సీఎం దీనిపై సమాధానం చెప్పాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్ :

కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చట్టం వర్తించదని చెప్పినందుకు కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ను అరెస్టు చేయొచ్చునేమో సీబీఐ, న్యాయస్థానాలు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రి, ఆ తర్వాత సీఎం అయ్యేవారని అనడమంటే కాంగ్రెస్‌లో ఉంటే చట్టం వర్తించదని చెప్పడమేనన్నారు. ఆజాద్ మాట్లాడుతున్నపుడు అక్కడే ఉన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపరుడని అంటున్న ఆజాద్, కిరణ్‌లకు వైఎస్ ఉన్నపుడు కనిపించని అవినీతి ఈరోజే కనిపించినట్లుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం తలసాని విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఉప ఎన్నికలు తమకు ఓ లెక్కకాద ని, గతంలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కొంపలు మునిగిపోయినట్లు కేంద్ర మంత్రులు, సీఎం, రాష్ట్ర మంత్రులతో ప్రచారం ఎందుకు చే యిస్తోందని ప్రశ్నించారు.
రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్న ఆజాద్‌కు.. ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే స్వచ్ఛందంగా తమ ప్రభుత్వాన్ని తప్పించే దమ్ముందా అని సవాల్ విసిరారు. రైతులకు విత్తనాలు దొరక ్కపోవడం, నిత్యావసర ధరలు ఆకాశాన్ని చేరుకోవడం, పెట్రో ధరలు విపరీతంగా పెంచడమే కాంగ్రెస్ సాధించిన ప్రగతిలాగా ఉందని ఎద్దేవా చేశారు. కేబినెట్ పంపించిన ఫైల్‌పైనే తాను సంతకం చేశానని బెయిల్ పిటిషన్‌లో మంత్రి మోపిదేవి పేర్కొనడాన్ని ఆధారం చేసుకొని ఆనాటి సర్కారులోని రెవెన్యూ, పరిశ్రమల మంత్రులతో పాటు కేబినెట్ మొత్తాన్నీ అరెస్టు చేయాలని కోరారు. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ అందులో భాగంగా బలహీనవర్గాలకు చెందిన మంత్రిని బలి తీసుకుందని ఆక్షేపించారు. ఆనాటి సీఎంకు ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావే అవినీతికి మూలమని పేర్కొంటూ ఆయనపై పోరాటం ఆపబోనని పునరుద్ఘాటించారు. టీడీపీ వైఖరితోనే తన కు ఆవేదన, బాధ ఉందని పేర్కొంటూ సరైన సమయంలో రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తానని తెలిపారు.
No comments:
Post a Comment