YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

అమీర్‌పేట భూకుంభకోణం కేసులో చుక్కెదురు.రోశయ్యకు సమన్లు

ఆగస్టు 2న హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశం
అమీర్‌పేట భూకుంభకోణం కేసులో చుక్కెదురు
గతంలో క్లీన్‌చిట్ ఇస్తూ ఏసీబీ ఇచ్చిన నివేదికను తోసిపుచ్చిన కోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అమీర్‌పేట భూకుంభకోణం వ్యవహారంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 2న రోశయ్య స్వయంగా తమముందు హాజరుకావాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి జగన్నాథం సోమవారం ఆదేశించారు. ఐపీసీ 409, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన అభియోగాలకు ఆయన వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమీర్‌పేట భూకుంభకోణం వ్యవహారంలో రోశయ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, సన్యాసిరావులు ఏసీబీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీవీఎస్‌కే శర్మ కూడా.. భూముల డీనోటిఫై నిర్ణయాన్ని రోశయ్యే తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు రోశయ్యకు సమన్లు జారీ చేసింది. ఆయనకు క్లీన్‌చిట్ ఇస్తూ గతంలో ఏసీబీ సమర్పించిన నివేదికను తోసిపుచ్చింది.

అసలేం జరిగింది..: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య.. హైదరాబాద్ అమీర్‌పేటలోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది కె.మోహన్‌లాల్ 2010 ఆగస్టులో ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. సీఆర్‌పీసీలోని 156(3) సెక్షన్ కింద రోశయ్యతోపాటు మరో 14 మందిపై వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. అమీర్‌పేటలో హుడా (ప్రస్తుతం హమ్డా) అధీనంలో ఉన్న 9 ఎకరాల 14 గుంటల భూమిని ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య అక్రమంగా 14 మందికి కట్టబెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరంగారావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం స్వాధీన నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత భూములు కొనుగోలు చేసినా చెల్లదని తెలిిసీ.. కొందరు వ్యక్తులు ఆ భూములు కొనుగోలు చేశారని వివరించారు. వాస్తవానికి స్వాధీన నోటిఫికేషన్ రద్దు చేసి ఆ భూములను తమకు అప్పగించాలంటూ వారు చేసుకున్న దరఖాస్తును 2004, 2005, 2006లో ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. అయితే రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు తిరిగి భూములు అప్పగించాలంటూ దరఖాస్తు చేసుకున్నారని, భూ స్వాధీన నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా...రోశయ్య చట్టాన్ని ఉల్లంఘించి ఆ భూమిని 14 మందికి కేటాయిస్తూ 2010 జూలై 15న ప్రత్యేకంగా జీవో 288 జారీచేశారని నివేదించారు. 

భూమి పొందిన కె.విజయకుమారి, డి.సాయిరెడ్డి, డాక్టర్ జి.ఎన్.నాయుడు, ఎన్.సత్యేంద్రప్రసాద్, రాబియాఖటూన్, జి.శ్రీనివాసులునాయుడు, జి.సుహాని, డి.మాధురి, డి.బుచ్చిరెడ్డి, డి.జగన్‌రెడ్డి, పి.దాసయ్యనాయుడు, జి.కృష్ణమూర్తి నాయుడు, ఎన్‌ఎస్.గీత, సయ్యద్ అఫ్జల్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 2011 జనవరిలో దర్యాప్తునకు ఆదేశించింది. రోశయ్య, భూములు పొందిన 14 మందిపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు అప్పటి న్యాయమూర్తి రాధారాణి ఏసీబీ డీజీని ఆదేశించారు. అయితే ఏసీబీ రోశయ్యకు క్లీన్‌చిట్ ఇస్తూ నివేదిక సమర్పించింది. దీన్ని సవాల్ చేస్తూ మోహన్‌లాల్ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణపై తమకు నమ్మకం లేదని, కోర్టే నేరుగా విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. సీనియర్ ఐఏఎస్‌లు ఆచార్య, అప్పారావు, శర్మలతో పాటు మరో ముగ్గురు అధికారులకు సమన్లు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. రోశయ్యపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని భావించిన కోర్టు తాజాగా సోమవారం ఆయనకు సమన్లు జారీ చేసింది.

రోశయ్యే నోట్‌ఫైల్ రాశారు: సీవీఎస్‌కే శర్మ

అమీర్‌పేట్ భూములను డీ నోటిఫై చేయాలంటూ ముఖ్యమంత్రి హోదాలో రోశయ్యే నోట్‌ఫైల్ రాశారని, ఆయన ఆదేశాల మేరకే ప్రైవేటు వ్యక్తులకు ఆ భూములు కట్టబెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. రోశయ్య హయాంలో ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సీవీఎస్‌కే శర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలతో శర్మ గత జనవరిలో సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. ‘‘అమీర్‌పేట భూములను డీనోటిఫై చేయాలని భూ యజమానులుగా చెప్పుకుంటున్న వారు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన రోశయ్య...వీరి అభ్యర్థన న్యాయబద్ధంగానే ఉంది. గతంలో కొందరి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత డీనోటిఫై చేశారు. వీరి దరఖాస్తును సంబంధిత విభాగానికి పంపి ఫైల్ తయారు చేసి తన ముందుంచాలంటూ సూచించారు. ఆ మేరకు మున్సిపల్ విభాగం నుంచి వచ్చిన ఫైల్‌ను రోశయ్య ముందుంచాం. ఫైల్‌పై ఆయనే నోట్‌ఫైల్ రాశారు. గతంలో కొందరి భూములు డీనోటిఫై చేసినప్పుడు వీరికి ఇవ్వడానికి అభ్యంతరమేంటి ? దరఖాస్తుదారుల పట్ల వివక్ష చూపినట్లుగా కనిపిస్తోంది. కొందరికి ఇదే తరహాలో డీనోటిఫై చేసి భూములు ఇచ్చినప్పుడు వీరికి కూడా ఇవ్వొచ్చు అని స్పష్టం చేస్తూ నోట్‌ఫైల్ రాశారు. రోశయ్య ఇచ్చిన ఆదేశాల మేరకే డీనోటిఫై చేస్తూ జీవో జారీ అయ్యింది’’ అని చెప్పినట్లు సమాచారం. కాగా ‘‘డీనోటిఫై చేసేనాటికి ఆ భూమి హెచ్‌ఎండీఏ ఆధీనంలోనే ఉంది. డీనోటిఫై చేయాలని జీఎన్ నాయుడు తదితరులు దరఖాస్తు చేసుకున్నా నిబంధనలు అందుకు అంగీకరించవని స్పష్టం చేస్తూ వారి దరఖాస్తును తిరస్కరించాం’’ అని హెచ్‌ఎండీఏ భూసేకరణ అధికారి నారాయణరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇదిలావుండగా ‘‘హెచ్‌ఎండీఏ అధీనంలో ఉన్న ఈ భూమిలో అటవీశాఖ నర్సరీ నిర్వహిస్తోంది. డీనోటిఫై చేసే వరకూ అక్కడ నర్సరీని నిర్వహించాం’’ అని అటవీశాఖ అధికారి ముత్యంరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. 

చట్టవిరుద్ధమని చెప్పినా పట్టించుకోలేదు: బీపీ.ఆచార్య, అప్పారావు

ప్రభుత్వ భూమిని డీ నోటిఫై చేసేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టంగా పేర్కొన్నా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, టీఎస్ అప్పారావులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించారు. అప్పట్లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేసిన బీపీ.ఆచార్య, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అప్పారావులు కోర్టు ఆదేశం మేరకు జనవరి నెలాఖరులో ఏసీబీ కోర్టు ముందు సాక్షులుగా హాజరయ్యారు. అప్పట్లో వీరి వాంగ్మూలాన్ని జడ్జి జయసూర్య నమోదు చేశారు. ‘‘మైత్రీవనం, మైత్రీవిహార్ ప్రాజెక్టుల కోసమే ఈ భూమిని హెచ్‌ఎండీఏ స్వాధీనం చేసుకుంది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 48 కింద ప్రభుత్వం భూమి స్వాధీనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రద్దు చేయడం కుదరని స్పష్టం చేశాం. ఔటర్‌రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. అమీర్‌పేటలో ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేస్తే ఔటర్‌రింగ్ రోడ్డులో తమ భూములు కోల్పోయిన వారు డీనోటిఫై చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. డీనోటిఫై చేయడం మంచి పరిణామం కాదు. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రూ.200 కోట్ల విలువైన భూమిని డీనోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పాం. అప్పటి మున్సిపల్ మంత్రి కూడా భూమిని డీనోటిఫై చేయడం కుదరని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ భూమిని పొందిన వారు నిజమైన యజమానులు కారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీరు తెర మీదకు వచ్చారు. మా నిర్ణయాన్ని కాదని అప్పటి సీఎం రోశయ్య విచక్షణాధికారం మేరకు భూమిని నోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. ఈ భూమి ప్రభుత్వ అధీనంలో లేదని, నామమాత్రపు అధీనంలో మాత్రమే ఉందని రోశయ్య నోట్ ఫైల్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో లేని భూమిని డీనోటిఫై చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు’’ అని తెలిపారు. 

రోశయ్య రాజీనామా చేయాలి: శ్రీరంగారావు

‘క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండగా రాజ్యాంగబద్ధమైన పదవిని ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గతంలో స్పష్టమైన తీర్పునిచ్చింది. అమీర్‌పేట భూములకు సంబంధించి రోశయ్యపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆయన్ను గవర్నర్‌గా ఎంపిక చేయడం సుప్రీం తీర్పుకు విరుద్ధం. రోశయ్య తన పదవికి తక్షణమే రాజీనామా చేసి కోర్టులో వివరణ ఇవ్వాలి. రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చిన అప్పటి ఏసీబీ డీజీ ఉమేష్‌కుమార్, మరో అధికారి శ్రీనివాస్‌లను కూడా విచారించాలి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరంగారావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!