బ్లాక్ మార్కెట్‌లో అన్నదాత నిలువు దోపిడీ
రూ. 950 ఉన్న పత్తి విత్తనాలు రూ.1,500కు అమ్ముతున్న కంపెనీలు
నల్ల బజారులో రూ. 200 కోట్లు నష్టపోనున్న రైతులు
సోయాబీన్ విత్తనాలకు తీవ్ర కొరత... వేరుశనగకు నాణ్యత దెబ్బ
చివరికి ఆముదం విత్తనాలు కూడా బ్లాక్ మార్కెట్‌లోనే..
హైదరాబాద్, న్యూస్‌లైన్: విత్తు కష్టాలకు తెరలేచింది! మార్కెట్ మాయాజాలంలో రైతన్న ఎప్పట్లాగే నిలువు దోపిడీకి గురవుతున్నాడు!! గత ఏడాది కరువు నష్టాలను మరిచిపోయి కోటి ఆశలతో ఏరువాకకు సిద్ధమవుతున్న రైతులను విత్తు కష్టాలు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో ఎమ్మార్పీ ధరలకు నాణ్యమైన విత్తనం దొరకడం గగనంగా మారింది. ‘అదనులో వ్యవసాయం..’ అన్న మాటను రైతుల కంటే బాగా ఒంట బట్టించుకున్న విత్తన వ్యాపారులు.. అమాయక రైతుల అవసరాలను బ్లాక్ మార్కెట్ రూపంలో సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాలను ఉత్పత్తి చేయడమే ప్రధాన విధిగా ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఏపీ సీడ్స్’ వద్ద కూడా విత్తనాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా సర్కారు ఇచ్చేది ప్రైవేటు వ్యాపారులు సరఫరా చేసే విత్తనాలే కావడంతో నాణ్యతాపరమైన సందేహాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా రైతులు చేసేది లేక పెద్ద కంపెనీల విత్తనాల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా కంపెనీలు అడ్డగోలు రేట్లతో రైతుల నడ్డి విరుస్తున్నాయి. రెట్టింపు ధరలకు విక్రయిస్తూ నిలువునా దోచుకుంటున్నాయి. ఈ అక్రమాలను నిరోధించాల్సిన వ్యవసాయ శాఖ అన్ని దశల్లోనూ వ్యాపారులకే అండగా నిలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. ఖరీఫ్‌లో 2.20 కోటి ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక వేసింది. ఈ విస్తీర్ణంలో అన్ని పంటలు కలిపి 40.86 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. వరి, వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆముదం, నువ్వులు, జీలుగ, జనుము, పిల్లిపిసర విత్తనాలు కలిపి 11.62 లక్షల క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. సకాలంలో విత్తన రైతుల నుంచి విత్తనాలను సేకరించడంలో వ్యవసాయ శాఖ, విత్తన ఏజెన్సీలు విఫలమయ్యాయి. దీంతో విత్తన రైతులు తమ పంటను మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మీనమేషాలు లెక్కించిన వ్యవసాయ శాఖ.. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక ధరలు వెచ్చించి విత్తనాలు సేకరించింది. వీటిని రూ.153 కోట్ల సబ్సిడీతో రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇవి నేరుగా విత్తన రైతుల నుంచి సేకరించిన విత్తనాలు కాకపోవడంతో సర్కారు విత్తనాల నాణ్యతపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి.
చివరికి ఆముదం విత్తనాలు కూడా..
పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ రెండేళ్లుగా జరుగుతుండగా.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో సాగు చేసే ఆముదం విత్తనాల ధరలను ప్రభుత్వం ఈ ఏడాది అమాంతంగా పెంచేసింది. గత ఏడాది వీటి ధర క్వింటాల్‌కు రూ.5 వేలు ఉండగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో రైతులకు రూ.2,500కే విత్తనాలు దొరికాయి. ఈ ఏడాది వాటి ధరను రూ.5,200కు పెంచిన సర్కారు సబ్సిడీని రూ.1,200లకు తగ్గించింది. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.3 వేలు వెచ్చించి కొనుక్కొవాల్సి వస్తోంది. సర్కారే ధర పెంచినందున తాము పెంచితే తప్పేంటన్న ఉద్దేశంతో కంపెనీలు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. రూ.400 ఉండే 3 కిలోల ఆముదం విత్తనాల ప్యాకెట్‌ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో కంపెనీలు రూ.700లకు చొప్పున అమ్ముతున్నాయి. రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర సర్కారుకు ఏ మాత్రం శ్రద్ధలేదని చెప్పేందుకు విత్తనాల్లో బ్లాక్ మార్కెట్ దందాయే నిదర్శమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు కె.రామకృష్ణ మండిపడ్డారు.
సోయాబీన్... పెరిగిన భారం రైతులపైనే
పత్తి రైతు... అంతులేని దోపిడీ
వేరుశనగ... నాణ్యతకు సెగ
విత్తనాల కోసం బారులు...
జహీరాబాద్ , న్యూస్‌లైన్: మెదక్ జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు విత్తనాల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురియడం, విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజునే ప్రారంభించడంతో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయానికి తరలి వచ్చారు. మధ్యాహ్నం వర్షం రావడంతో విత్తనాల పంపిణీ నిలిపివేశారు. కూపన్లు పొందిన రైతులకు మంగళవారం పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.





No comments:
Post a Comment