనను అరెస్టు చేసినపుడు బాబు ఒక్కరేగాక అప్పటి డీజీపీ హెచ్.జె.దొర, ఇంటెలిజెన్స్ ఐజీ శివశంకర్ స్వయంగా బెదిరించినట్లు కోలా చేసిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమని నల్లపరెడ్డి అన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు రూ.60 లక్షలు ఇచ్చానని, ఈ డబ్బుతో ఇంటినుంచి వెళ్లిపోయిన అతన్ని వెతకాలంటూ మళ్లీ తనకే చంద్రబాబు చెప్పారని కృష్ణమోహన్ రూఢీగా పేర్కొనడాన్ని గమనించాలని నల్లపరెడ్డి అన్నారు. తాజా ఆరోపణలతో దేశంలోనే ఒక మాఫియాగ్యాంగ్ నాయకుడి రూపంలో చంద్రబాబు సాక్షాత్కరించారన్నారు.
బాబుపై తొలి నుంచీ అన్ని పార్టీలవారూ ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా కమ్యూనిస్టుపార్టీకి చెందినవారు ఆయనపై ఒక పుస్తకమే ప్రచురించారని ఆయన గుర్తుచేశారు. బాబు స్విస్ బ్యాంక్ ఖాతాల నంబర్లను కూడా కృష్ణమోహన్ ప్రకటించడం సాధారణ విషయం కాదన్నారు. తన ఒంటినిండా మచ్చలున్న చంద్రబాబు.. ఇతరులకు మచ్చలున్నాయని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. బాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నపుడు సినిమా టికెట్ల రేట్ల విషయంలో నెల్లూరు జిల్లా సినిమాహాలు యజమానుల నుంచి.. ముడుపులు దండుకున్న విషయం మరిచారా? అని ప్రసన్న ప్రశ్నించారు.
చందాల బాబు, దండకాల బాబుగా పేరు మోసిన చంద్రబాబుది చదువుకునే రోజుల నుంచీ ఒక క్రిమినల్ మైండ్ అని, దావూద్ ఇబ్రహీం లాంటి వారూ ఆయనకు సాటిరారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిందిస్తున్న బాబుకన్నా మించిన గజదొంగ ఎవరూ లేరన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కే బాబు రూ.50 లక్షల లంచమిచ్చినట్లు కృష్ణమోహన్ గుట్టు విప్పారని, దీనిపైనా విచారణ జరిపించాలని ఆయన కోరారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, సిగ్గు, లజ్జ ఉంటే తనంతతానుగా సీబీఐ విచారణ కోరి నిజాయతీని నిరూపించుకోవాలని ప్రసన్న సవాలు విసిరారు.
No comments:
Post a Comment