బొత్సను బయటపడేసేందుకే ఈ నిర్ణయం కిరణ్ - బొత్స వార్ కారణంగా వెలుగులోకి స్కామ్ విజయనగరంలో మెజారిటీ దుకాణాలు బొత్స కుటుంబానివే... నిరుపేదల పేర్లతో షాపులు బొత్స కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంక్ ఖాతాల నుంచే గ్యారంటీలు అక్రమాలపై అన్ని ఆధారాలూ సేకరించిన ఏసీబీ ఢిల్లీ పెద్దల శరణుజొచ్చిన బొత్స.. సీఎంతో రాజీ లిక్కర్ కేసుల దర్యాప్తుకు మంగళం (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కర్ర ఉన్న వాడిదే బర్రె.. అనేది సామెత! అవును.. అధికారంలో ఉన్నవాడిదే రాజ్యం. అధికారం చెలాయించే పాలకులు ఏం తలచుకుంటే ఆ రాజ్యంలో అదే జరుగుతుంది. ఎదురుతిరిగితే.. ఏ తప్పూ చేయని వారిని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించగలరు. శరణుజొచ్చితే.. ఎంతటి తప్పులనైనా మాఫీ చేసి అందలమెక్కించగలరు. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన లిక్కర్ సిండికేట్ కేసుకు సర్కారు వారు సమాధి కట్టేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబీకులతో సంబంధం ఉన్న మద్యం సిండికేట్ల కేసును మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి విజయనగరం, విశాఖ జిల్లాల్లోనే కాదు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మద్యం సిండికేట్ల వెనుక ప్రమేయం ఉన్నవారిపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్ల వ్యవహారం తన కుటుంబం మెడకు చుట్టుకుంటుందని భావించిన మరుక్షణం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ పెద్దల శరణు కోరడం, వారి సూచన మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మచ్చిక చేసుకోవడం.. మద్యం సిండికేట్ల కుంభకోణం తెరమరుగు కావటం వరుస వెంట జరిగిపోయాయి. ఈ కేసును శోధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది తేటతెల్లమైంది. శ్రీనివాసరెడ్డిని బదిలీ చేసినా.. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తానని ఏసీబీ డెరైక్టర్ జనరల్ భూపతిబాబు చెప్పారు. అది కూడా ఎంతో సేపు నిలువలేదు. భూపతిబాబును బదిలీ చేయకుండానే ఆయనపైన మరో సీనియర్ అధికారిని నియమించటం ద్వారా కేసును తుంగలో తొక్కే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్సకు సన్నిహితుడైన ఉన్నతాధికారిని ఏకంగా ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా నియమించారు. దీంతో అప్పటిదాకా ఈ కేసు విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరించిన భూపతిబాబు సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మద్యం సిండికేట్లపై దాడుల వెనుక పెద్ద కథే దాగి ఉంది. ముఖ్యమంత్రి పదవికి తాను రేసులో ఉన్నానని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అడపా దడపా కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి పైనా విమర్శలు గుప్పించారు. తన సన్నిహితుల వద్ద, పార్టీ ఎమ్మెల్యేల వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడటంతో.. ముఖ్యమంత్రి కిరణ్ మద్యం సిండికేట్ల కుంభకోణంపై దృష్టి సారించారు. అంతే 2011 డిసెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలుపెట్టింది. సిండికేట్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఖమ్మంకు చెందిన సిండికేట్ లీడర్ నున్నా రమణను 2012 ఫిబ్రవరి 7న అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన తరువాత రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంటకరమణకు రూ. 10 లక్షలు ముడుపుల రూపంలో చెల్లించినట్లు రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టులో సమర్పించింది. సరిగ్గా ఆ సమయంలోనే విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్లపై దర్యాప్తు మొదలైంది. ఆ జిల్లాలో బొత్స కుటుంబ సభ్యులు బినామీ పేర్లపై పెద్ద ఎత్తున దుకాణాలు చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ శరణుజొచ్చిన బొత్స... సీఎం కిరణ్ తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని గ్రహించిన పీసీసీ అధ్యక్షుడు ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లారు. సీఎం తనను లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ అధిష్టానవర్గం ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే మద్యం సిండికేట్ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశోధనా విభాగం (సిట్)ను ఏర్పాటు చేసింది. దానికి సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీనివాసరెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఆ వెంటనే విజయనగరంలో దర్యాప్తు ముమ్మరమైంది. బొత్స కుటుంబ సభ్యులు వారి అనుయాయుల పేరుతో పెద్ద ఎత్తున దుకాణాలు చేజిక్కించుకున్నారని, సిండికేట్లతో కలిసి తక్కువ ధరకు దుకాణాలు చేజిక్కించుకున్నారని ఏసీబీ మార్చి రెండోవారంలోనే తేల్చింది. మద్యం దుకాణాలు పొందిన వారంతా తెల్లకార్డుదారులని, వారిలో ఎక్కువగా రోజు వారీ కూలీలు, పేదలు ఉన్నారని గుర్తించింది. పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఆ వివరాలను ‘ఈనాడు’ దినపత్రికకు ఇవ్వాలంటూ ముఖ్య నేత ఏసీబీని ఆదేశించారు. ‘ఈ సీసాలకు బాసెవరేటి?’ శీర్షికన ‘ఈనాడు’ మార్చి 25న బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. దీంతో సీఎం, పీసీసీ అధ్యక్షుని మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. అయితే.. ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుందని భావించిన బొత్స ముఖ్యమంత్రితో సంధి కుదుర్చుకున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏప్రిల్ 3న అర్ధరాత్రి సిట్ చీఫ్ శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి తమ మధ్య విభేదాలు లేవని అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ చెప్తూ వచ్చారు. అదే సమయంలో కేసు దాదాపుగా మూతపడే స్థితికి చేరింది. విజయనగరంలో అన్నీ అక్రమాలే... విజయనగరం జిల్లాలో సిండికేట్ల పేరుతో అత్యధిక మద్యం దుకాణాలను బొత్స కుటుంబం చేజిక్కించుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. దుకాణాలు చేజిక్కించుకున్న వారిలో అత్యధికులు రోజు వారీ కూలీలు, పెద్దగా ఆర్థిక స్తోమత లేని బొత్స అనుచరులేనని ఏసీబీ గుర్తించింది. జిల్లాలో 200కు పైగా మద్యం దుకాణాలు ఉంటే, విజయనగరం పట్టణంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో బొత్స కుటుంబానికి 56 దాకా ఉన్నట్లు ఆధారాలను రాబట్టింది. మద్యం దుకాణాలు చేజిక్కించుకోవడానికి ఈ దుకాణాల యజమానులకుఆర్థికంగా సహకారం అందించడంతో పాటు బ్యాంక్ గ్యారంటీలు సమకూర్చింది బొత్స కుటుంబ సభ్యులే. కనిష్టంగా రూ. 56 లక్షలు, గరిష్టంగా రూ. 2 కోట్ల మేర లెసైన్స్ ఫీజు చెల్లించి దుకాణాలు చేజిక్కించుకున్న బొత్స అనుచరుల్లో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను పరిధిలోకి రారు. వారిలోనూ 43 మంది నేటికీ తెల్లకార్డుదారులే. వీరందరికీ బ్యాంక్ గ్యారంటీలు సమకూర్చింది, నగదు సమకూర్చింది బొత్స సమీప బంధువులేనని కూడా ఏసీబీ తేల్చింది. బొత్స కుటుంబ సభ్యులకు.. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మద్యం దుకాణాల యజమానులకు మధ్య ఉన్న విడదీయరాని ఆర్థిక సంబంధాలను వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించి వివిధ జాతీయ బ్యాంక్‌ల మేనేజర్‌ల నుంచి వాంగ్మూలం కూడా తీసుకుంది. దుకాణాలన్నీ మద్యం ఉత్పత్తులకు ఒకే ధర నిర్ణయించేందుకు ఏర్పాటైన సిండికేట్లలోనూ బొత్స కుటుంబానిదే ప్రధాన పాత్ర. విశాఖ, విజయనగరం జిల్లాల్లో మద్యం సిండికేట్లలో ఉన్న అనేక మంది మద్యం వ్యాపారులు ఏసీబీ విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టారు. విజయనగరంలో ప్రభుత్వానికి కోట్లలో నష్టం విజయనగరంలో బొత్స కుటుంబం అధీనంలో ఉన్న మద్యం దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలయ్యాయి. రోజుకు రూ. 3 లక్షల మద్యం అమ్ముడుపోయే మద్యం దుకాణాలను రూ. 60 లక్షలకు చేజిక్కించుకున్నారు. బొత్స అనుయాయుల పేరుతో చేజిక్కించుకున్న అన్ని దుకాణాల పరిస్థితి ఇదే. గరిష్టంగా ఎక్కడా రూ. 1.10 కోట్లకు మించలేదు. అదే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రోజుకు రూ. 75 వేల మద్యం మాత్రమే అమ్ముడుపోయే దుకాణాలకు సైతం రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మేర టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన విజయనగరంలో బొత్స కుటుంబం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందన్న సంగతినీ ఏసీబీ అన్ని వివరాలతో నివేదిక సమర్పించింది. మచ్చుకు 64 దుకాణాల రికార్డులు తనిఖీ చేసినప్పుడు 58.6 కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా తెలియజేసింది. ఎప్పటికప్పుడు సీఎంకు సమాచారం.. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో అధికార పార్టీ నేతల పాత్రను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు అత్యున్నత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘కేసును ఒక కొలిక్కి తేవాలని నూరిపోసిన ముఖ్యమంత్రి కిరణ్.. అకస్మాత్తుగా ఒక రోజున వేగం తగ్గించాలని ఆదేశించారు. సరిగ్గా రెండు రోజులకే కీలక అధికారిని బదిలీ చేశారు’ అని ఓ సీనియర్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ‘విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి మద్యం దుకాణాలతో లింక్‌లకు సంబంధించి సీఎంకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చాం. అయితే, హైకోర్టుకు ఇచ్చేటప్పుడు వాటిలో మార్పులు చేయాలని మాపై ఒత్తిడి తీసుకువచ్చారు’ అని విచారణలో పాలుపంచుకున్న ఓ అధికారి వెల్లడించారు. ‘మాకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. ఏం ఫరవాలేదు ధైర్యంగా ఉండండని చెప్పారు. కానీ చివరకు మేము బఫూన్‌లమయ్యాం’ అని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనేక రోజులు కష్టపడి మేము సేకరించిన సమాచారాన్ని ఓ దినపత్రికకు ఇవ్వాలని సీఎం కార్యాలయం మమ్మల్ని పురమాయించింది. తప్పనిసరి పరిస్థితిల్లో మేం పూర్తి వివరాలను నలుగురు విలేకరుల బృందానికి అందజేశాం’ అని కూడా ఆ అధికారి అసలు గుట్టును విప్పారు. బొత్స కుటుంబాన్ని కాపాడేందుకు... ఆర్భాటంగా మద్యం సిండికేట్ల కేసును వెలుగులోకి తెచ్చి ఏకంగా ఓ రాష్ట్ర మంత్రే ముడుపుల తీసుకున్నారని తాము నిర్భయంగా కోర్టుకు వెల్లడించినా చివరకు బొత్స కుటుంబాన్ని కాపాడటం కోసం కేసుకు స్వస్తి చెప్పాల్సి వచ్చిందని విచారణలో పాల్గొన్న ఓ అధికారి చెప్పారు. అంతే కాదు రాష్ట్రంలో ఈ కేసును ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేయవద్దని, మరెవ్వరి జోలికీ వెళ్లవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గుంటూరు, వరంగల్, ఖమ్మం, కర్నూలు, హైదరాబాద్, రంగారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల్లో మద్యం సిండికేట్ల వెనుక అధికార పార్టీ ప్రముఖుడు ఉన్నారు. వాటికి సంబంధించి మేము పూర్తి వివరాలు సేకరించాం. ఈలోగా విచారణ వద్దంటూ ఓ ఉన్నతాధికారి నుంచి వర్తమానం అందింది’ అని వారు తెలియజేశారు. |
Tuesday, 5 June 2012
హస్తినలో చీర్స్.. మందు మాఫియా హ్యాపీస్
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment