YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 23 July 2012

కదిలివచ్చిన జనసందోహం

విజయమ్మ చేపట్టిన నేతన్న ధర్నాకు విశేష స్పందన లభించింది. నేత కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రయత్నించారు. ప్రప్రథమంగా జిల్లాకు వచ్చిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలికి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని... తామంతా తెలంగాణ బిడ్డలమేనని జిల్లా నేతలు పదే పదే చెబుతూ... చేనేత ధర్నాకు సహకరించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరును నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. 

భరించలేక..

పాలమూరు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీ ఆర్‌ఎస్.. ఇటీవల పరకాల ఉప ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా స్వల్ప ఓట్ల తో గెలుపొందిన విషయం తెలిసిందే. సిరిసిల్ల నియోజకవర్గంలో 2009లో వైఎస్సార్‌సీపీ నేత కేకే మహేందర్‌రెడ్డిపై కేటీఆర్ సుమారుగా 200 ఓట్ల తేడాతోనే గెలుపొందారు. ఇటీవల తెలంగాణలో కలుగుతున్న రాజకీయ పరిణామాలు వైఎస్సార్‌సీపీ బలోపేతమవుతున్న సంకేతాల ను అందిస్తున్నాయి. విజయమ్మ చేనేత ధర్నాతో సిరిసిల్లలో పట్టును కోల్పోతామన్న భయం పట్టుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్నం చేయటానికి కుట్ర పన్నినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే చేనేత ధర్నా కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రకటించినప్పటి నుంచి విఫలం చేయటానికి టీఆర్‌ఎస్ ప్రత్యేక పథకం అమలు చేసిందంటున్నారు. 

కుట్ర కోసం

విజయమ్మ ధర్నాను భగ్నం చేయటానికి టీఆర్‌ఎస్ పడరాని పాట్లు పడి విఫలమైంది. ఒక ఎంపీ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, విద్యావంతుల వేదిక ప్రతినిధులు, రాజకీయ జేఏసీ చైర్మన్‌తో సహా ఓయూ విద్యార్థి ప్రతినిధులు, టీఆర్‌ఎస్వీ నేతలను కేటీఆర్ రంగంలోకి దించినట్లు వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తుతోంది. ఇదంతా చాలదన్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి ధర్నా భగ్నానికి తీవ్ర ప్రయత్నాలు సాగించారంటున్నారు. మహిళా సంఘాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకులు, పలువురి కార్యకర్తలకు పలు ఆశలు... ప్రోత్సహాలు ప్రకటించి ధర్నాను అడ్డుకునేందుకు సంఘటితం చేసే ప్రయత్నాలు సాగించారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. 

టీఆర్‌ఎస్ శ్రేణుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు వేలాది ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారు. దీన్ని ముందుగానే పసిగట్టిన టీఆర్‌ఎస్ శ్రేణులు పథకం ప్రకారం వంద మంది కార్యకర్తలు, మహిళలను పోగేసి ధర్నా... విజయమ్మ కాన్వాయ్ వస్తున్న ప్రాంతాలలో నిరసనలు, ఆందోళనలు జరిగే విధంగా ప్రణాళికను రూపొందించి అమలు పర్చారు. వరంగల్ జిల్లా నుంచి కూడా మిలిటెంట్లైన టీఆర్‌ఎస్ మహిళా శ్రేణులను ధర్నా ప్రాంతానికి తరలించారు. ధర్నాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తేందుకు యత్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో సిరిసిల్లకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకొని... ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కౌశిక్‌రెడ్డి వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. పైగా వాహనాలపై రాళ్లు రువ్వటంతో పాటు నాయకులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కథలాపూర్ నుంచి వాహనాలలో వస్తున్న నేత కార్మికులను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసి, విఫలమయ్యారు. 

విజయవంతం.. కలిగించిన ఉత్సాహం

నేతన్న ధర్నా విజయవంతం కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ అడ్డంకులు, రాజకీయ కుట్రలు కుతంత్రాల నడుమ వేలాదిగా తరలివచ్చి విజయమ్మకు నేత కార్మికులు, ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సంస్థాగతంగా బలపడగలమన్న ఆశలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో ఎదుగుతుందన్న సంకేతాలు జిల్లా ప్రజల్లోకి వెళ్లినట్లయింది. పార్టీ అధ్యక్షుడు జగన్ బయట లేకున్నప్పటికీ ఆ బాధ్యతలను విజయమ్మ నిర్వర్తించడంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయగలరన్న నమ్మకం కలిగించగలిగారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!