YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

ప్రచారంలో విజయమ్మ ఎక్కడ కన్నీరు పెట్టారో చూపించు

- లగడపాటిని నిలదీసిన గోనె
- లగడపాటి చరిత్రేమిటో, ఆయన చంద్రబాబుకు ఎంత డబ్బిచ్చారో త్వరలో బయటపెడతాం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: సానుభూతి కారణంగానే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనడం సరికాదని, పది రోజుల ఎన్నికల ప్రచారంలో విజయమ్మ, షర్మిలలు ఎక్కడ కన్నీరు పెట్టారో ఆయన చూపించగలరా అని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు నిలదీశారు. 

ఈ విజయం కేవలం సానుభూతితో మాత్రమే వచ్చింది కాదని, మీలాంటి వారు చేస్తోన్న అసత్య ప్రచారంపై ప్రజలు కసిగా ఓట్లేశారని అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘గతంలో మన రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ సానుభూతి పనిచేసిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ జైలులో పెట్టించిందన్న కారణంగా 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో దేశమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండే పార్టీలు గెలుపొందాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జనతా పార్టీ తరఫున నీలం సంజీవరెడ్డి మాత్రమే గెలిచారు. ఇందిరాగాంధీ మరణం తరువాత జరిగిన 1984 పార్లమెంట్ ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలుచుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది. చంద్రబాబు విషయంలోనూ సానుభూతి పనిచేయదని తేలిపోయింది’’ అని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పాలపొంగువంటివే అంటున్న లగడపాటికి దమ్ముంటే విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, లేదంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా లగడపాటి మాజీ ఎంపీ అవ్వక తప్పదని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసినప్పటికీ జగన్ స్వయంగా చూపించిన ఆస్తులకు మించి ఒక్క రూపాయిని కూడా అదనంగా చూపించలేకపోయిందన్నారు.

జగన్‌కు లక్ష కోట్లు ఆస్తులు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆ వివరాలను ఐటీ శాఖకు అందజేస్తే వారికే ప్రతిఫలం వస్తుందిగా అని సలహా ఇచ్చారు. లగడపాటి చరిత్ర ఏమిటో? ఆయన చంద్రబాబుకు ఎంత డబ్బిచ్చారో? ఇలాంటి వివరాలన్నింటినీ త్వరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నట్టు చెప్పారు. లగడపాటి తండ్రి గుంటూరులో చేస్తున్న రాసలీలలు ఏమిటో కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. ‘‘ఆయన వయస్సు ఎంత? వాళ్లింటి రోడ్డులో వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారు’’ అని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!