YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

రైతులకు భరోసా ఏదీ?

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా చర్యలేవి?
మే నెలలో విడుదల చేయాల్సిన రుణ ప్రణాళికకు ఇప్పటికీ దిక్కులేదు
ఎరువులు, విత్తనాలు లేక అల్లాడుతున్న రైతన్నలు
రెండేళ్లలో 12 సార్లు పెరిగిన ఎరువుల ధరలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా రైతుల కోసం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల్లో ఏ ఒక్కటీ ఈ సర్కారు చేపట్టలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులకు పంట రుణాలు ఇప్పిస్తామన్న ప్రభుత్వం తొలకరి జల్లులు కురుస్తున్నా ఇప్పటిదాకా ఒక్కరికీ ఇప్పించలేక చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దగా రైతులకు నేనున్నాననే భరోసా ఇచ్చే నాయకుడు కనుచూపు మేరలో కనిపించడంలేదన్నారు. దీంతో ఈ ఏడాది కూడా రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని గట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే నెలలో విడుదల చేయాల్సిన ఖరీఫ్ రుణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ వారి నుంచి రూ.5 నుంచి రూ.10 వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి నెలకొందని వివరించారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున క్యూలో నిలబడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో తొక్కిసలాట జరుగుతోందన్నారు. రైతుల పట్ల కనీస అవగాహన, చిత్తశుద్ధిలేని ప్రభుత్వ పెద్దల కారణంగానే ఈ దుస్థితి నెలకొందన్నారు.

రైతులంటే ఇంత చిన్నచూపా?

‘గత ఏడాది రాష్ట్రంలో రైతన్నను కరువు కాటేసింది. 876 మండలాలను ప్రభుత్వమే కరువు మండలాలుగా ప్రకటిం చింది. 83,55,267 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 52,56,730 మంది రైతులకు రూ.1,816 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్ నెలలో లెక్కలు కూడా వేసిం ది. అయితే ప్రభుత్వ నిర్ణయం తర్వాత రబీ పోయి మళ్లీ ఖరీఫ్ ప్రారంభమైనా సగం మందికి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. కేవలం 21,88,497 మందికి రూ.837 కోట్ల రూపాయలను విదిల్చి చేతులు దులుపుకుంది. 

మిగతా వారి పరిస్థితి ఏం కావాలి?’ అని గట్టు నిలదీశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులపై కాంగ్రెస్ నేతృత్వం లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల వారు మరింత బెంబేలెత్తిపోతున్నారని వివరిం చారు. ‘ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీపైనా కోత విధించి న ఈ ప్రభుత్వాలు అన్ని రకాల ఎరువుల ధరలను రెండేళ్లలోనే 12 సార్లు పెంచారు. గత ఖరీఫ్, రబీ సీజన్ అయితే ఏకంగా 8 సార్లు పెంచారు. అన్ని రకాల విత్తనాల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్నిచోట్ల దళారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది’ అని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ నాటి భరోసా ఏది?

రైతులకు దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన భరోసా నేడేదని గట్టు నిలదీశారు. ‘మహానేత అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై చేశారు. అంతేకాదు రూ.1,250 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. దేశ చరిత్రలో దాదాపు 1,300 కోట్ల యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేసిన ఘనత వైఎస్‌దే. బీటీ పత్తి విత్తనాలు రూ.1,800గా ఉంటే రైతుల పక్షాన పోరాడిన వైఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాటిని రూ.700కు తగ్గించారు. ఎరువులు, విత్తనాలు ధరలు కూడా ఏనాడూ పెంచలేదు. పైగా రైతు పండించిన ధాన్యానికి మరింత మద్దతు ధర పెంచారు. ఇన్‌పుట్ సబ్సిడీని ఎకరానికి రూ.4,500కు పెంచారు’ అని అన్నారు. వైఎస్ మరణం తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్నపూర్ణగా పేరొందిన చోట రైతులు ‘సాగు సమ్మె’ చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

చంద్రబాబు ఆదర్శంగా కిరణ్ పాలన!

రైతుల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటి పాలనను ఆద ర్శంగా చేసుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముం దుకెళ్తున్నారని గట్టు దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో రెండేళ్లలోనే 3,500 మంది చనిపోయారని, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. ‘భూములు పంచితే పేదరికం పోతుందా? నిన్నెవరు మళ్లీ పంట వేయమన్నారు? పంటలెండిపోతే ఇక కరెంటు ఎందుకు? తుపాన్ వస్తేనే కరువు తీరుతుంది. విద్యుత్ చౌర్యం చేస్తే ఇతర దేశాల్లోనైతే ఉరి తీసేవారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘనత ఆయనదేనని ధ్వజమెత్తారు. అంతేకాదు విద్యుత్ బకాయిలు చెల్లించని రైతులను జైల్లో పెట్టించేందుకు ప్రత్యేక జీవోలు జారీ చేసిన మహానుభావుడు చంద్రబాబేనని మండిపడ్డారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!