YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

జగన్‌పై కుట్రలు తప్ప జనం గోడు పట్టని సర్కారు



ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోందన్న ధ్యాస లేదు. కనీసం విత్తనాలకు, ఎరువులకు కూడా దిక్కు లేదు.

పది రోజుల్లో విద్యా సంవత్సరం మొదలవనుంది. అయినా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే నాథుడు కూడా లేడు.

తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. కనీసం తమకు ఓట్లేసినందుకైనా వారి గొంతు తడుపుదామన్న ధ్యాస కూడా లేదు.

సంక్షేమ హాస్టళ్లు తెరుస్తున్నారు. వాటిలో కనీస సౌకర్యాలకూ దిక్కు లేకపోయినా చలనం లేదు.

కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగుకూ కరెంటు కష్టాలు కమ్ముకొస్తున్నాయి. పరిష్కారానికి ప్రయత్నించాలన్న చిత్తశుద్ధి కూడా లేదు.

ప్రజారోగ్యాన్ని పట్టించుకునే దిక్కే లేదు. 108, 104, ఆరోగ్య శ్రీ సేవలు అటకెక్కుతున్నా చలనం లేదు.

కీలక శాఖల్లో ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న దృష్టి లేదు.

సీఎంతో పాటు మంత్రుల పేషీల్లోనూ వేల సంఖ్యలో ఫైళ్లు ఖాళీగా ఉన్నాయి. పరిష్కారిద్దామన్న పట్టింపు లేదు.

విత్తనాలు మొదలు యూరియా దాకా ఎదురుతెన్నులే
నల్ల బజారుకు పత్తి విత్తనాలు.. ఈసారీ కష్టాల సేద్యమే
1.2 కోట్ల సర్కారీ, ప్రైవేటు విద్యార్థులకు సమస్యలు
మండలాలకు చేరిన సర్కారీ పుస్తకాలు 10 శాతమే
రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపైనా నిర్లక్ష్యమే
2011-12లో రూ.3,600 కోట్లకు.. ఇచ్చింది రూ. 2,600 కోట్లే
53.25 లక్షల రచ్చబండ దరఖాస్తులకు ఆర్నెల్లుగా అతీగతీ లేదు
కొత్తగా ఒక్క రేషన్ కార్డు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు
రెండేళ్లలో మంజూరైన ఇళ్లు 4 లక్షలే.. వాటి నిర్మాణానికీ దిక్కులేదు
రోజుకు 108 అంబులెన్స్‌లు 900 తిరగాలి.. కానీ తిరిగేవి 400

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పాలన పడకేసింది. ప్రజా సంక్షేమం గాలికి కొట్టుకుపోతోంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పెద్ద మనుషులకు ఇప్పుడు ఒకటే పట్టింపు, ఒకటే ధ్యాస, ఒకే స్పృహ... టార్గెట్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి! ఉప ఎన్నికలను, జగన్‌ను ఎదుర్కోవడమెలా అనే దానిపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ప్రభుత్వం, మంచినీరు, కరెంటు సహా ప్రజా సమస్యలను ఏ మాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలను మూటగట్టుకుంటోంది. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా పట్టించుకోవడం లేదు.

మరోసారి విత్తనాల బారులు..

అన్నదాతకు ఈ ఏడాది కూడా సర్కారీ నిర్లక్ష్యం పెను శాపంగా పరిణమిస్తోంది. ఉప ఎన్నికల బిజీలో తలమునకలుగా ఉన్న ప్రభుత్వ పెద్దలకు, వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోందన్న స్పృహ కూడా లేకుండా పోయింది. దాంతో విత్తనాలు, యూరియా తదితరాల కోసం ఈసారి కూడా రైతులు రోజుల తరబడి బారులు తీరక తప్పని పరిస్థితి. ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. 32 కంపెనీలు సరఫరా చేసే 1.27 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు (450 గ్రాములు) ఆ అవసరాలకు సరిపోతాయని చెప్పుకొచ్చింది. కానీ బ్లాక్ మార్కెటింగ్ రుచి మరిగిన పెద్ద కంపెనీలు, ముందుగా చెప్పినన్ని విత్తనాలివ్వలేమని వ్యవసాయ శాఖకు తేల్చి చెప్పాయి. గత ఏడాది రైతులు ఎక్కువగా కోరుకున్న మహికో విత్తనాలను 10 లక్షల ప్యాకెట్లు ఇస్తామని మొదట చెప్పిన సంస్థ, ఇప్పుడు 6 లక్షల ప్యాకెట్లే ఇస్తామంటోంది. అక్రమ లాభాలు రుచి మరిగిన మరో నాలుగు కంపెనీలదీ అదే దారి! రాష్ట్రంలో 32 కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సి ఉండగా, మార్కెట్‌లో ఇప్పటికీ ఐదు కంపెనీల విత్తనాలే కనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు బహిరంగ మార్కెట్‌లో దొరకడం లేదు. బ్లాక్ మార్కెట్‌లో మాత్రం పుష్కలంగా లభ్యమవుతున్నాయి. అయినా పాలకులకు అన్నదాత గోడు పట్టడమే లేదు.

విద్యా కుసుమాలు విరిసేదెలా?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన 5.2 కోట్ల పాఠ్య పుస్తకాల ముద్రణే ఇప్పటికీ పూర్తి కాలేదు. 40 శాతం పుస్తకాల ముద్రణ మాత్రమే పూర్తయిందని విద్యా శాఖ అధికారికంగానే చెపుతోంది. కానీ వాటిలోనూ మండల కేంద్రాలకు చేరింది కేవలం 10 శాతమే. మిగతా పుస్తకాలన్నీ హైదరాబాద్‌లోని పాఠ్య పుస్తకాల గోదాం నుంచి జిల్లా కేంద్రాలకు చేరే క్రమంలోనే ఉన్నాయి. ఇక ఇంకా ముద్రణే జరగని 60 శాతం పుస్తకాల సంగతి దేవుడికే ఎరుక! దీంతో జూన్ 12న స్కూళ్లు తెరిచే నాటికే కాదు కదా.. మరో రెండు నెలలకు కూడా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు పుస్తకాలందడం గగనమే. ప్రైవేటు స్కూళ్లలో చదివే 40 లక్షల మంది విద్యార్థుల కోసం మార్కెట్లో అందుబాటులో ఉంచాల్సిన 2.5 కోట్ల పుస్తకాల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వాటిని మే 15 నాటికే అందుబాటులోకి తెస్తామని అధికారుల ప్రకటనలు నీటిమూటలే అయ్యాయి. పాఠ్య పుస్తకాలు నల్ల బజారుకు తరలి వాటి ధరలకు రెక్కలొచ్చేలా కన్పిస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే 56 లక్షల మంది సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అందించాల్సిన ఉచిత యూనిఫారాల విషయంలోనూ అడుగడుగునా నిర్లక్ష్యమే! ఫలితంగా 12 లక్షల మంది హాస్టల్ విద్యార్థులు సొంత దుస్తులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూళ్ల పునఃప్రారంభం రోజునే యూనిఫారాలు ఇస్తామని మంత్రి గొప్పలు చెప్పుకున్నా, ఈ నెలాఖరుకు కూడా అందే పరిస్థితి లేదు. మరోవైపు 8 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన మెస్ చార్జీల పెంపు విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. మంత్రి గారికి తీరిక లేదనే కారణంతో పదోతరగతి ఫలితాల విడుదలను వాయిదా వేయడం ఈ ప్రభుత్వ పాలన తీరుతెన్నులకు మచ్చుతునక. వాటిని మే 23న విడుదల చేయాల్సి ఉండగా, మంత్రి అందుబాటులో లేరంటూ సాయంత్రానికి విద్యా శాఖ వాయిదా వేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో తిరుపతి బిజీగా ఉన్న ఆయన సాయంత్రానికీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో మర్నాటికి వాయిదా వేశారు. అలా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేసిన ఘనత నల్లారి సర్కారుకే దక్కింది.

ఫీజుల కష్టాలు పట్టించుకునేదెవరు?

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రాష్ట్రంలో 26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ట్యూషన్ ఫీజు, స్కాలర్‌షిప్ కింద వారికి చెల్లించాల్సిన నిధులు వారిదాకా వెళ్తున్నాయా లేదా అన్నదానిపై కూడా ప్రభుత్వానికి పట్టింపే లేదు. 2011-12కు మొత్తం రూ.3,600 కోట్లు అవసరం కాగా, గత ఫిబ్రవరి 6న దాదాపు రూ.1,100 కోట్లు విడుదల చేశారు. వాటిలో దాదాపు రూ.200 కోట్లు ఇంకా విద్యార్థుల వరకు చేరనే లేదు. ఇక ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు హడావుడిగా విడుదల చేసిన దాదాపు రూ.500 కోట్లు మురిగిపోయాయి. ఆ తర్వాత రెండు విడతలుగా పేరుకు రూ.1,500 కోట్లు విడుదల చేసినా విద్యార్థుల వరకూ ఏ మేరకు వెళ్లాయన్న దానిపై కనీసం ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించడం లేదంటే పేద విద్యార్థులపై ప్రభుత్వానికి ఏపాటి ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు.

ఎక్కడి గొంగళి అక్కడే

ఇక పేదలకు ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగ తయారైంది. వేసవిలోనే ముమ్మరంగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గత రెండేళ్లలో దాదాపు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసినా అవింకా ప్రారంభం కూడా కాలేదు.

కరెంటు కష్టాలు...

ఎడాపెడా కరెంటు కోతలతో వేసవిలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అక్షరాలా చుక్కలు చూపింది. అడ్డూ అదుపూ లేకుండా పెంచేసిన కరెంటు చార్జీల విషయం సరేసరి! ఇప్పటికీ రాజధానితో సహా నగరాల్లో 3 గంటలు, పట్టణాల్లో 5 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 10 నుంచి 12 గంటలు కరెంటు కోత అమలవుతోంది. ప్రభుత్వానికి ముందుచూపు లోపించడం, కేంద్రం నుంచి గ్యాస్‌ను రాబట్టడంలో విఫలమవడం వల్ల కరెంటు కష్టాలు రెట్టింపయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి 7 గంటలు కాదు కదా, కనీసం మూడు నాలుగు గంటలు కరెంటివ్వడం కూడా గగనమయ్యేలా ఉంది.

పడకేసిన ప్రజారోగ్యం

ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన 108 అంబులెన్స్ సేవలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ దాదాపుగా 900 వాహనాలు తిరగాల్సి ఉండగా ప్రస్తుతం 400కు మించి తిరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం, దాంతో నిర్వహణ సంస్థ జీవీకే మొండికేయడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. మరమ్మతులకు కూడా దిక్కు లేక పలు 108 వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక గ్రామీణ పేదలకు సంజీవనిగాా మారిన 104 సేవలు ఇటు సిబ్బంది సమ్మె, అటు మందుల కొరతతో దాదాపుగా కొండెక్కాయి. ఇక దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన ఆరోగ్య శ్రీని కూడా అటకెక్కించిన ఘనతను కిరణ్ సర్కారు మూటగట్టుకుంది. వర్షాకాలం మొదలైనా కాకముందే డెంగీ వంటి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులకు కూడా దిక్కు లేదు. పేద రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకుంటున్న నాథుడు లేడు!

పేదల దరఖాస్తులు బుట్ట దాఖలు

పేదలు గట్టిగా గొంతెత్తి అడగలేరనే నిర్లక్ష్యం. ప్రధాన ప్రతిపక్షం ఎటూ పట్టించుకోవడం లేదు కదా అనే నిర్లిప్తత. దాంతో 53.25 లక్షల మంది పేదల దరఖాస్తులను ఆరు నెలలుగా కిరణ్ సర్కారు పెండింగ్‌లో మగ్గబెడుతోంది. 2011 నవంబర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రేషన్ కార్డులకు 17.39 లక్షలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల కోసం 18.64 లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం 17.12 లక్షల దరఖాస్తులందాయి. ఈ మేరకు ఏప్రిల్ 18న ప్రణాళికా సంఘం సమావేశంలో స్వయంగా కిరణే తెలిపారు. అవన్నీ ప్రాసెసింగ్‌లో ఉన్నాయని ఘనంగా చెప్పి వచ్చారు. కానీ దరఖాస్తులొచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు, పించన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన పాపాన పోలేదు! కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చాకైనా మంజూరు చేస్తారనుకుంటే ప్రభుత్వం ఇప్పటికీ ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదని అధికారులంటున్నారు. ‘‘ఏప్రిల్ ప్రజాపథంలో మంత్రులతో పాటు మమ్మల్ని కూడా జనం వీటి గురించి నిలదీశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చూస్తుంటే ఉప ఎన్నికలయ్యాక ఆ దరఖాస్తులను పూర్తిగా బుట్టదాఖలు చేసేలా ఉన్నారు’’ అంటూ వారు వాపోతున్నారు!

కీలక శాఖల్లో ఖాళీలు..

‘జగన్ వేట’లో తలమునకలైన కిరణ్ సర్కారు, కీలక శాఖలకు అధికారులను నియమించడం కూడా మరిచిపోయింది. రవాణా శాఖ కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ, పంచాయతీరాజ్ కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, మార్కెటింగ్ కమిషనర్ వంటి దాదాపు పది కీలక పదవులు ఖాళీగా ఉండిపోయాయి. అకామడేషన్, పర్యాటక, సాంసృ ్కతిక, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్‌లు టీఎస్ అప్పారావు, ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఎం సుబ్రహ్మణ్యం పదవీ విరమణతో పరిశ్రమలు, సాంకేతిక విద్య, ఇంటర్ బోర్డు పదవులు ఖాళీ అయ్యాయి. దాంతో కీలక శాఖల్లో పాలన పూర్తిగా కుంటుపడింది. మరోవైపేమో చాలామంది సీనియర్, జూనియర్ ఐఏఎస్ అధికారులు పోస్టింగ్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఇన్నేసి పదవులు ఖాళీగా ఉన్నా, ఎదురు చూస్తున్న వారికి పోస్టింగులివ్వకపోవడం విచిత్రమని సీనియర్ అధికారి ఒకరన్నారు. ఐఏఎస్ పోస్టింగ్‌ల విషయంలోనూ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని, ‘రైట్ మెన్.. రైట్ పోస్టు’ సూత్రానికి తిలోదకాలిస్తోందని అధికార వర్గాలంటున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా సీఎస్‌తో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ఎస్.భలేరావు, జి.సుధీర్, ఎం.పురుషోత్తరెడ్డి పదవీ విరమణ చేయనున్నారని గుర్తు చేస్తున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!