YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

మ్యాచ్ ఫిక్సింగ్‌కు కాంగ్రెస్, టీడీపీ మధ్య ముందునుంచే ప్రణాళిక చంద్రబాబు సన్నిహితుడు, కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వం

ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు కాంగ్రెస్, టీడీపీ మధ్య ముందునుంచే ప్రణాళిక
చంద్రబాబు సన్నిహితుడు, కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వం
పీసీసీ, ప్రభుత్వ ముఖ్యనేతలతో సంప్రదింపులు
ఎక్కడెక్కడ ఎలా ముందుకు వెళ్లాలో ముందుగానే కసరత్తు
అవగాహన మేరకే ఇరు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక
రామచంద్రపురం, నరసాపురం, రైల్వేకోడూరులో కాంగ్రెస్‌కు సహకరించిన టీడీపీ.. 
పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడులో టీడీపీ జెండా మోసిన కాంగ్రెస్
అభ్యర్థుల ఎంపిక నుంచే రెండు పార్టీల ‘జాగ్రత్తలు’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ముందస్తు ప్రణాళిక మేరకే మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోటరీలో కీలకపాత్ర పోషించే ఓ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య పరస్పర క్రాస్ ఓటింగ్ వ్యవహారాన్ని నడిపించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన మొదట్లో జరిపిన అంతర్గత సర్వే ఫలితాల ఆధారంగా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి ప్రణాళిక రచించారు. చంద్రబాబు సలహా, సూచనల మేరకే సదరు కాంట్రాక్టర్, పార్టీ నాయకుడు మధ్యవర్తిత్వం జరిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నేతలకంటే ఎక్కువగా ఆయన నివాసానికి వెళ్లి.. సొంత పనులు చక్కబెట్టుకున్న పీసీసీ ముఖ్య నేత తో తొలిదశ చర్చలు జరిగాయి. మరోవైపు ప్రభుత్వ ముఖ్యనేతతో కూడా ఈ పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని తేలిపోవడంతో ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో అవగాహన కుదిరింది. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా అందుకు అనుగుణంగానే సాగినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలు చేయించుకున్న సర్వేల ప్రకారం పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి ఎక్కువ బలం ఉండటం... అలాగే రామచంద్రపురం, నరసాపురం, రైల్వేకోడూరు తదితర స్థానాల్లో టీడీపీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తేలడంతో ముందుగా ఈ ఆరు చోట్ల ‘సహకారం’ కోసం పక డ్బందీ ప్రణాళికను అమలు చేశారని తెలుస్తోంది.

అభ్యర్థుల వెనుక అసలు మర్మాలు: ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించేందుకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో స్థానికేతరుడైన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు చివరి నిమిషంలో టీడీపీ సీటు కేటాయించింది. అందులో భాగంగానే స్థానికుడు, నియోజకవర్గంలో పట్టున్న గుత్తుల సూర్యనారాయణ బాబును ఒక పథకం ప్రకారం ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీ నుంచి బయటకు పంపించారు. ఇక నరసాపురం నియోజకవర్గంలో పార్టీకి ఎంతో కాలం నుంచి దూరంగా ఉంటున్న డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణకు మంచి పేరుందంటూ టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది. గతంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం నుంచి పోటీచేసి ఓడిపోయి, స్థానికంగా పట్టున్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మిని పక్కన పెట్టారు. పైగా ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన అభ్యర్థులు తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడులు టీడీపీ నుంచి వచ్చిన వారే. వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది టీడీపీలోనే. దాంతో వారి ప్రచారం కూడా అదే ధోరణితో కొనసాగింది. టీడీపీ నుంచి మధ్యలో పీఆర్పీకి వెళ్లామని, ఇపుడు కాంగ్రెస్‌లో ఉన్నా, మళ్లీ 2014కు మీ వద్దకే వచ్చేవాళ్లమంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. 

ఇలా ప్రచారం చేయడం కూడా ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లోని కీలక నాయకుడొకరు చెప్పారు. మరోవైపు కడప జిల్లా రైల్వే కోడూరులో గత సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గ పరిసరాల్లోకి కూడా రాని అజయ్‌బాబును కాంగ్రెస్ సలహా మేరకు టీడీపీ తన అభ్యర్థిగా నిలిపిందని చెబుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పోలింగ్‌కు ముందురోజు రంగంలోకి దిగిన చంద్రబాబు సన్నిహితుడైన కాంట్రాక్టర్ నేరుగా సొంత పార్టీ స్థానిక నేతలకు ఫోన్ చేశారు. మన అధ్యక్షుడు మన ఓట్లన్నీ కాంగ్రెస్‌కు వేయమన్నారు.. జగన్‌ను ఓడించటమే మన లక్ష్యం కాబట్టి అధ్యక్షుడి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో తమ్ముళ్లు అదే దారిలో నడిచారు. ఫలితాల అనంతరం కూడా పరస్పర క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు బేరీజు వేసుకున్నట్టు తెలిసింది. ఆయా పార్టీలకు పోలైన ఓట్ల సరళిని బట్టి అనుకున్న స్థాయిలోనే క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తేల్చారు. 

సైకిల్‌కు అభయ‘హస్తం’ ఇలా: ఎంతోకాలం నుంచి తమకు సహకరిస్తున్న టీడీపీ కోసం కాంగ్రెస్ సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంతో ‘జాగ్రత్త’ తీసుకుంది. పాయకరావుపేటలో ముందు నుంచి టికెట్ ఆశిస్తున్న వారిని కాదని గతంలో పలుమార్లు పోటీచేసి ఓడిపోయిన గంటెల సుమనకు కాంగ్రెస్ టికెట్టు కేటాయించింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా బలహీనమైన అభ్యర్థిని ఇక్కడ కాంగ్రెస్ బరిలోకి దింపిందన్న వాదన ఆ పార్టీలో బలంగా వినిపించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కూడా ఇదే పరిస్థితి. స్థానికంగా బలం కలిగిన డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు సూచించిన వ్యక్తికి కాకుండా ముందుగా టీడీపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా నూపా పార్వతిని కాంగ్రెస్ బరిలో దించింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఎంపీ జేడీ శీలం తమ్ముడు రవి టికెట్టును ఆశించినా... టీడీపీకి లాభం కలిగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని పోటీకి పెట్టింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి అసెంబ్లీ సీటు విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఆ మేరకే టీడీపీ అభ్యర్థి ఎంపిక జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పరకాల విషయంలోనూ క్రాస్ ఓటింగ్‌పై ఇరు పార్టీల మధ్య చర్చ సాగింది. పరకాలలో డీసీసీ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి భార్య జ్యోతికి టికెట్ ఇస్తున్నట్టు మొదట ప్రకటన చేసినప్పటికీ.. చివరలో ఆమెను తప్పించి టీడీపీకి చెందిన సమ్మారావు పేరును ప్రకటించారు. టికెట్ ఖరారైన తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇలా చేయడం వల్ల ఆగ్రహంతో గండ్ర వర్గీయులు సహజంగానే టీఆర్‌ఎస్ అభ్యర్థికి సహకరిస్తారన్న కాంగ్రెస్ నేతల అంచనా ఫలించిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

ఈ నియోజకవర్గంలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఆ స్థాయి లో ఓట్లు రాకపోవడానికి పరకాలలోని కొన్ని మండలాల్లో క్రాస్ ఓటింగ్ చేసి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓట్లు వేయించే పనిని తెలంగాణకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడొకరు తలకెత్తుకున్నారు. ఈ ఉపఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య కుమ్మక్కు వ్యవహారం తెలియని ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక టీడీపీ నేతలు కొందరు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న కమిటీకి నేరుగా ఫిర్యాదు చేశారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై కొందరు నేరుగా బాబుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్థానికంగా అలాంటివి జరుగుతుంటాయి... చూసీ చూడనట్టు వెళ్లాలని స్వయంగా అధినేతే చెప్పడంతో ఫోన్ చేసిన నాయకుడు విస్మయం చెందారు.

ఓట్ల సరళిపై ఇరు పార్టీల విశ్లేషణ: ముందస్తు అవగాహన మేరకు ఓట్ల మార్పిడి జరిగిందా లేదా అన్న అంశంపై ఇరు పార్టీల నేతలు విశ్లేషించుకున్నట్టు తెలిసింది. పాయకరావుపేటలో (కాంగ్రెస్‌కు 33,867 ఓట్లు, టీడీపీకి 57,601 ఓట్లు), పోలవరంలో (కాంగ్రెస్‌కు 16,081, టీడీపీకి 45,023), రైల్వేకోడూరులో (కాంగ్రెస్‌కు 34,465, టీడీపీకి 17,594) క్రాస్ ఓటింగ్ బాగానే జరిగినట్టు తేల్చారు. అలాగే ప్రత్తిపాడు (కాంగ్రెస్‌కు 15,949, టీడీపీ 70,961), నరసాపురం (కాంగ్రెస్ 58,356, టీడీపీకి 8,813), రామచంద్రపురం (కాంగ్రెస్‌కు 77,292, టీడీపీకి 6,246)లో కూడా తాను కుదిర్చిన ఒప్పందం సఫలీకృతమైందని సదరు కాంట్రాక్టర్ అధినేత వద్ద చెప్పుకున్నట్టు సమాచారం. తిరుపతి, పరకాల ఓట్ల సరళిని కాంగ్రెస్ ముఖ్య నేత లోతుగా సమీక్షించినట్టు తెలిసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!