అయినా పరిస్థితి అర్థం కాని 76 ఏళ్ల రామోజీ.. ఇపుడు 18 స్థానాల ఉప ఎన్నికల ముందు మరోసారి ఉద్రేకంతో ఊగిపోతున్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా రోజూ పేజీల కొద్దీ విషం వండి వారుస్తున్నారు. మంగళవారం మొదటి పేజీ నిండా కుమ్మరించిన అలాంటి విష కథనాల్లో వాస్తవాల్ని దాచేసి అల్లిన అబద్ధాలే.. రాంకీ, కాకినాడ సెజ్ కట్టుకథలు. వాటిలో రామోజీ దాచిన అసలు కోణాలు... చంద్రబాబు బాగోతాలు.. వైఎస్‌పై అబద్ధపు రాతలు ఇవిగో...
‘ఆపద్ధర్మ’ బాబు ‘రాంకీ’ లీల
ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ.. నిబంధనల్ని మార్చి మరీ.. ‘రాంకీ’కి 2,143 ఎకరాలు ధారాదత్తం
మినహాయింపుల్లో వాన్‌పిక్‌ను మించిన ‘రాంకీ’
అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ మాఫీ
గ్రీన్‌బెల్ట్ కోసం 58.95 ఎకరాలుంటే చాలంటూ ఒప్పందం
గ్రీన్‌బెల్ట్‌ను పెంచితే బావుంటుందని యోచించిన వైఎస్ ప్రభుత్వం
అధికారుల సూచనలు, రాంకీ అభ్యర్థనలతో మునుపట్లానే కొనసాగింపు
అలా కొనసాగించటం నేరమంటున్న సీబీఐ; అందుకే పెట్టుబడులు పెట్టారని ఆరోపణ
బాబు నిర్వాకాన్ని దాచేసి.. వైఎస్‌పై బురదజల్లుతూ రామోజీ విషపు రాతలు
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
విశాఖలో 1999లో ఫార్మాసిటీని ప్రతిపాదించిన చంద్రబాబు.. 2000వ సంవత్సరం జూలై 18న జీవో ఎంఎస్ నంబర్ 381ని విడుదల చేస్తూ దీన్ని ధ్రువపరించారు. దీనికి పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాలుష్యం దృష్ట్యా పరవాడ వద్దని అభ్యంతరాలు వచ్చినా.. బాబు వాటిని బుట్టదాఖలు చేశారు. పరవాడను ఖరారు చేస్తూ 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నంబర్ 501ని విడుదల చేశారు. తర్వాత టెండర్లు పిలిచే బాధ్యతను కూడా తన జేబు సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించారు.
11 సంస్థలొచ్చినా... అంతా వెనక్కి...
రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదనల్ని పంపే దశలో రాంకీతో పాటు ఏడు సంస్థలే మిగిలాయి. వాటిలో 3 కంపెనీలు మాత్రమే.. జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. ఏపీఐఐసీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్‌ను కూడా తొలగించారు.
‘బూట్’ నిబంధనలు మార్చిన బాబు...
ఈ దశలో బాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న.. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బూట్) బదులు బిల్డ్, ఆపరేట్, ఓన్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న నెల రోజులకే అంటే.. 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. రాంకీ ప్రతిపాదనపై నేరుగా ముఖ్యమంత్రితో.. ఇన్‌ఫ్రా సబ్‌కమిటీ చర్చించింది. 2003 నవంబరు 14న రాంకీకి సూత్రప్రాయ అనుమతినిచ్చిన బాబు.. అదే రోజు అసెంబ్లీని రద్దు చేశారు కూడా. బాబు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న.. అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే.. 2003 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. మొత్తమ్మీద రాంకీకి 2,143 ఎకరాల్ని అప్పగించారు.
వాన్‌పిక్‌ను మించి రాయితీలు...
నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసినపుడు.. వాన్‌పిక్‌కు ఇచ్చిన స్టాంపు డ్యూటీ మినహాయింపు వంటి రాయితీల్ని సీబీఐ పెద్ద భూతద్దంలో చూపించింది. ఆ రాయితీలు ఇచ్చినందుకే ప్రసాద్ ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారని చిత్రమైన వాదన చేసింది. మరి రాంకీకి బాబు ఇచ్చిన రాయితీలేంటో తెలుసా?
అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించారు.
ప్రభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని రద్దు చేయటానికి ఏపీఐఐసీ సిఫారసు చేస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలన్నిటిపైనా ఏపీఐఐసీ సహకరిస్తుంది.
మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. దాన్ని అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్డ్ జోన్ ఉంటుంది.
ఈ కన్షెషన్ అగ్రిమెంట్ ప్రకారం గ్రీన్‌బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు.
వైఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రీన్‌బెల్ట్‌ను పెంచాలని సమావేశాలు నిర్వహించినా.. అధికారులు, రాంకీ ప్రతినిధులు చేసిన అభ్యర్థనలు, సూచనల అనంతరం మునుపటి 58.95 ఎకరాలుగా కొనసాగించటానికే నిర్ణయించారు. అయితే.. వైఎస్ పెంచాలని ప్రతిపాదించి మళ్లీ తగ్గించారని, అందుకే రాంకీ సంస్థ ‘సాక్షి’లో రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ అడ్డంగా వాదిస్తోంది. దాన్ని ‘ఈనాడు’ తనకు అలవాటైన రీతిలో వండేసి మరింత విషం కుమ్మరిస్తోంది. ఇదంతా జనానికి అర్థం కావటం లేదనా? జనం ఏమాత్రం తెలుసుకోలేరనా? జనమంటే రామోజీకి మొదటి నుంచీ ఎందుకంత చులకన?





No comments:
Post a Comment