YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

అధిష్టానానికి నెల్లూరు షాక్

- ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ పెద్దలు
- వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కిన భారీ మెజారిటీ చూసి బేజారు
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మేకపాటి విజయం 

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: నేతల ఆధిపత్య పోరు, డబ్బే గెలిపిస్తుందన్న మితిమీరిన ధీమాతో కాంగ్రెస్.. కనీసం పోటీలో ఉన్నామన్న భావన కూడా ఓటర్లలో కల్పించలేక టీడీపీ.. నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార, విపక్షాలు రెండూ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కడప లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 5.45 లక్షల పైచిలుకు మెజారిటీతో రికార్డు స్థాయి విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించడం తెలిసిందే. 

తాజాగా నెల్లూరు లోక్‌సభ స్థానాన్నీ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందిన వైనం జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. తాజా ఉప ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల ఫలితాలెలా ఉన్నా నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గి తీరాలని స్వయానా సోనియాగాంధే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను పలుసార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో వారంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఇంత భారీ తేడాతో మట్టి కరవడాన్ని అధిష్టానమూ జీర్ణించుకోలేకపోతోంది. 

మాట కోసం ఎంపీ పదవిని తృణప్రాయంగా వదులుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పెద్దలు పట్టుదలతో ప్రయత్నించారు. ఆ దిశగా సర్వశక్తులూ ఒడ్డుతారన్న నమ్మకంతో పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డిని బరిలో దించారు. అయినా దారుణ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం వారికి మింగుడు పడటం లేదు. మేకపాటి తొలి నుంచీ ఒకే మాటపై నిలవగా, ఢిల్లీలో ‘ప్యాకేజీ’ మాట్లాడుకుని మరీ బరిలో దిగిన సుబ్బరామిరెడ్డి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కంటే స్థానిక కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరచడానికే ప్రాధాన్యమిచ్చి దెబ్బతిన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అభ్యర్థిత్వం ఖరారవగానే జిల్లా ప్రజలను పరిచయం చేసుకునేందుకంటూ తన కళా పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని ఆయన ఆర్భాటంగా నిర్వహించారు. 

దానికి డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసి, మొదటి నుంచే ఓటర్లలో వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. నేరుగా ఓటర్లను కలవడానికి బదులుగా కుల, మత, చేతి వృత్తులు, ఉద్యోగ, మహిళా సంఘాల ప్రతినిధులకే ప్రాధాన్యమిచ్చిన వైనం ప్రతికూల సంకేతాలు పంపింది. సొంత జిల్లాకు సేవ చేసే భాగ్యం ఇప్పుడే కలిగిందని ఆయన చెప్పుకున్నా ప్రజలు విశ్వసించలేదు. విశాఖ, నెల్లూరు తనకు రెండు కళ్ల వంటివని, రెండు ప్రాంతాల అభివృద్ధికీ పాటుపడతానని చెప్పి మరింత వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు: జగన్ సునామీకి తోడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు కూడా సుబ్బరామిరెడ్డి కొంప ముంచాయి. కావలి ఎన్నికల ఇన్‌చార్జి విషయంలో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య విభేదాలు తారస్థాయికి చేరి, చివరికి ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆదాల తప్పుకునే దాకా వెళ్లింది. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్యా విభేదాలు తలెత్తాయి. పీఆర్పీ తరపున ఎన్నికైన శ్రీధర కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో విలీనం తర్వాత పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.

2009 ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన పీఆర్పీ కార్యకర్తలకే ప్రాధాన్యమివ్వడం, ఎప్పట్నుంచో పని చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా పట్టించుకోకపోవడంతో సిటీ నియోజకవర్గంలో పార్టీ మునుపెన్నడూ లేనంత నష్టాన్ని చవిచూసింది. ఇక రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఒంటెత్తు పోకడలు, మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి తదితరాలు ఆ నియోజకవర్గంలోనూ చేటు చేశాయి. ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ప్రజాగ్రహం లోక్‌సభ ఉప ఎన్నికల్లో దావానలంలా పెల్లుబికింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పెత్తనాన్ని ప్రశ్నిస్తున్న పార్టీలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆత్మకూరులో చాపకింద నీరులా పని చేశారు.

2009 ఎన్నికల్లో నెల్లూరులో కాంగ్రెస్‌కు 4,30,235, పీఆర్పీకి 1,38,111 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ విలీనం నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్‌కు కనీసం 5 లక్షలైనా దాటాల్సి ఉంది. కానీ కేవలం 2,43,691 ఓట్లతో కుదేలైంది. ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతల నుంచి సీఎం, పీసీసీ చీఫ్, కేంద్ర మంత్రుల దాకా పాల్గొన్నా.. జగన్ జపానికే పరిమితమయ్యారు తప్ప స్థానికాభివృద్ధి గురించి ప్రస్తావించలేదు!

సోదిలో లేని టీడీపీ: టీడీపీ అయితే సోదిలో కూడా లేకుండా పోయింది. అసలు ఆ పార్టీ ఒకటి పోటీ చేస్తోందని ఓటర్లు గుర్తించని పరిస్థితికి దిగజారింది. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్ పోగొట్టుకుంది. పైగా సుబ్బరామిరెడ్డిని గెలిపించేందుకు టీడీపీ నేతలు తెర వెనక తమ వంతు ప్రయత్నాలు చేశారు. 

టీడీపీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అసలు పోటీకి ఆసక్తే చూపలేదు. నామినేషన్ తర్వాత ప్రచారం మానేసి పత్తా లేకుండా వెళ్లిపోయారు. వంటేరుపై అపనమ్మకంతో బీదా రవిచంద్రతో కూడా చంద్రబాబు నామినేషన్ వేయించడం టీడీపీ దుస్థితికి అద్దంపట్టింది. ఇక మూడు విడతలుగా బాబు చేసిన పర్యటనల్లో తప్ప వంటేరు, ఇతర పార్టీ ముఖ్య నేతలు కలసి ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగే ఇందుకు కారణమని టీడీపీ నేతలే చెబుతున్నారు. 

ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే వంటేరు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒకరిపై ఒకరు బాబు వద్ద ‘కాంగ్రెస్‌తో కుమ్మక్కు’ ఫిర్యాదులు చేసుకుంటూ కాలం గడిపారు. నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరుల్లో ఇన్‌చార్జ్‌లను అప్పటికప్పుడు నియమించడం, పైగా వారిపై పర్యవేక్షణకు సమన్వయకర్తలను నియమించడం పూర్తిగా బెడిసికొట్టింది. దాంతో 2009లో 3,75,242 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ కాస్తా ఈసారి 1,54,103 ఓట్లతో మూడోస్థానానికి దిగజారింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!