YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 28 July 2012

అసెంబ్లీ వెబ్‌సైట్ ఆవిష్కరించిన స్పీకర్ మనోహర్



హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. శాసనసభ, శాసనమండలి, సభలో జరిగిన చర్చలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నియోజకవర్గాలవారీ సమాచారం, ఇతర వివరాలను ఈ వెబ్ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ప్రజలు వారి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చేందుకు ‘ఈ-పిటిషన్’ సదుపాయమూ ఇందులో ఉంది. "www.aplegisleture.org" పేరుతో నెలకొల్పిన ఈ పోర్టల్‌ను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం ఆవిష్కరించారు. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ -1 లో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ జి.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రజలందరూ ఈ వెబ్‌సైట్ ద్వారా శాసన సభకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎమ్మెల్యేలు ఏ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ, దీని ద్వారా వారి నియోజకవర్గాల్లో ముఖ్యమైన పథకాలు అమలు జరుగుతున్న తీరు, లబ్ధిదారులకు అందుతున్న సహాయం, ఏయే బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం అందింది, రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల వివరాలు తదితర సమాచారాన్ని అప్పటికపుడు తెలుసుకోవచ్చని స్పీకర్ మనోహర్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఇది దోహదపడుతుందన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పరిష్కారమవని ముఖ్యమైన సమస్యలను ఈ వెబ్‌సైట్‌లోని ‘ఈ-పిటిషన్’ ద్వారా అసెంబ్లీ దృష్టికి తెచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగతమైనవి కాకుండా సమాజానికంతటికీ సంబంధించిన సమస్యలను మాత్రమే దీనిలో ప్రస్తావించాలని సూచించారు. 

వాటిని అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ పరిశీలించి, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేస్తుందన్నారు. 1952 నుంచి అసెంబ్లీలో జరిగిన చర్చలకు సంబంధించి 3.11 లక్షల పేజీలను ఇందులో ఉంచామన్నారు. 1996 నుంచి అసెంబ్లీ వీడియో కవరేజీ వివరాలూ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌లు చేసిన ప్రసంగాలు, రాష్ట్ర బడ్జెట్ సమగ్ర వివరాలు, కాగ్, వివిధ కమిటీల నివేదికలను కూడా ఇందులో ఉంచుతున్నట్లు చెప్పారు. శాసనసభ జరుగుతున్నప్పుడు ఈ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ టెలికాస్ట్) ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి సమగ్ర సమాచారం ఇందులో ప్రజలకు అందుబాటులో ఉందని, మరో 15 రోజుల్లో వారి ఆస్తుల వివరాలను కూడా పొందుపరుస్తామని తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!