YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

ఆ మరణం ఓ మిస్టరీ .కాంగ్రెస్ ఎంపీ ల్యాప్‌టాప్‌లోకి సీవీఆర్ రికార్డు ఎలా వచ్చింది?

ఇప్పటికీ దక్కని సమాధానాలు
నాలుగు నెలలుగా మూలన పెట్టిన ‘బెల్ 430’ని ఎందుకు తెచ్చారు?... ఆ తర్వాత గంట సేపటికే ‘అగస్టా’ ఎలా బయటికి వచ్చింది?
ఎయిర్‌వర్తీనెస్‌పై డీజీసీఏ మాటల్లో ఏది నిజం?
రెండు ఇంజన్లు ఒకేసారి ఎలా ఆగిపోయాయి?
ఈ లోపాలకు కారణాలేమిటి? విద్రోహ చర్యకు ఆస్కారం లేదా?

‘‘ఇక్కడ ఇదెందుకుంది?’’
- బేగంపేట విమానాశ్రయంలో ‘బెల్ 430’ హెలికాప్టర్‌ను చూసి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆఖరి ప్రయాణానికి బయల్దేరే ముందు ఆశ్చర్యంగా అడిగిన ప్రశ్న ఇది.
 

ఈ ప్రశ్నకే కాదు.. దీనికి ముందూ వెనుకా ఉన్న ఇంకా చాలా చాలా ప్రశ్నలకూ సమాధానాలు దొరకటం లేదు. దర్యాప్తు సంస్థలు చెప్పిన కారణాలు.. వాస్తవ పరిస్థితులకు ఎక్కడా అతకటం లేదు. ఆ సంస్థలు హడావుడిగా చేసిన పరస్పర విరుద్ధమైన సూత్రీకరణలు అసంబద్ధంగా ఉన్నాయి. అవి అతి ముఖ్యమైన అంశాలను తేలికగా కొట్టివేశాయి. ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని చీకట్లో దాచేశాయి. ఈ దుర్ఘటనపై.. దానిపై జరిగిన దర్యాప్తుల తీరుపై.. దర్యాప్తు సంస్థల నివేదికలపై.. నివేదికల్లో పేర్కొన్న అంశాలపై.. విమానయాన రంగ ఇంజనీరింగ్ నిపుణులూ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. 

సామాన్య జనం సైతం మరెన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. దర్యాప్తు సంస్థలు, పాలకులు ఇస్తున్న సమాధానాలు.. అడ్డగోలు వాదనలుగా ఉన్నాయే తప్ప.. హేతుబద్ధంగా లేనేలేవు. ఈ ప్రశ్నలు, సందేహాలతో పాటు.. దర్యాప్తు నివేదికల్లోని డొల్ల తనాన్ని.. కల్లబొల్లి కబుర్లను ‘సాక్షి’ ఎప్పటికప్పుడు పాఠకుల ముందుకు తెచ్చింది. అప్పుడూ సమాధానం లేదు! వైఎస్సార్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో.. తన భర్త మరణంపై వైఎస్ సతీమణి విజయమ్మ తమకున్న అనుమానాలను ప్రస్తావించారు. ఇప్పుడూ సమాధానం లేదు! అన్నిటికీ పాలకులది ఒకటే బుకాయింపు! అదేమంటే.. రాజకీయం చేస్తున్నారంటూ దబాయింపు!! అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు అమానుషంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్ మరణం వెనుక వీడని ‘మిస్టరీ’పై ప్రత్యేక కథనం ఇది... 

2009 ఆగస్టు 16 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీఎంఆర్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ప్రయాణం కావాల్సి ఉంది. విమానం గాలిలోకి లేచేందుకు సిద్ధమయింది. కానీ చివరి నిమిషంలో విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఆఖరి నిమిషంలో వైఎస్ విమాన ప్రయాణాన్ని రద్దుచేశారు. సరిగ్గా పక్షం రోజుల తర్వాత...

2009 సెప్టెంబర్ 2 

రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బయల్దేరిన రాజశేఖరరెడ్డిని.. ‘బెల్ 430’ ఎక్కించి పంపించారు. అది గాలిలోకి లేచిన గంట తర్వాత.. ఆచూకీ లేకుండా పోయింది. మరుసటి రోజు నల్లమల అడవుల్లో ఆ హెలికాప్టర్ శకలాలతో పాటు.. అందులో ప్రయాణిస్తున్న వైఎస్ తదితరులు మాంసం ముద్దలుగా కనిపించారు. 

ఇది విద్రోహమన్నారు జనం. కాదు ప్రమాదమని ప్రకటించారు పాలకులు. హడావుడిగా పూర్తిచేసిన దర్యాప్తుల్లోనూ విద్రోహం లేనేలేదని.. వట్టి ప్రమాదమేనని ఆగమేఘాల మీద నివేదికలు ఇచ్చేశారు. మరి ప్రమాదానికి కారణమేమంటే.. ప్రతికూల వాతావరణం అన్నారు. దట్టమైన క్యుములోనింబస్ మేఘాలన్నారు. ఆ మేఘాల కిందుగా వీచే బలమైన గాలులన్నారు. మళ్లీ అదే నోటితో.. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాల తలెత్తాయన్నారు. ఇంధన సరఫరా మార్గంలో లోపాలన్నారు. ఇంజన్లు రెండూ ఒకేసారి ఆగిపోయాయన్నారు. అదే సమయంలో రోటర్ తిరగలేదన్నారు. టర్బైన్‌లోనూ లోపం తలెత్తిందన్నారు. అటుతిప్పి.. ఇటుతిప్పి.. చివరికి పైలట్ల తప్పిదమనీ సూత్రీకరించారు. ఇన్ని సాంకేతిక లోపాలు ఒకేసారి ఎలా వస్తాయంటే.. దురదృష్టం అన్నారు. ఇంకా మాట్లాడితే.. అసలు హెలికాప్టర్‌కు ఎయిర్‌వర్తీనెస్సే లేదన్నారు. అందుకే ప్రమాదం జరిగిందన్నారు. ఇన్ని పొంతనలేని కారణాలు చెప్తూ.. అది ప్రమాదమేనని నమ్మించేందుకు అష్టకష్టాలు పడ్డారు. 

ఇన్ని సాంకేతిక లోపాల వెనుక విద్రోహ చర్యకు ఆస్కారం లేదా? అన్న సందేహం ఏ కోశానా దర్యాప్తు సంస్థలకు రాలేదంట! ఈ హెలికాప్టర్ ప్రయాణానికి సరిగ్గా పక్షం రోజుల ముందు కూడా.. వైఎస్ విమాన ప్రయాణం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం గుర్తించటంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఎక్కిన హెలికాప్టర్‌లో తీవ్ర సాంకేతిక లోపాలు ఒక్కసారిగా దాడిచేశాయి. ఈ రెండు ఘటనలకూ లింకుందా? అన్న అనుమానమూ రాలేదంట! ఆ కోణం వైపు నిపుణులెవరైనా సూచిస్తున్నా.. ఆ వైపు కన్నెత్తి చూడరంట! హెలికాప్టర్ కూలిపోవటానికి ముందు అరగంట పాటు ఏం జరిగింది అనేది.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను వింటే తెలిసిపోతుంది. కానీ.. అరగంట నిడివి గల సంభాషణల్లో కేవలం ‘కీలకమైన 6 నిమిషాల’ గురించే దర్యాప్తు సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. అవి కూడా పైలట్ - కో పైలట్ మాటలు మినహా.. మరేమీ లేదంటున్నారు. మిగతా 24 నిమిషాల సంభాషణలేమిటనేది ఇప్పటికీ ‘రహస్యమే’! అదేమంటే.. 6 నిమిషాలు మాత్రమే రికార్డయిందని.. మిగతాది సరిగా రికార్డు కాలేదని బుకాయిస్తున్నారు. 

అసలు సీవీఆర్‌లో రికార్డయిన సంభాషణలు బయటపెట్టటానికి ఎవరికైనా ఉన్న అభ్యంతరం ఏమిటి? అసలు సీవీఆర్‌లో ఏముంది? హెలికాప్టర్ డాటా రికార్డర్ ఏం చెప్తోంది? అన్ని విషయాలనూ పారదర్శకంగా బయటపెట్టొచ్చు కదా? ఎందుకంత రహస్యం? ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు.. తటస్థమైన అంతర్జాతీయ వైమానిక ఇంజనీరింగ్ నిపుణులతో దర్యాప్తు చేయించి నిజం ఏమిటో నిరూపించొచ్చు కదా? ఎందుకంత ధైర్యం చేయలేకపోతున్నారు? వైఎస్ సామాన్యుడేమీ కాదు కదా? ఒక రాష్ట్రానికి సీఎం కదా? 8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి కదా? ఆయన మరణం వెనుక ఏ కుట్రా, కుతంత్రం, విద్రోహం లేకపోతే.. ఎందుకంత భయం?

వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనకు ముందూ వెనుకా జరిగిన ఘటనల పరిణామ క్రమం.. ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు, ఉన్నతాధికారుల వ్యవహార శైలి.. ఘటనపై దర్యాప్తు సంస్థలు స్పందించిన తీరు.. అవి తమ దర్యాప్తు నివేదికల్లో పేర్కొన్న అంశాలు.. అన్నింటిపైనా నిశిత పరిశీలకులు, వైమానిక ఇంజనీరింగ్ నిపుణులు, సామాన్య ప్రజలు అనేకానేక సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే... 


‘బెల్ 430’ని ఎందుకు తెచ్చారు?

‘బెల్ 430’ హెలికాప్టర్‌లో తరచూ సమస్యలు వస్తున్నాయనే.. దానిని పక్కన పెట్టారు. ‘అగస్టా’ను కొనుగోలు చేశారు. పదేళ్ల నాటి పాడుబడిన బెల్ హెలికాప్టర్‌ను అప్పటికే నాలుగు నెలలుగా మూలన పెట్టేశారు. బేగంపేట విమానాశ్రయంలో దానిని ఉంచిన హ్యాంగర్‌కు ఎలాంటి భద్రతా లేదు. సాధారణంగా.. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీ ప్రయాణించే హెలికాప్టర్‌కు ఎలాంటి విద్రోహం జరగకుండా చూసేందుకు సీఐఎస్‌ఎఫ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల భద్రత కల్పించాల్సి ఉంటుంది. 

కానీ ‘బెల్’కు సాధారణ పోలీసు భద్రత కూడా లేదు. అయితే.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనటానికి బయల్దేరి వస్తే.. బేగంపేట విమానాశ్రయంలో ‘బెల్ 430’ కనిపించింది. ఇది చూసి వైఎస్ ఆశ్చర్యపోయారు. ‘ఇదేంటి? ఇక్కడ ఇదెందుకుంది? అగస్టా ఏమైంది?’ అని వైఎస్ వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగారు. ‘అగస్టా సర్వీసులో ఉంది.. అందుకే దీనిని సిద్ధం చేశాం’ అని వాళ్లు బదులిచ్చారు. ‘దీనితో ఇబ్బందేమీ లేదు కదా?’ అని వైఎస్ అడిగారు. ‘ఏమీ లేదు.. అంతా బాగుంది’ అని వాళ్లు భరోసా ఇచ్చారు. వారి మాటను విశ్వసించిన వైఎస్ అందులో ప్రయాణమయ్యారు. ఉదయం 8:38 గంటలకు బయల్దేరిన ‘బెల్ 430’ సరిగ్గా 40 నిమిషాల తర్వాత అదృశ్యమైపోయింది. రాడార్‌లో కనిపించకుండా పోయింది. గంటలు గడుస్తున్నా చేరాల్సిన గమ్యస్థానం చేరలేదు. 

గంటలోనే ‘అగస్టా’ ఎలా వచ్చింది?

ముఖ్యమంత్రి ప్రయాణం కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన చాపర్ ‘అగస్టా’. కానీ.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ ప్రయాణానికి ఈ చాపర్‌ను సిద్ధం చేయలేదు. అదేమంటే.. సర్వీసింగ్‌కు వెళ్లిందని చెప్పారు. అయితే.. అదే రోజు మధ్యాహ్నం ఆ చాపర్ గాలింపు కోసం బయల్దేరింది. సీఎం ప్రయాణానికి సిద్ధంగా లేని చాపర్.. ఆ తర్వాత ఒకటి, రెండు గంటల్లోనే ఎలా సిద్ధమయ్యింది? అసలేం జరిగిందని ఆరా తీస్తే.. పైలట్లు సెలవులో ఉన్నారన్న సాకుతో ‘అగస్టా’ను బయటకు తీయలేదన్న విషయం బయటపడింది. ఈ విషయం ‘సాక్షి’ గతంలోనే బయటపెట్టింది. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీ ప్రయాణం షెడ్యూల్ నెల రోజులు ముందుగానే తెలిసినా.. పైలట్లకు సెలవులు ఎలా ఇచ్చారు? ‘అగస్టా’ కెప్టెన్ బొరాన్ గుప్తా.. వైఎస్ ప్రయాణానికి కేవలం 2 రోజుల ముందే సెలవుపై వెళ్లారు. కో పైలట్లు మధువర్మ, వికాస్‌లు కూడా విధుల్లో లేరు. వీరందరినీ ఒకేసారి సెలవుపై పంపించారా? అలా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ‘అగస్టా’ సర్వీసింగ్‌లో ఉందని, ఆ రోజు మధ్యాహ్నమే వచ్చిందని నమ్మించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒకవేళ అది నిజంగానే సర్వీసింగ్‌లో ఉందనుకుంటే.. మరో గంటా రెండు గంటల్లో సిద్ధమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు.. మూలనపెట్టిన ‘బెల్’ను బయటకు తీసి అందులో వైఎస్‌ను ఎందుకు ఎక్కించారు? ఆ కాసేపటి వరకూ ఆగి.. ‘అగస్టా’ వచ్చాకే అందులో ప్రయాణం చేయవచ్చు కదా?

‘ప్రశ్నలే... ప్రశ్నలే... సమాధానాలు సంతృప్తి పరచవు!’

ప్రమాదమని ఎలా ప్రకటించేశారు?

ముఖ్యమంత్రి వంటి వీవీఐపీల భద్రతా ప్రమాణాల ప్రకారం.. సీఎం స్థాయిలోని వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే.. ముందుగా దాని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉన్నదా? లేదా? అని తేల్చటం ప్రభుత్వాల విధి. కానీ.. వైఎస్ మరణం విషయంలో ఈ ప్రమాణాలను ఏ మాత్రం పాటించలేదు. పావురాలగుట్ట మీద హెలికాప్టర్ శకలాలు, ఛిద్రమైన మృతదేహాలు కనిపించిన కొద్ది సేపటికే.. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణించారు’ అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అటు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించేశారు. దుర్ఘటనను చివరికి పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా.. ప్రమాదం అనే పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చనిపోతేనే.. అనుమానాస్పద మరణంగా నమోదు చేసి ఆ కోణంలో దర్యాప్తు చేసే పోలీసులు.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరణాన్ని ప్రమాదమేనని తక్షణమే ఎలా సూత్రీకరించారు? కనీసం ప్రాథమిక స్థాయి దర్యాప్తు కూడా చేయకుండానే.. ఘటనా స్థలిని క్షుణ్నంగా పరిశోధించకుండానే.. కనీసం మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించక ముందే.. ‘ప్రమాదంలో చనిపోయార’ని అందరూ ఎలా నిర్ణయానికి వస్తారు? అంటే.. ఇది ప్రమాదమేనని ప్రజలను నమ్మించటానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారా? తర్వాత హడావుడిగా పూర్తిచేసిన దర్యాప్తుల్లోనూ ‘ఏం తేల్చాలో’ ముందుగానే నిర్దేశించారా? 

ఈఎల్‌టీ పది రోజుల తర్వాత ఎలా దొరికింది? 

హెలికాప్టర్ ఏవైనా ఇబ్బందులు వచ్చి అత్యవసరంగా నేలకు దిగినా.. ఏదైనా దుర్ఘటనకు లోనైనా.. అది ఎక్కడుందో తెలియజేసే ‘ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మిటర్’ (ఈఎల్‌టీ).. ఈ హెలికాప్టర్‌లో ఉందా? లేదా? అన్నది పది రోజుల పాటు అంతుచిక్కని మిస్టరీగా ఉంది. దుర్ఘటనకు లోనైన వెంటనే ఈఎల్‌టీ క్రియాశీలమై (యాక్టివేట్ అయ్యి) సంకేతాలు పంపితే.. శాటిలైట్ ద్వారా వాటిని గుర్తించి.. ఘటనా స్థలాన్ని కనిపెడతారు. కానీ.. సైనిక సిబ్బంది, దర్యాప్తు అధికారులు పది రోజుల పాటు గాలించినా.. ఘటనా స్థలంలో ఈఎల్‌టీ దొరకలేదు. పది రోజుల పాటు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలకు కూడా అది కనిపించలేదు. పది రోజుల తర్వాత.. దర్యాప్తు బృందంలోని ఒక అధికారి.. ఈఎల్‌టీ దొరికిందని ప్రకటించారు. అన్ని రోజులు వాళ్ల కళ్లబడకుండా అది ఎలా దాక్కుంది? హెలికాప్టర్‌లో ఈ ఈఎల్‌టీ పనిచేయలేదని చెప్తున్నారు. అందువల్లే.. హెలికాప్టర్ అదృశ్యమైన 24 గంటల వరకూ దాని జాడను గుర్తించలేకపోయారు. దానికి కారణం.. ఈఎల్‌టీ ఫ్రీక్వెన్సీని నిర్ణీత ప్రమాణాల మేరకు అప్‌గ్రేడ్ (స్థాయిని పెంచటం) చేయలేదని ఆ తర్వాత డీజీసీఏ నివేదికలో బయటపెట్టారు. 2005లో విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈఎల్‌టీని అప్‌గ్రేడ్ చేయలేదని, ఆ విషయాన్ని ఎయిర్-వర్తీనెస్ బృందం గుర్తించలేదని డీజీసీఏ తప్పుపట్టింది. మరి దీనికి ఎవరిని బాధ్యుల్ని చేశారు? 

హెలికాప్టర్ వేగం.. ఎత్తు ఎందుకు తగ్గిపోయింది?

హెలికాప్టర్ పైలట్లు విజువల్ ఫ్లైట్స్ రూల్స్ (వీఎఫ్‌ఆర్) నుంచి ఇన్‌స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ (ఐఎఫ్‌ఆర్)కు మారటం అసాధారణమేమీ కాదు. ఇలా మారినంత మాత్రాన అది.. పైలట్, కోపైలట్‌లు చాపర్‌ను నడిపే సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? వాతావరణం బాగోలేనప్పుడు.. పైలట్లు ఐఎఫ్‌ఆర్‌కు మారటం వింతేమీ కాదు. అలా చేయటం వల్ల చాపర్ ఆటోపైలట్ (తనకు తానుగా యాంత్రికంగా నడవటం)లోకి వెళ్తుంది. వీఎఫ్‌ఆర్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ.. పైలట్లు ఐఎఫ్‌ఆర్‌కు మారారని డీజీసీఏ తన నివేదికలో వింత వాదన చేస్తోంది. ఈ వాదన తర్కబద్ధంగా లేదు. కర్నూలు సమీపంలో మబ్బులు పట్టివున్న వాతావరణంలోకి ప్రవేశించాక.. చాపర్ వేగాన్ని 140 నాట్స్ నుంచి 40 నాట్స్‌కు ఎందుకు తగ్గించారు? అసలు.. 5,500 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన హెలికాప్టర్.. నల్లమల అడవులపై నుంచి వెళ్తున్నప్పుడు 2,000 అడుగుల ఎత్తుకు దిగి ప్రయాణించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ ఎత్తు నుంచి కూడా ఒక్కసారిగా మరో 1,000 అడుగులు కిందకు దిగటానికి కారణమేమిటి? ఇలా నియంత్రణ లేకుండా హెలికాప్టర్ కిందకు దిగిపోవటానికి కారణాలేమిటన్నది డీజీసీఏ నివేదిక చెప్పలేదు. ఇంజన్లు రెండూ ఆగిపోతేనే అంత వేగంగా కిందకు జారిపోతుందని వైమానిక ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లోనే చాపర్ నియంత్రణ లేకుండా పడిపోతుందని అంటున్నారు. అలా పడిపోతున్నప్పటికీ.. ప్రధాన రోటర్ తిరుగుతూనే ఉంటుందని, చాపర్ కొంత దూరం ప్రయాణించటానికి సాయం చేస్తుందని వివరిస్తున్నారు. కానీ.. వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ విషయంలో ఏ విభాగమూ పనిచేసినట్లు కనిపించటం లేదు. అది పావురాల గుట్ట శిఖరాన్ని నిమిషానికి 4 కిలోమీటర్ల వేగంతో ఢీ కొట్టింది. ఈ వేగంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశాలు శూన్యం. 

ఎయిర్‌వర్తీనెస్‌పై డీజీసీఏ మాటల్లో ఏది నిజం?

అసలు.. బెల్ 430 హెలికాప్టర్ ఎయిర్‌వర్తీనెస్‌పైనే తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై స్వయంగా డీజీసీఏనే మూడు రకాలుగా మాట మార్చింది. ఈ చాపర్‌కు ఇచ్చిన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌కు సంబంధించిన వివరాలు, తేదీలను డీజీసీఏ తన వెబ్‌సైట్‌లో పలుమార్లు మార్చింది. ఈ బెల్ చాపర్‌కు 2005 జూలై 5వ తేదీన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశామని.. అది 2007 జూలై వరకూ చెల్లుతుందని డీజీసీఏ తొలుత పేర్కొంది. ఈ విషయాన్ని ‘టైమ్స్ నౌ’ ఇంగ్లిష్ న్యూస్ చానల్ 2009 సెప్టెంబర్ 2వ తేదీ నాడే (సాయంత్రం 6:41 గంటలకు) వార్తా కథనంలో వెల్లడించింది. 

కానీ.. రెండు రోజుల్లోనే డీజీసీఏ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను మార్చేసింది. ఈ బెల్ చాపర్‌కు ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌ను 2006 డిసెంబర్ 5న జారీ చేయటం జరిగిందని.. అది 2010 డిసెంబర్ 5వ తేదీ వరకూ చెల్లుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ 2009 సెప్టెంబర్ 8వ తేదీన వెల్లడించింది. ప్రస్తుతం డీజీసీఏ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ చాపర్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ 2009 డిసెంబర్ వరకూ చెల్లుబాటవుతుంది. కానీ.. దుర్ఘటనపై డీజీసీఏ ఇచ్చిన దర్యాప్తు నివేదికలో.. ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌ను 2008 డిసెంబర్‌లో జారీ చేశారని, అది 2010 డిసెంబర్ వరకూ చెల్లుతుందని పేర్కొంది. వీటన్నింటిలో ఏది నిజం? ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చారు? ఎందుకు ఇన్ని తేదీలు ముందుకు జరిపారు? 

ఘటనాస్థలానికి భద్రత ఏదీ?

ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినా, ఎక్కడైనా కాస్త సంచలనాత్మక ఘటన జరిగినా.. పోలీసులు ఆ ప్రదేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటారు. సామాన్యులెవరూ ఆ దరిదాపుల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తారు. ఘటనా స్థలంలో లభించే ఆధారాలు ఎంత విలువైనవో.. దర్యాప్తు అధికారులకు తెలియనిది కాదు. కానీ.. నాటి సీఎం వైఎస్ మరణించిన ఘటనా స్థలం విషయంలో ఏం చేశారు? మృతదేహాలను అక్కడి నుంచి తరలించాక.. ఆ ప్రదేశంతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. దుర్ఘటన జరిగిన పావురాలగుట్టకు అదే రోజు నుంచి వందలు, వేల సంఖ్యలో ప్రజలు వెల్లువలా వచ్చిపోతూనే ఉన్నారు. ఘటనా స్థలంలో తమకు కనిపించిన వస్తువులను పట్టుకుపోతూనే ఉన్నారు. 

కానీ.. వారిని నియంత్రించేందుకు, ఆధారాలు చెరిగిపోకుండా చూసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. దుర్ఘటనలో చనిపోయిన వైఎస్ వాచీని పార్నపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డి, రామాంజనేయ అనే వ్యక్తులు పట్టుకుపోయి.. తిరిగి 6వ తేదీన పోలీసులకు అందించటమే దీనికి నిదర్శనం. వైఎస్, ఇతర ప్రయాణికులకు చెందిన అనేక వస్తువులు, సూట్‌కేస్ ఐదో తేదీ వరకూ అక్కడే పడున్నాయి. వైఎస్, వెస్లీ, సుబ్రహ్మణ్యంలకు చెందిన సెల్‌ఫోన్లను కర్నూలు జిల్లా అధికారులు 8న స్వాధీనం చేసుకున్నారు. దుర్ఘటన జరిగిన పది రోజుల తర్వాత.. 13వ తేదీన పావురాలగుట్టకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ డాటాకార్డ్, వెస్లీకి చెందిన గుర్తింపు కార్డులు కనుగొన్నారు. ఇన్ని రోజుల తర్వాత దర్యాప్తు అధికారులు తీరికగా అక్కడికి వస్తే.. ఏ ఆధారాలు లభిస్తాయి? సీఎం స్థాయి వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చనిపోతే.. ఘటనా స్థలం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలిగారు?

వీఓఆర్‌లు రెండూ ఎలా విఫలమయ్యాయి? 

చాపర్‌లోని ఇంజన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. చాపర్‌లో బిగించివున్న రెండు వీహెచ్‌ఎఫ్ ఓమ్ని రేంజ్ (వీఓఆర్)లు ఒకేసారి విఫలమయ్యాయి. పైలట్, కో-పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోళ్లతో (ఏటీసీలతో) నిరంతరం సంప్రదింపులు జరపటానికి, ప్రయాణించాల్సిన మార్గం గురించి తెలుసుకోవటానికి వీఓఆర్‌లు దోహదం చేస్తాయి. ఇవి రెండూ ఒకేసారి ఎలా విఫలమయ్యాయి? దానికి కారణమేమిటి? 


రెండు ఇంజన్లూ ఎలా ఆగిపోయాయి
చాపర్‌లోని ఇంజన్లు రెండూ ఒకేసారి విఫలమవటం అనూహ్యమైన విషయం. దీనిపై డీజీసీఏ నివేదిక ఎందుకు మౌనం దాల్చింది. అసలు.. వీవీఐపీ ప్రయాణానికి ఈ చాపర్‌కు ఎయిర్-వర్తీనెస్ (గాలిలో ప్రయాణించే సామర్థ్యం) లేదని ఈ నివేదిక చెప్తోంది. అంతకుముందలి ప్రయాణంలో చాపర్‌లోని మొదటి ఇంజన్.. నిర్దేశిత ఉష్ణోగ్రతను మించిపోయిందని, ఆ ఫలితంగా టార్క్ కూడా పెరిగిపోయిందని పేర్కొంది. ఈ లోపం.. చాపర్‌లోని పానల్ బోర్డుపై ఒక ఇండికేటర్ రూపంలో పైలట్ దృష్టికి వస్తుంది. అయినప్పటికీ.. చాపర్ దుర్ఘటనకు ఇది కారణం కాకపోవచ్చని డీజీసీఏ పేర్కొంది. 



ఇంధన సరఫరాలో లోపమే కారణమా?
వాతావరణం, ఇంధన సరఫరాలో లోపం.. హెలికాప్టర్ కూలిపోవటానికి ఈ రెండూ కారణాలుగా డీజీసీఐ చెప్తోంది. కానీ.. ఇంధన సరఫరాలో లోపం తలెత్తినప్పటికీ.. అంటే ఇంధన సరఫరా పూర్తిగా కట్ అయినప్పటికీ.. చాపర్ కనీసం మరో 20 నిమిషాల పాటు ఎగురుతూనే ఉండగలదు. ఇంధన సరఫరాలో లోపాన్ని పైలట్లు 9:21 గంటలకు గుర్తించారని, చాపర్ 9:27 గంటలకు కూలిపోయిందని డీజీసీఏ నివేదికలో పేర్కొన్నారు. అంటే.. ఇంధన సరఫరా ఆగిపోయిన ఆరు నిమిషాల్లోనే చాపర్ కూలిపోయినట్లు చెప్తున్నారు. అదెలా సాధ్యమవుతుంది? 



వెస్లీ పిస్టల్‌లోని బుల్లెట్లు ఏమయ్యాయి?
ముఖ్యమంత్రి ప్రధాన భద్రతా అధికారి వెస్లీకి చెందిన పిస్టల్ అత్యంత ఆధునికమైనది. ఎప్పుడూ లోడ్ చేసి, సిద్ధంగా ఉంటుంది. ఆయన వద్ద మొత్తం 13 బులెట్లు ఉంటాయి. కానీ.. ఘటనా స్థలం నుంచి కేవలం 7 బులెట్లే దొరికినట్లు సీబీఐ అధికారులు చెప్తున్నారు. మరి మిగతా 6 బులెట్లు ఏమైనట్లు? ప్రమాద స్థలంలో ఖాళీ మేగజీన్‌తో దొరికిన తుపాకీని లేబొరేటరీకి పంపించగా.. ఈ తుపాకీ నుంచి ఫైరింగ్ జరిగిందనటానికి ఆనవాళ్లుగా రసాయనిక అవశేషాలు ఉన్నాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సెన్సైస్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ అధికారి చెప్పినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది. 

ఇదిలావుంటే.. హెలికాప్టర్ అవశేషాల్లో ఎగ్జిట్ డోర్‌కు ఒక రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. మొదట ఇది బులెట్ వల్ల అయిన రంధ్రంగా భావించినా.. ఆ తర్వాత అది కాదని తేల్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ పిస్టల్.. వెస్లీకి 2009 జూన్ 21న ఇచ్చారని.. దుర్ఘటన జరిగే ముందు వరకూ దానిని ఫైర్ చేయలేదని సీబీఐ పేర్కొంది. మరి వెస్లీ వద్ద ఉండాల్సిన మరో 6 బులెట్లు ఏమైపోయాయనే అంశంపై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదు? అంత ముఖ్యమైన అంశాన్ని ఎందుకు తేలికగా విస్మరించింది? 


ఒకేసారి ఇన్నిసమస్యలెలా వచ్చాయి?
ఏ యంత్రంలోనైనా ఒక్కోసారి ఒక్కో లోపం తలెత్తటం సాధారణమే. అయితే.. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతి ప్రయాణానికీ ముందు క్షుణ్నంగా పరిశీలించి, పరీక్షించి, ఏ సమస్యకూ ఆస్కారం లేకుండా చూసుకుని కానీ.. ప్రయాణానికి సిద్ధం చేయరు. కానీ.. వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్‌లో అనేకమైన లోపాలు.. అది కూడా చాలా పెద్దవి.. ఒకేసారి తలెత్తాయని చెప్తున్నారు. వీఓఆర్‌లు రెండూ ఏకకాలంలో విఫలమవటం.. ఆ వెంటనే ఇంధన సరఫరా వ్యవస్థలో లోపం.. దానివెంబడి ఇంజన్లు రెండూ ఒకేసారి ఆగిపోవటం.. ఆ వెంటనే రోటర్ తిరగకుండా నిలిచిపోవటం, టర్బైన్ ఆగిపోవటం.. ఇన్ని సమస్యలు ఏకకాలంలో ఎలా ఉత్పన్నమయ్యాయి? ఇంజన్లు, మెయిన్ రోటార్ నిలిచిపోవటంతో.. చాపర్ నిమిషానికి 14,200 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది. 

మరో మాటలో చెప్పాలంటే.. చాపర్ ఒక విసిరేసిన రాయిలాగా.. 14 సెకన్లలో నేలకూలింది. అంత వేగంగా కూలిపోయినా కూడా.. అలాగే నిలువుగా నేలమీద పడి, 150 అడుగులు దూసుకుపోయి, మంటల్లో చిక్కుకుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈఎల్‌టీ పనిచేయలేదని.. సీవీఆర్ కూడా దెబ్బతిన్నదని పేర్కొంటున్నారు. ఇన్ని సాంకేతిక సమస్యలు ఒక్కసారిగా ఎలా తలెత్తుతాయి? 


సీవీఆర్‌లో ఆ 6 నిమిషాలే ఎందుకు రికార్డయ్యాయి? 
హెలికాప్టర్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) నుంచి సేకరించిన సంభాషణల గురించి డీజీసీఏ అక్కడక్కడా రెండు ముక్కలు ప్రస్తావించింది కానీ.. ఆ సంభాషణ పూర్తి పాఠాన్ని తన నివేదికలో వెల్లడించలేదు. ఇది చాలా అసహజంగా ఉందని వైమానిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బెల్ 430 చాపర్‌లోని సీవీఆర్ మాగ్నటిక్ టేప్‌లో మొత్తం 32 నిమిషాల నిడివి గల సంభాషణలు రికార్డవుతాయి. దీనికి సంబంధించి చాపర్‌లోని పైలట్ క్యాబిన్‌లో ఒక మైక్రోఫోన్, పాసింజర్ క్యాబిన్‌లో ఒక మైక్రో ఫోన్ ఉంటాయి. 

ఇవి చాలా శక్తివంతమైనవి. పాసింజర్ క్యాబిన్ విండ్ షీల్డ్ (అద్దం)ను తుడిచే వైపర్ శబ్దాన్ని కూడా ఇవి రికార్డు చేయగలవు. 2008 అక్టోబర్ 3వ తేదీన బేగంపేట విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు బయల్దేరిన ‘బెల్ 430’ హెలికాప్టర్ ఒకటి.. ఖమ్మం జిల్లాలో వెంకటాపురం సమీపంలో ఛత్తీస్‌గడ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని కోడిజుట్టు కొండపై కూలిపోయింది. మూడు నెలల తర్వాత దీని శకలాలను గుర్తించి.. సీవీఆర్‌ను వెలికి తీసి అందులోని సంభాషణలను విన్నారు.

కూలినప్పుడు సీవీఆర్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ.. అందులో మొత్తం 32:28 నిమిషాల నిడివి గల సంభాషణలు ఉన్నట్లు ఇదే డీజీసీఏ ఆ ప్రమాదంపై ఇచ్చిన నివేదికలో వివరించింది. రికార్డయిన పైలట్, కోపైలట్ సంభాషణలను కూడా ఏ నిమిషానికి ఏం మాట్లాడారు అన్నదానిని వివరంగా ఇచ్చింది. రోటార్ ఆర్‌పీఎం శబ్దంలో హెచ్చుతగ్గులు, ప్రయాణం ఆద్యంతం విండ్ షీల్డ్ వైపర్ పనిచేస్తున్న శబ్దంతో పాటు.. చిట్టచివరిగా 32:28 నిమిషాల వద్ద హెలికాప్టర్ దేనినో ఢీకొన్న శబ్దం అన్నీ స్పష్టంగా రికార్డయినట్లు ఆ నివేదికలో వెల్లడించింది.

వైఎస్ ప్రయాణించిన ‘బెల్ 430’ హెలికాప్టర్‌లో కూడా అదే సామర్థ్యమున్న సీవీఆర్ ఉంది. దానిని పూర్తిగా వింటే.. దుర్ఘటన జరగటానికి ముందు 32 నిమిషాల పాటు.. చాపర్‌లో ప్రయాణిస్తున్న వారి మధ్య ఏ సంభాషణలు జరిగాయి అన్నది తెలుస్తుంది. దీనిద్వారా.. అసలు ఏం జరిగి ఉంటుందనే అంశంపై నిర్దిష్టమైన అంచనాకు రావచ్చు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు.. ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? ఆయన ముఖ్య కార్యదర్శి ఎలా స్పందించారు? సీఎం ప్రధాన భద్రతాధికారి ఎలా స్పందించారు? అన్నది తెలుసుకోవచ్చు. కానీ.. 32 నిమిషాల నిడివిగల సీవీఆర్‌లో కేవలం ఆరు నిమిషాల నిడివి గురించే.. అది కూడా పైలట్ - కో పైలట్‌ల మధ్య సంభాషణ గురించే.. అందులోనూ చాలా స్వల్పంగానే డీజీసీఏ నివేదిక ప్రస్తావించింది. 

ఆ ఆరు నిమిషాల సమయాన్నీ పైలట్లు.. ఫ్లైట్ మాన్యువల్ వెదుకుతూ వృథా చేశారని, కాప్టర్ ఎలా ప్రయాణిస్తోందనేది పట్టించుకోలేదని మాత్రమే చెప్పింది. అందుకే ఆ ఆరు నిమిషాలు కీలకంగా అభివర్ణించింది. పోనీ.. ఆ ఆరు నిమిషాల సంభాషణ పూర్తి పాఠమైనా వెల్లడించారా? అంటే అదీ లేదు! మరి.. సీవీఆర్‌లో మిగతా 26 నిమిషాల సంభాషణల సంగతి ఏమిటంటే.. అవేవీ సరిగా రికార్డు కాలేదని చెప్తున్నారు. 

దుర్ఘటన జరగటానికి నాలుగు నిమిషాల ముందు.. కో పైలట్ ‘గో అరౌండ్’ అని పలుమార్లు చెప్పటమే చివరిగా రికార్డయినట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ‘ప్రమాదం’లో పడినప్పుడు పాసింజర్ క్యాబిన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఆయనతో పాటు ఉన్న ఉన్నతాధికారులు కానీ.. ఏమీ మాట్లాడలేదా? మౌనంగానే ఉన్నారా? అంతటి ఆందోళనకర పరిస్థితుల్లో అరగంట పాటు ఈ ముగ్గురూ మాట్లాడకుండా ఉండే అవకాశమే లేదు.. మరి ఏం జరిగింది? సీవీఆర్‌లో శబ్దాలు మల్టీ ట్రాక్‌పై రికార్డవుతాయి. వాటిలో పాసింజర్ క్యాబిన్ నుంచి రికార్డయిన మాటలను తొలగించేందుకు టాంపరింగ్ జరిగిందా? అది కాదంటే.. అప్పటికే వాళ్లు ముగ్గురూ ఇక మాట్లాడలేని పరిస్థితి (ఇన్‌కెపాసిటేటెడ్)లో ఉన్నారా? 



విద్రోహచర్యకు ఆస్కారం లేదా?
క్షుణ్నంగా తనిఖీ చేసి బయల్దేరినట్లు చెప్తున్న హెలికాప్టర్‌లో.. ఏ విద్రోహ చర్యా లేకుండానే ఇన్ని సమస్యలు పుట్టుకొచ్చాయా? చాపర్‌లో ఇంధన సరఫరా లోపం ఎప్పుడు తలెత్తుతుందంటే.. సంబంధిత వ్యవస్థను సుదీర్ఘ కాలం పాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల కానీ, లేదంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సరిచేసే వారు ఆ వ్యవస్థలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు కానీ తలెత్తుతుంది. వైమానిక ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. ఇంధన ట్యాంకు మూడు చాంబర్లుగా విభజించి ఉంటుంది. హెలికాప్టర్ లోడ్‌ను సమానంగా భరించే రెండు ఇంజన్లు.. చెరి సమానంగా ఇంధనాన్ని తీసుకుంటాయి. 

ఒక చాంబర్ పూర్తయిన తర్వాత మరొక చాంబర్ నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. సాధారణంగా.. ఇంజన్లకు కుడి లేదా ఎడమ వైపు చాంబర్ నుంచి ఇంధనం అందుతుంటుంది. ఒకవేళ ట్యాంక్ మధ్య చాంబర్‌లో పంచదార, ఇసుక వంటి పదార్థమేదైనా కలిస్తే.. ఇంజన్లు తొలుత మామూలుగానే ప్రయాణిస్తాయి. ఎందుకంటే.. అవి కుడి, లేదా ఎడమ వైపు చాంబర్ నుంచి ఇంధనం తీసుకుంటాయి కాబట్టి. వాటిలో ఒకటి ఖాళీ అయ్యాక.. మధ్య చాంబర్‌లో నాజిల్‌కు ఇసుక అడ్డంపడ్డప్పుడు.. ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోతుంది. దాంతో అవి పనిచేయటం ఆగిపోతాయి.

ఫలితంగా చాపర్ కిందకు పడిపోతుంది. అలాగే.. చాపర్‌లో టెయిల్ రోటర్, సెంట్రల్ రోటర్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు చాలా సున్నితమైనవి. ఎవరైనా స్వల్పంగా టాంపరింగ్ చేసినా (ఏదైనా పరికరాన్ని పాడు చేసినా).. గాలిలో ప్రయాణించేటప్పుడు ఏమైనా జరగొచ్చు. 


వైఎస్ గట్టిగా కేకలు వేసినట్లు సీవీఆర్‌లో ఉందన్న కథనాల గుట్టేమిటి? 
హెలికాప్టర్ దుర్ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టి.. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సీవీఆర్‌ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపించింది. దుర్ఘటన జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలకు రెండు ప్రముఖ తెలుగు టీవీ చానళ్లలో సంచలనాత్మక కథనాలు ప్రసారమయ్యాయి. సీవీఆర్‌లో సంభాషణలు తమకు తెలిశాయని ఆ చానళ్లు పేర్కొన్నాయి. ఘటన జరగటానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పెద్ద పెద్దగా కేకలు వేసినట్లు సంభాషణల్లో వినిపించిందని చెప్పాయి.

పైలట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ పేర్కొన్నాయి. అయితే.. రెండు, మూడు గంటల పాటు ఈ కథనాలను ప్రసారం చేసిన ఆ చానళ్లు ఆ తర్వాత ఈ అంశంపై మౌనం దాల్చాయి. దీని అర్థం ఏమిటి? ఆ చానళ్లకు సీవీఆర్‌లోని సంభాషణలు అందాయా? అవి ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవమెంత? ఆ వెంటనే ఆ చానళ్ల గొంతులు ఎందుకు మూగబోయాయి? తెర వెనుక ఏం జరిగింది? 



కాంగ్రెస్ ఎంపీ ల్యాప్‌టాప్‌లోకి సీవీఆర్ రికార్డు ఎలా వచ్చింది? 
హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించి సేకరించిన శకలాలు, ఆధారాలు అన్నీ.. దేశంలో పౌర విమానయానాన్ని పర్యవేక్షించే, దానికి సంబంధించిన దుర్ఘటనలను పరిశోధించే డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధీనంలోనే ఉంటాయి. అవి ఇతరుల చేతుల్లోకి వెళ్లటం నిబంధనలకు విరుద్ధం. ఆ హెలికాప్టర్ సీవీఆర్‌లోని సంభాషణలను తమకు అందించాలని.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. 

అయితే.. అలా సంభాషణల కాపీ అందించటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీ వస్తే.. డీజీసీఏతో మాట్లాడి.. ఆ సంభాషణలను వారికి వినిపిస్తామని చెప్పారు. అనుమానాస్పద దుర్ఘటనలో ఒక వీవీఐపీ మరణిస్తే.. సదరు వీవీఐపీ కుమారుడు, స్వయంగా ఎంపీ కూడా అయిన జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ సంభాషణల కాపీని ఇవ్వటానికి నిరాకరించారు. సీన్ కట్ చేస్తే.. ‘సీవీఆర్ సంభాషణలు నా ల్యాప్ టాప్‌లో ఉన్నాయి.. వస్తే వాటిని వినిపిస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇటీవల బాహాటంగా ప్రకటించారు. 

అత్యంత పకడ్బందీగా నిబంధనలు పాటిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ, డీజీసీఏ చెప్తుండగా.. ఒక కాంగ్రెస్ ఎంపీ ల్యాప్‌టాప్‌లోకి సీవీఆర్ సంభాషణల టేపు ఎలా వచ్చింది? సాక్షాత్తూ వైఎస్ కుమారుడైనా, తానూ ఎంపీ అయినా.. ఆయనకు అందించటం సాధ్యం కాని సంభాషణల కాపీ.. ప్రభుత్వంలో, అందునా విమానయాన శాఖతో ఏ సంబంధమూ లేని ఒక సాధారణ ఎంపీ చేతికి అలా అందాయి? దీని వెనుక మర్మమేమిటి? 



ఆ మేఘాలు లేవని తేలింది కదా? 
దట్టమైన క్యుములోనింబస్ మేఘాల్లో ప్రయాణించటం వల్ల, ఆ మేఘాల్లో ‘డౌన్ డ్రాఫ్ట్’ (కిందికి వీచే ఈదురుగాలుల) వల్ల హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందన్నది డీజీసీఏ, సీబీఐ దర్యాప్తు సంస్థల వాదన. అయితే.. దుర్ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకూ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సి-బ్యాండ్ రాడార్ చిత్రాలను ‘సాక్షి’ సేకరించింది. నిపుణుల ద్వారా వాటిని విశ్లేషించింది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఘటనా స్థలాన్ని గుర్తించి చూస్తే.. ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలే లేవన్నది తేటతెల్లమయింది.

హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కుడివైపుకు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయని.. వాతావరణ శాఖలో డెరైక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన నిపుణుడు ఒకరు స్పష్టంచేశారు. అయితే.. సాధారణ వర్షాన్నిచ్చే మేఘాలు మాత్రం ఉన్నాయి. దుర్ఘటన స్థలం కూడా ఈ మేఘాల చివరన ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయినా.. ఈ మేఘాల్లో ‘డౌన్ డ్రాఫ్ట్’ (కిందికి వీచే ఈదురుగాలులు) ఏర్పడే అవకాశం ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. 

చిత్రమేమిటంటే.. సీబీఐ కూడా ఇవే చిత్రాలను తన నివేదికలో పొందుపరిచి.. ఘటనా స్థలం దగ్గర్లో క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయని పేర్కొంది. ఆ చిత్రాల్లో కూడా ఘటనా స్థలం ఓ పక్కకు ఉన్నట్లు చూపుతూనే.. ఈ మేఘాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని బలంగా అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. ఎందుకిలా తిమ్మిని బమ్మిని చేస్తున్నారు? .

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!