ఆమె మాట్లాడుతూ ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి మనసున్న నేత. రాష్ట్రంలో ఏ ఒక్కరి కంట్లోనూ కన్నీరు రాకూడదనే ఉద్దేశంతోనే ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, రూ.2కే కిలో బియ్యం లాంటి పథకాలెన్నో చేపట్టారు’ అని వివరించారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజన్నను చెరిపేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుటిల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘జగనన్న కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారట.. సీఎం కూడా అయ్యే వారట. ఇదీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ చెబుతున్నది. అంటే.. జగనన్న కాంగ్రెస్‌ను వీడారు కాబట్టే ఇలా వేధిస్తున్నారన్నది స్పష్టమవుతోంది’’ అని అన్నారు.
అబద్ధపు సాక్ష్యాలతో 14 ఏళ్లు జైల్లో పెడతారా?
‘‘భర్తను కోల్పోయి.. కొడుకు దూరమై ఒక తల్లి న్యాయం కోసం ప్రజల ముందుకు వస్తుంటే.. అధికార దాహంతో మేమే నాన్నను చంపుకున్నామని బొత్స సత్యనారాయణ అంటున్నారు. జగనన్నకు 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని కిరణ్ అంటున్నారు. అంటే.. అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి.. అవాస్తవ విచారణతో జైల్లో పెడతారా?’’ అని షర్మిల నిలదీశారు. ‘‘జైల్లో ఉన్న వారికి ఓట్లేస్తే మిమ్మల్ని జైల్లో పెడతారు అంటూ చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఓటర్లను మనసుతో గెలవలేక బెదిరింపులకు దిగుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘వైఎస్ చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పథకాలని చిరంజీవి చెబుతున్నారు. అసలు వైఎస్ ఆ పథకాలు చేపట్టినప్పుడు చిరంజీవి రాజకీయాల్లోనే లేరు’ అని గుర్తుచేశారు.
‘రాష్ట్రంలో 18 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. కాంగ్రెస్, టీడీపీ జగనన్నను బతకనిస్తాయా? వైఎస్సార్‌కాంగ్రెస్‌ను బతికి బట్టకట్టనిస్తాయా? అని ఎదురు చూస్తోంది. మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది.. ఆ ఆయుధంతో ఎవరినైనా శిక్షించవచ్చు.. రక్షించవచ్చు.. మీరు వేసే ఓటుతో జగనన్నను నిర్దోషి అని దేశమంతా నమ్ముతుంది. మీరు వేసే ఓటు రాజన్న రాజ్యం మళ్లీ కావాలని కోరుకునేదిగా ఉండాలి. మామకు వెన్నుపోటు పొడిచి, కుటిల రాజకీయాలు చేస్తోన్న బాబుకు మీరు ఓటు వేయొద్దు.. వైఎస్ రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తూ వైఎస్ కుటుంబాన్ని వేధిస్తోన్న.. రైతులు, పేదలను కాలరాస్తోన్న కాంగ్రెస్‌కు ఓటేయొద్దు. మీరు వేసే ఓటుతో కుళ్లు రాజకీయాలకు సమాధి కట్టండి. రాజన్న రాజ్యానికి పునాది వేయండి’ అని షర్మిల పిలుపునిచ్చారు.





No comments:
Post a Comment