YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

లాటరీతోనే లెసైన్సులు

నూతన మద్యం విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
లాటరీతో దుకాణాల లెసైన్స్‌ల కేటాయింపునకు నిర్ణయం
జనాభా ప్రాతిపదికన ఆరు స్లాబులుగా విభజన.. 
ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజు లెసైన్స్ కాలపరిమితి ఏడాదే.. 
ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే రద్దు
కోటాను మించి విక్రయించిన మద్యంపై 8% ప్రివిలేజ్ ఫీజు
దరఖాస్తులకు జూన్ 25 ఆఖరు తేదీ... 26న లాటరీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. లాటరీ పద్ధతిలోనే దుకాణాలకు లెసైన్స్‌లు కేటాయించాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన దుకాణాలను ఆరు స్లాబులుగా విభజించి స్థిర (ఫిక్స్‌డ్) లెసైన్స్ ఫీజును నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు పెరగవు. గతంలో ఉన్న 6596 మద్యం దుకాణాలనే ఈ ఏడాది కూడా కొనసాగిస్తారు.అయితే గతంలో లేని విధంగా ఈసారి దుకాణం లెసైన్స్ కాలపరిమితిని ఏడాదికి కుదించారు. ఒకవేళ దుకాణదారుని ప్రవర్తన సరిగా ఉండి, ఏడాదిలో ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఉంటే లెసైన్స్‌ను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసే అంశాన్ని పరిశీలిస్తారు. కానీ తుది నిర్ణయం ప్రభుత్వానిదే. లెసైన్స్‌దారుడెవరైనా ఎమ్మార్పీ ధరకు మించి మద్యం విక్రయిస్తే తక్షణమే లెసైన్స్ రద్దవుతుంది. ఆ దుకాణంలో మద్యం విక్రయాల బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) చేపడుతుంది.

ప్రివిలేజ్ ఫీజు విధానం

దుకాణాలను స్లాబులుగా విభజించి ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజును నిర్ణయించిన సర్కారు.. ఈ కారణంగా నష్టపోతున్న రూ.900 కోట్ల సొమ్మును రాబట్టుకునేందుకు ప్రభుత్వం కొత్త ప్లాన్ వేసింది. ప్రివిలేజ్ ఫీజు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పద్ధతిలో లెసైన్స్‌దారుడు ఏడాది కాలానికి తాను చెల్లించిన ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజుకు ఆరు రెట్ల విలువైన మద్యం అమ్ముకోవచ్చు. ఆ తరువాత జరిపే మద్యం అమ్మకాలపై 8% ప్రివిలేజ్ ఫీజు విధిస్తారు. అయితే ఈ భారం ఎమ్మార్పీపై పడకుండా ఉండేందుకు వీలుగా లెసైన్స్‌దారుడికి చెల్లించే విక్రయ కమిషన్ (మార్జిన్) నుంచి రాబట్టుకుంటారు. లాటరీ ద్వారా ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజు మొత్తం రూ.2,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇది సుమారు రూ.900 కోట్లు తక్కువ. రెండేళ్ల క్రితం వేలం పాటల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లెసైన్స్ రూపేణ రెండేళ్లకు గాను రూ.6,800 కోట్లు సమకూరింది. అంటే ఏడాదికి రూ.3,400 కోట్లు అన్నమాట. కానీ ఇప్పుడు ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజుతో రూ.2,500 కోట్లే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో రూ.900 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రివిలేజ్ ఫీజు విధానాన్ని తెరపైకి తెచ్చింది.

నేడు గెజిట్ నోటిఫికేషన్

కొత్త మద్యం దుకాణాల కోసం జిల్లా కలెక్టర్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాని ప్రకారం లెసైన్స్ కావాల్సిన వారు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లాటరీలో పాల్గొనదలచిన వారు తెల్ల కాగితంపై దుకాణం, దానికి కేటాయించిన నంబర్, దుకాణం ఏర్పాటు చేయబోతున్న స్థలంతో పాటు దరఖాస్తుదారుని పూర్తి చిరునామా దరఖాస్తులో పేర్కొనాలి. దీంతో పాటు రూ.25 వేల చలాన్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ , రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రూ.ఐదు లక్షల వరకు స్తిరాస్థికి సంబంధించిన డాక్యుమెంట్లు, అఫిడవిట్ సమర్పించాలి. లాటరీలో పాల్గొనటానికి పూర్తి అర్హత ఉందని నిరూపిస్తూ సొంత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తన వలన ప్రభుత్వానికి నష్టం వస్తే ఆ నష్టాన్ని తానే భరిస్తానని హామీ ఇస్తూ ఏ1 డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ రెండు డిక్లరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ ఉండాలి. స్థిరాస్తుల విలువను నోటరీ చేయించాలి. దరఖాస్తులను స్థానిక ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు వేసుకోవచ్చు. కానీ ఒక దుకాణం లెసైన్స్ మాత్రమే ఇస్తారు. లాటరీలో ఒకే వ్యక్తికి ఒకటికి మించి దుకాణాలు వచ్చినా వాటిలో ఒకటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయదలిచిన దుకాణానికి ఫిక్స్‌డ్ లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీ (ఎర్నెస్టు మనీ డిపాజిట్) కింద చెల్లించాలి. ఒక వేళ దుకాణం దక్కకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. కానీ దరఖాస్తు ఫారంతో పాటు చెల్లించే రూ.25 వేలు తిరిగి ఇవ్వరు. జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. జూన్ 26 న లాటరీ ద్వారా లెసైన్స్‌దారులను ఎంపిక చేస్తారు. ఆ మరుసటి రోజు నుంచే వారికి దుకాణం లెసైన్స్‌లు కేటాయిస్తారు.

గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే...

రాష్ట్ర వ్యాప్తంగా 178 మద్యం దుకాణాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈదుకాణాలు స్థానిక గిరిజనులకే దక్కేలా నిబంధనలు రూపొందించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డ్రా తీసి దుకాణం కోసం పోటీ పడిన వారిలో ఒకరిని ఎంపిక చేయాలి. ఒకవేళ అక్కడ ఎవరూ ముందుకురాని పక్షంలో ఇతర ప్రాంతాలకు చెందిన గిరిజనులను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటికీ గిరిజనులెవరూ ముందుకురాకపోతే గిరిజనేతరులకు కూడా ఇస్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!