పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేక రైతు విలవిల
ఖరీఫ్ మొదలై రెండు వారాలు గడుస్తున్నా... రుణ ప్రణాళికనే
విడుదల చేయని సర్కారు... వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న రైతన్నలు
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం... రాష్ట్రంలోని 20 లక్షల మంది
కౌలు రైతుల్లో లక్ష మందికే రుణ అర్హత కార్డులు
అటు ఎరువుల మంట.. ఇటు విత్తనాల మోత.. బ్లాక్ మార్కెట్ తంటా..
ఆదుకోవాల్సింది పోయి విత్తన సబ్సిడీలను కోసేస్తున్న సర్కారు
రైతులకు కరువు సాయం అందించడంలోనూ నిర్లక్ష్యమే
రూ.1,816 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉన్నా.. రూ.837 కోట్లు ఇచ్చి
చేతులు దులుపుకున్న ప్రభుత్వం... సాగు చేయాలంటే రైతుల్లో భయం
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో రైతన్న మళ్లీ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుపోతున్నాడు. పెట్టుబడి ఖర్చుల కోసం అనివార్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నాడు. ఖరీఫ్ సీజను ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులకు పంట రుణాలు ఇప్పిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. ఖరీఫ్‌కు ముందుకాదు కదా.. సీజను మొదలై రెండు వారాలు గడిచినా ఒక్క రైతుకు కూడా రుణాలిప్పించలేదు. అంతెందుకు.. మే నెలలో విడుదల చేయాల్సిన ‘ఖరీఫ్ రుణ ప్రణాళిక’ను ఇప్పటికి కూడా విడుదల చేయలేదు. తొలకరి వర్షాలు మొదలవడంతో విత్తనాలు, ఎరువులు, దుక్కుల ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం ద్వారా బ్యాంకు రుణాలు గగనమవడంతో చేసేది లేక ప్రైవేటు వడ్డీనే నమ్ముకుంటున్నారు. ఒకటికి పదిసార్లు ఒత్తిడి తెస్తేనే బ్యాంకులు అరకొర రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్షల మంది రైతులకు రుణాలు ఇప్పించేందుకు సర్కారు ముందుగానే చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.
ఖరీఫ్ సీజను రెండు వారాలు ఆలస్యంగా మొదలైనా ఇప్పటికీ రుణ ప్రణాళికను కూడా విడుదల చేయలే దంటే ప్రభుత్వానికి అన్నదాత మీద చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతోంది. గత ఏడాది వారిలో 5.76 లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చింది. అందులో 1.97 లక్షల మంది రైతులకు మాత్రమేబ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజను ఆరంభమైనా కేవలం లక్ష మంది కౌలు రైతులకే రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణాలివ్వలేదు! వడ్డీ వ్యాపారుల వల నుంచి రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా బలవంతంగా వారిని ఊబిలోకి నెడుతోంది.
ఇన్‌పుట్ సబ్సిడీకి దిక్కులేదు..
గత ఏడాది రైతులను కరువు కాటేసింది. మొత్తం 1,076 గ్రామీణ మండలాల్లో 876 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 83,55,267 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన 52,56,730 మంది రైతులకు రూ.1816 కోట్ల నష్టపరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మధ్యలో రబీ ముగిసింది. మళ్లీ ఖరీఫ్ వచ్చింది. ఇప్పటికీ ఈ పరిహారం సగం కూడా పంపిణీ చేయలేదు. కేవలం 21,88,497 మంది రైతులకు రూ.837 కోట్ల పరిహారం మాత్రమే పంపిణీ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు సర్కారు పరిహారం కూడా ఇవ్వకపోవడంతో పెట్టుబడి లేక వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్‌లో 2.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడి కోసం దాదాపు రూ.26 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.
నెలకోసారి ఎరువుల మంటలు..
కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయం అంటేనే రైతులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. కేంద్రం అమలు చేస్తున్న సూక్ష్మ పోషక విధానం రైతుల పాలిట శాపంలా మారింది. కంపెనీలకు ఇచ్చే రాయితీని స్థిరంగా ఉంచి అమ్మకం ధరలను పెంచేలా రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) విధానంతో ఎరువుల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. నెలకోసారి మండుతూనే ఉన్నాయి. ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీ తగ్గింపే లక్ష్యంగా వచ్చిన ఈ విధానంతో యూరియా మినహా అన్ని రకాల ఎరువుల ధరలు రెండేళ్లలోనే 12 సార్లు పెరిగాయి. గత ఖరీఫ్, రబీలోనే ఏకంగా ఎనిమిదిసార్లు పెరిగాయి. రైతులు ఎక్కువగా వినియోగించే 50 కిలోల డీఏపీ బస్తా ధర ఎన్‌బీఎస్ అమలుకు ముందు రూ.486 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.1260కి చేరింది. 28:28:0 కాంప్లెక్సు ధర అన్నింటి కన్నా ఎక్కువగా రూ.1,297కు ఎగబాకింది. కాంప్లెక్సుల్లో ఎక్కువగా వినియోగించే 17:17:17 బస్తా ధర రూ.రూ.301 నుంచి రూ.1,021కి పెరిగింది. 14:35:15 బస్తా ధర రూ.1,223కు చేరింది. పంటల దిగుబడి పెంచడంలో కీలకమైన పొటాష్ ధర కూడా రూ.231 నుంచి రూ.882 పలుకుతోంది. 19:19:19 బస్తా ధర రూ.337 నుంచి రూ.949కి ఎగబాకింది.
మోతెక్కిపోతున్న విత్తన రేట్లు..
కరువుతో ఖరీఫ్ పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్న రైతులకు మరింత సబ్సిడీలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి ధరలను మరింత పెంచేసింది. సబ్సిడీపై సరఫరా చేసే సోయాబీన్, వేరుశనగ విత్తనాల ధరనూ భారీగా పెంచింది. గత ఏడాదిలో క్వింటాల్ సోయాబీన్ విత్తనాలను రైతులకు రూ.1,540కి పంపిణీ చేయగా ఇప్పుడు ఈ ధరను రూ.2,680కి పెంచింది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.3,600 ఉన్న వేరుశనగ విత్తనాల ధర ఇప్పుడు రూ.3,950కి చేరింది. సోయాబీన్ విత్తనాలను గత ఖరీఫ్‌లో 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా ఇప్పుడు దీన్ని 33 శాతానికి తగ్గించారు. దీంతో సోయాబీన్ విత్తనాల ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. రాష్ట్రంలో ప్రధాన పంట వరి విత్తనాల ధరలకూ రెక్కలు వచ్చాయి. బీపీటీ-5204 రకం వరి విత్తనాల ధర గత ఏడాది క్వింటాల్‌కు రూ.1950 ఉండగా సర్కారు ఇప్పుడు రూ.2,100కు పెంచింది. బాస్మతి బియ్యాన్ని పోలిన ఆర్‌ఎన్‌ఆర్-2332 విత్తనాల ధర రూ.1,850 నుంచి రూ.2,300లకు ఎగబాకింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే ఎంటీయూ-1010, ఎంటీయూ-1001 రకం విత్తనాల ధర రూ.1,850 నుంచి రూ.2 వేలకు పెరిగింది. మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జ విత్తనాలపై గత ఏడాది క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ ఇచ్చిన సర్కారు ఇప్పుడు దాన్ని రూ.1,200లకు తగ్గించి రైతులపై పెనుభారం మోపింది.
ఇలాగైతే రైతులు తిరగబడతారు
వ్యవసాయమన్నా, రైతులన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. ఏడాది క్రితం కరువుతో పంటలు నష్టపోయిన వారికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. రైతుల ఒత్తిడితో మే 15లోపే ఇస్తామని చెప్పారు. కానీ సగం మందికి కూడా ఇవ్వలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక అల్లాడుతుంటే.. బ్లాక్ మార్కెటింగ్‌లో వ్యాపారులు, కంపెనీలు రైతులను నిలువునా దోచుకుంటున్నాయి. పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌ను సర్కారు నియంత్రించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో డీలర్లు మొక్కజొన్న, ఆముదం విత్తనాలను బ్లాక్‌లో అమ్ముతున్నారు. పాత ధరలకు విక్రయించాల్సిన ఎరువులను బస్తాకు రూ.200 అదనంగా గుంజుతున్నారు. సర్కారు తీరు ఇలాగే ఉంటే రైతులు తిరగబడడం ఖాయం.
-కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు

No comments:
Post a Comment