YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

'బెదిరిస్తే కాళ్లబేరానికి వస్తారనుకోవడం భ్రమ'


కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన అంబటి రాంబాబు
జగన్ అరెస్టు కుట్రేనని అంగీకరించిన కాంగ్రెస్
చెప్పకనే వాస్తవాలను చెప్పిన ఆజాద్ 
కాంగ్రెస్‌ను వదిలినందుకే కక్ష కట్టారని తేటతెల్లమైంది
జగన్ జనం మధ్య ఎదుగుతున్న నాయకుడు
ఇటలీ, కాశ్మీర్‌నుంచి ఊడిపడి తెలుగు ప్రజలతో ఆడుకోవడంలేదు

తిరుపతి, న్యూస్‌లైన్: బెదిరిస్తే జగన్‌మోహన్‌రెడ్డి కాళ్లబేరానికి వస్తారనుకోవడం భ్రమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. ఎంత భయపెట్టినా జగన్ త మ దారికి రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని కాంగ్రెస్ అధిష్టానం కక్షసాధింపు చర్యలకు పూనుకుందని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తిరుపతిలో పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ అరెస్టు వెనుక కాంగ్రెస్ కుట్రవుందన్న వాస్తవాన్ని గులాం నబీ ఆజాద్ చెప్పకనే చెప్పారని విమర్శించారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే ఏడాది పాటు కేంద్ర మంత్రిగా నియమించి ఆపై ముఖ్యమంత్రిని చేసి ఉండే వాళ్లమని ఆజాద్ ఆదివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో చెప్పడమే అందుకు నిదర్శనమని చెప్పారు. వారు ఇస్తామన్న పదవులను కాదని, సోనియాను ధిక్కరించడమేగాక, కాంగ్రెస్‌ను వదిలి వేరే పార్టీ పెట్టినందుకే ఆయనపై కక్ష గట్టినట్టు ఆజాద్ మాటల ద్వారా తేటతెల్లమైందని విమర్శించారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఆజాదే ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్‌పై అవినీతి ఆరోపణలు చేసి ఏడాది కాలం ఆయనకు గడువు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు ఏ ఉద్దేశంతో గడువు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి ఆయనేమైనా ప్రజాప్రతినిధా, ఆయన ఏ ఫైల్‌పై అయినా సంతకం చేశారా? అని అంబటి ప్రశ్నించారు. 

రాచరిక వ్యవస్థను నడుపుతున్నది కాంగ్రెస్సే!

జగన్‌ను అరెస్టు చేస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని, ఆయన ఏమైనా పై నుంచి దిగివచ్చారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడాన్ని అంబటి తప్పుపట్టారు. జగన్ స్వాతంత్య్ర సమరయోధుడు కాకపోయినా కాంగ్రెస్ దుష్ట చర్యలను ఎదుర్కొని జైలుకెళ్లిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించబోతున్నారని చెప్పారు. జగన్ జనం మధ్య ఎదుగుతున్న నాయకుడని, సోనియాలా ఇటలీనుంచి, ఆజాద్‌లా కాశ్మీర్‌నుంచి ఊడిపడి తెలుగు ప్రజలతో ఆడుకోవడంలేదని ఎద్దేవా చేశారు. రాచరిక వ్యవస్థ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత పైలట్‌గా వున్న రాజీవ్‌ను, రాజీవ్ మరణం తర్వాత సోనియాను ఏఐసీసీ అధినేత్రిగా చేసి రాజరిక వ్యవస్థను నడుపుతున్నది సోనియా కుటుంబం కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ముసుగులో కాంగ్రెస్ సోనియా నాయకత్వంలో రాజరిక వ్యవస్థను నడుపుతోందని దుయ్యబట్టారు. సోనియా ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కుటిల రాజకీయాలను కాంగ్రెస్ వీడకుంటే ఆంధ్రరాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!