YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 28 July 2012

వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌..



‘నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మా!’ అన్న చందంగా అరుపులూ కేకలూ అల్లరీ హడావుడీ బతుకుతెరువుగా బండి లాగిస్తున్న రాజకీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన పేరు వుత్పల హనుమంతరావు అనే వీహెచ్‌ది. అలాంటి నేత ఇప్పుడు గాంధీ భవన్‌లో ‘మౌనవ్రతం’చేపట్టడం చూసి జనం నోళ్లు నొక్కుకుంటున్నారు. అంతకు మించి, కే.కేశరావు, డీ.ఎల్. రవీంద్రారెడ్డిలాంటి గగ్గోలురాయుళ్లు వీహెచ్ మౌన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనకు సానుభూతి ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ నేతల సెన్సాఫ్ హ్యూమర్‌ను అభినందించాలి!

వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. సొంతబలం కొంతయినా లేకపోయినా, తన పేరు చెప్పి ఒక్క కార్పొరేటర్‌నయినా గెలిపించుకోలేకపోయినా, హనుమంతరావు లీడర్‌గిరీకి మాత్రం ఏ ఢోకా రాలేదు! అతగాడు ‘సొంత నియోజక వర్గం’గా చెప్పుకునే అంబర్ పేట (ఒకప్పుడు హిమాయత్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ పొరబాటున ఒకే ఒక్కసారి -చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా- గెలిచింది. ఎనిమిదిసార్లు ఘోరంగా ఓడిపోయింది. ఆ నియోజక వర్గ పరిధిలోనే, వీహెచ్ నివాసం ఉన్న డివిజన్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఎడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయికి ఎగబాకగలగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమేమో!

అసలు హనుమన్న రాజకీయ రంగప్రవేశమే గొప్పగా జరిగింది. 1974లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పుత్రరత్నం సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేపట్టి సొంత సైన్యం సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, హనుమంతరావు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి ఇప్పటి దాకా పైవాళ్ల దయతోనే ఆయన అభ్యున్నతి అప్రతిహతంగా సాగిపోయింది. ఎమెర్జెన్సీ నీలినీడలో, మన రాష్ట్ర అసెంబ్లీకి 1978లో జరిగిన ఎన్నికల్లో వీహెచ్ హిమాయత్ నగర్‌లో వీరంగమాడి, గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం మీద 175 సీట్లు గెలిచినా వీహెచ్ సొంత నియోజకవర్గం హిమాయత్ నగర్‌లో మాత్రం తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఘన విజయం సాధించారు. ‘కాపరం చేసే గుణం కాలిగోటి దగ్గిరే తెలిసిపోతుం’దన్నట్లుగా వీహెచ్ ప్రతిభా పాటవాలు తొలి ఎన్నికల్లోనే తేలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎవరయినా ఏం జరుగుతుందనుకుంటారు? సోది కబుర్లకు తప్ప మరెందుకూ పనికిరాని ఇలాంటి నేతలను తప్పించి కాంగ్రెస్ పార్టీలోని ఇతరులకు అవకాశమిస్తారని భావిస్తారు. కానీ కాంగీయులు అలా చెయ్యలేదు. మరుసటి సంవత్సరమే, 1979లో, వీహెచ్‌ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షపీఠం మీద కూర్చోపెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. ఆ పీఠానికి బల్లిలా అతుక్కుపోయిన వీహెచ్ 1983 దాకా వదల్లేదు. అప్పుడయినా, ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు కింద ఓడించి అధికారం చేజిక్కించుకున్నందువల్లనే కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌లాంటి నేతలను పక్కకు తప్పించారు.

‘నా పేరే హనుమంతు!’ అని గర్వంగా ప్రకటించుకునే వీహెచ్ వెంటనే చిరతలు పట్టుకుని అధిష్టానం ముందు ప్రత్యక్షమయిపోయారు. రెండేళ్లు నానా రకాలుగా పాట్లుపడి ఏపీసీసీ సంయుక్త కార్యదర్శి పదవిలో నియుక్తుడయాడు వీహెచ్. వీహెచ్ రాజకీయ జీవితం మరీ అంత కటిక చీకటి మయమేం కాదు. 1989లో వీహెచ్ ఎమ్మెల్యేగా గెలిచారు- పొదుపుగా రెండువేల ఓట్ల మెజారిటీతో! 1999లో ఇదే వీహెచ్ అదే అంబర్ పేట నియోజక వర్గం నుంచి ఘోరంగా ఓడిపోయారు- 39 వేల ఓట్ల తేడాతో! అదీ మన హనుమన్న ఘన చరిత్ర.

అధిష్టానం ఏమీ మాటాడకముందే అది ఎలా కరెక్టో రుజువుచేసేందుకు రెడీ అయిపోయే అతివిధేయుల జాబితాలో మొదటి పేరే మన వీహెచ్‌ది. మేడమ్ సోనియా గాంధీ పక్కింట్లోనే -11 జన్‌పథ్‌లో- నివాసం ఉండే హనుమన్న అధిష్టానవర్గాన్ని సమర్ధించేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్నీ జరవిడుచుకోరు. అలాంటి వ్యక్తి సాక్షాత్తూ గాంధీ భవన్లో మౌన దీఓ చేపట్టడం కన్నా విడ్డూరమేముంది? ఈ హనుమాయణంలో ఓ పిడకలవేట కూడా ఉన్నట్లుంది. నామినేటెడ్ పదవులకు నియామకాలు తక్షణమే జరిపించాల్సిందిగా ధర్మాన కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో సదరు నియామకాలు జరగనున్నట్లు మన హనుమన్న కనిపెట్టేసి, ఈ దీక్ష డ్రామా మొదలెట్టాడంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.
లేకుంటే వీహెచ్చేంది? మౌనవ్రతమేంది?? 

1 comment:

  1. These people claim that they are patriots; but in fact they are traitors. This is one more segregation of such people after Indira Gandhi did in 60s, eliminating the old waste stuff like SK Patil, Kam Raj, Nija Lingappa etc;

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!