YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

తిరుపతి తీర్పుతో బాబు ఢమాల్

రాజకీయ జన్మస్థానంలో చంద్రబాబుకు ఘోర పరాభవం 
- కులాల వారీగా బలాల సమీకరణకు విశ్వప్రయత్నాలు 
- చదలవాడను పార్టీలోకి పిలిచి మరీ టికెట్ ఇచ్చిన వైనం 
- జగన్‌తో పాటు విజయమ్మపైనా తీవ్రస్థాయి విమర్శలు 
- తానే అభ్యర్థిననుకుని ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి 
- వార్డుల వారీగా ఓట్లు కొనేందుకు నేతలకు బాధ్యతలు 
- మతాన్నీ ఎన్నికల ప్రచారంలోకి లాగి నీచ రాజకీయాలు 
- ఓటర్లకు నోట్లతో ప్రలోభాలు, భారీగా మద్యం ప్రవాహాలు 
- బాబును నమ్మని తిరుపతి జనం.. టీడీపీకి మూడో స్థానం
- వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికే తిరుపతి ప్రజల బ్రహ్మరథం 

తిరుపతి, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తిరుపతి ఉప ఎన్నికల ఫలితం చెమటలు పట్టిస్తోంది. ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో మిగిలినవన్నీ పోయినా తిరుపతిలో మాత్రం గెలిచి తీరాలని ఆయన ఎంతగా ప్రయత్నించినా.. గెలుపు సంగతి అటుంచి కనీసం రెండో స్థానం కూడా సాధించలేకపోయారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లాగే.. తనకూ సొంత జిల్లా అయిన చిత్తూరు పరిధిలో గల తిరుపతిలో తన పార్టీ మూడో స్థానానికి దిగజారటం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన జనం టీడీపీని నిర్మొహమాటంగా తిరస్కరించారు. 

బాబు రాజకీయ జన్మస్థానం... 
చంద్రబాబు తిరుపతి శ్రీవెంకటేశ్వర వర్సిటీ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తిరుపతిలోనే పెరిగి, తిరిగిన ఆయన ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానానికి దారులు వేసుకున్నారు. వర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే 1978లో కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గం టికెట్ దక్కించుకుని గెలుపొందారు. టీడీపీలో చేరినప్పటి నుంచి తిరుపతిని కేంద్రంగా చేసుకునే ఆయన గ్రూపు రాజకీయాలు నడిపారు. 

తిరుపతిలో వీధి, వీధి తనకు తెలుసుననీ, అందరితో పరిచయాలు ఉన్నాయని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణిస్తున్న తాజా ఉప ఎన్నికల్లో తిరుపతి సీటు ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పోరాడారు. నియోజకవర్గ రాజకీయాలను శాసించే స్థాయిలో ఓట్ల బలం ఉన్న బలిజ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుని సీటు గెలవటం కోసం ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పిలిచి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ కంటే ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా చదలవాడ పేరును ప్రకటించారు. నియోజకవర్గంలో రెండో స్థానంలో ఉన్న యాదవ సామాజిక వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి మేయర్ పదవిని ఈ వర్గానికి ఇస్తామని ప్రకటించారు. తానే స్వయంగా ఐదుసార్లు తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. 

మతతత్వాన్నీ ఎన్నికల్లోకి లాగి... 
రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలను తిరుపతిలో మకాం వేయించి వారి ద్వారా ఆయా సామాజిక వర్గ ఓట్లను కొల్లగొట్టే రాజకీయం చేశారు. తిరుపతిని తామే అభివృద్ధి చేస్తామని అనేకానేక హామీలు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి కొట్టటానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విమర్శల ప్రచారం సాగించారు. చివరకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని కూడా ఎన్నికల ప్రచారంలోకి లాగి వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే తిరుమల పవిత్రత దెబ్బతింటుందనే ప్రచారం చేశారు. ఢిల్లీలో ఉండే సోనియాగాంధీ తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నా, పక్క జిల్లాలోనే ఉండే జగన్ ఏనాడూ తిరుమలకు రాలేదని తప్పుడు ఆరోపణలు గుప్పించి మతతత్వాన్ని రెచ్చగొట్టే నీచ రాజకీయానికి దిగారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే తిరుపతిలో కడప గూండాలు విజృంభిస్తారని జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కౌన్సిలర్ స్థాయి నాయకుడు అలిగినా నేరుగా చంద్రబాబే బుజ్జగించి రాజకీయ హామీలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మీద కూడా విమర్శలు చేశారు. ఓటుకు రూ.500 ఇచ్చి జనాన్ని కొనేందుకు ప్రయత్నించారు. మద్యం ఏరులుగా ప్రవహింపచేశారు. అయితే, జనం ఓటు మాత్రం ఫ్యాన్‌కు వేశారు. కృష్ణమూర్తికి బదులు తానే తిరుపతి అభ్యర్థి అనుకుని ఓటేయాలని బాబు చేసిన విన్నపాన్నీ ఏ మాత్రం పట్టించుకోలేదు. 

గెలుస్తామని ధీమాగా చెప్పుకున్నా: 
ఎన్నికల ఫలితాలకు ముందే తిరుపతి సీటు గెలుస్తున్నామని బాబు పార్టీ నేతలతో చెప్పుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మూడో స్థానం వస్తుందని తన సర్వేల్లో తేలినట్లు ప్రచారం చేయించారు. కానీ.. తిరుపతి ఓటరు వైఎస్సార్ కాంగ్రెస్‌కు 18 వేల ఓట్ల భారీ ఆధిక్యతను అందించారు. రెండో స్థానం కాంగ్రెస్‌కు దక్కగా, వైఎస్సార్ కాంగ్రెస్ కంటే 29 వేల ఓట్ల తేడాతో టీడీపీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత జిల్లాలో జరిగిన ఉప ఎన్నిక స్థానం కూడా దక్కించుకోలేని తాను ఇతర జిల్లాల్లోని పార్టీ నేతలను ఎలా అదుపు చేయగలుగుతానని మధనపడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తీర్పు చిత్తూరు జిల్లా టీడీపీని ఆందోళనలో పడేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాబు సొంత జిల్లాలోనూ పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జగన్ మీద చేసిన తప్పుడు ప్రచారం వల్లే ఓటర్లు తమను ఛీ కొట్టారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!