జగన్ కేసు దర్యాప్తు అంశాలను ఎల్లో మీడియాకు లీక్ చేయాలంటూ సీబీఐకి ‘హైకమాండ్’ నిర్దేశం సీబీఐ లీకుల ఆధారంగానే ఎల్లో మీడియాలో నిరంతరం కథనాలు కోర్టుకన్నా ముందే ఆ పత్రికలకు సమాచారం అందిస్తున్న వైనం చార్జిషీట్లు, అరెస్టులు అన్నీ ఎల్లో మీడియాలో ముందే ప్రత్యక్షం సీఆర్‌పీసీ 164, 161 సెక్షన్ల ప్రకారం.. సాక్షుల వాంగ్మూలాలను రహస్యంగా ఉంచాలి కానీ.. ఢిల్లీ ఆదేశాలతో నిబంధనలన్నింటికీ పాతరేస్తున్న సీబీఐ
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల అంశంపై గత తొమ్మిది నెలలుగా జరుగుతున్న దర్యాప్తుపై.. సీబీఐ నుంచి ‘లీకులు’ అంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వరుస కథనాల వెనుక కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది. విచారణ జరుగుతున్నంత కాలం దానికి సంబంధించిన వివరాలను ఎల్లో మీడియాకు లీక్ చేయాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు సీబీఐని ఆదేశించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం కనుసన్నల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. జగన్ సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్ వ్యవహారాల్లో గత ఆగస్టులో సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటి నుంచి ఎల్లో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. మరోవైపు.. ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాకే జగన్‌ను సీబీఐ అరెస్టు చేసిందని ‘ఇండియా టుడే’ పత్రిక బయటపెట్టిన అంశం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉండే కొందరు రాష్ట్ర నాయకులు ఈ కేసుల దర్యాప్తు, ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలపై ఆరా తీశారు. ఆ సందర్భంగానే ఎల్లో మీడియాతో పరస్పర సహకార ధోరణితో వెళ్లాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టు వారికి తెలియవచ్చింది. ‘ఈ కేసుల వ్యవహారంలో పరస్పరం సహకరించుకోవాలని ఢిల్లీ నుంచి ఆదేశాలున్నాయి. అందుకే రాష్ట్రంలో జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కేసులో ఇప్పటివరకు సీబీఐ సహకారంతోనే ఎల్లో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి’ అని కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న ఏఐసీసీ నాయకుడొకరు ధ్రువీకరించారు. ‘సీబీఐ ఆ రకంగా లీకులు చేయకపోతే ఒకే రోజు ఎల్లో మీడియా పత్రికలన్నింటిలోనూ ఒకే రకమైన కథనాలు ఏ విధంగా వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ లీకుల విషయాన్ని పక్కనపెడితే.. ఏయే అంశాలపై ‘దర్యాప్తు’ సాగాలో క్రోడీకరించి ఎల్లో మీడియా ముఖ్యుడొకరు సీబీఐకి ఎప్పటికప్పుడు అందజేసే ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ రెండు కేసులకు సంబంధించి సీబీఐ ఎవరెవరిని ప్రశ్నించదలచిందీ, ఏ అంశాలపై దర్యాప్తు, ఎవరెవరిని అరెస్టు చేయబోతున్నారు.. వంటి కథనాలు సీబీఐ నుంచి ముందస్తు లీకుల మేరకే రాసినట్టు చెప్తున్నారు. ఈ కేసుల్లో సీబీఐ ఇప్పటివరకు చాలా మంది నుంచి సీఆర్‌పీసీ 164, సీఆర్‌పీసీ 161 కింద వాంగ్మూలాలను నమోదు చేసింది. సాధారణంగా ఇలాంటి వాంగ్మూలాలను చార్జిషీటు దాఖలు చేసే వరకూ రహస్యంగా ఉంచాలి. సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్టు నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ లీక్ చేసిన కారణంగానే ఎల్లో మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ రకంగా సీఆర్‌పీసీ 164, సీఆర్‌పీసీ 161 కింద నమోదు చేసిన వాంగ్మూలాలు, సీబీఐ కోర్టుకు సమర్పించే చార్జిషీట్లలోని వివరాలు ముందస్తుగానే ఎల్లో మీడియాకు లీకు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. న్యాయస్థానాల్లో కూడా పలువురు న్యాయవాదులు లేవనెత్తారు. కోర్టుల్లో పిటిషన్లూ దాఖలయ్యాయి.
ఆ కథనాలను ఏనాడూ ఖండించని సీబీఐ: ఏదైనా కేసు విషయంలో దర్యాప్తు జరుపుతున్న సందర్భంలో పత్రికల్లో వచ్చే రకరకాల కథనాలను సీబీఐ అనేకసార్లు ఖండించింది. ముఖ్యంగా ముద్దాయి ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగానీ లేదా దర్యాప్తును ప్రభావితం చేసే అంశాలపైనా పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు సీబీఐ ఢిల్లీ కేంద్ర కార్యాలయం స్పందించి వాటికి ఖండనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో కానీ, ఎమ్మార్ కేసులో కానీ ఎల్లో మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై ఏ ఒక్క అంశాన్నీ సీబీఐ ఖండించలేదు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల్లో అడుగు కూడా ముందుకు వేయని సీబీఐ కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జగన్‌పై రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే దూకుడుగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. అందుకు అనుగుణంగానే జగన్‌ను దెబ్బతీయడానికి ఎంతగా వీలైతే అంత అన్న స్థాయిలో సీబీఐ లీకులు ఇస్తుండటంతోనే ఎల్లో సిండికేట్ బరితెగించిన రాతలు రాస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టుకన్నా ముందే ఎల్లో మీడియాకు సమాచారం...
ఓఎంసీ కేసులో కొండారెడ్డిని జగన్ బెదిరించారంటూ సీబీఐ అధికారులు సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలం నమోదు చేశారు. అయితే ఈ కేసులో సాక్షిగా జగన్ సీబీఐ ముందు హాజరైన రోజునేకొండారెడ్డి వాంగ్మూలాన్ని లీక్ చేశారు. అలాగే కొండారెడ్డి, జగన్‌ను ముఖాముఖి విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా జగన్ వద్దంటూ బతిమిలాడారని సీబీఐ అధికారుల సమాచారం అంటూ అప్పట్లో ఎల్లో మీడియా కథనాలు రాసింది.
గాలి జనార్దన్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు మే 11న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు విషయంలో న్యాయమూర్తి అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణ. అయితే ఈ వ్యవహారంలో మే 11కు ముందు నుంచే సీబీఐ రహస్యంగా దర్యాప్తు జరుపుతోంది. కానీ ఈ విషయాన్ని.. జగన్ తన అరెస్టు అక్రమమంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో ఒక ఎత్తుగడ ప్రకారమే లీక్ చేసిందన్న అనుమానాలున్నాయి.
సీబీఐ సమర్పించిన రెండు, మూడు చార్జిషీట్లను సీబీఐ ప్రత్యేక కోర్టు మే 29న విచారణకు స్వీకరించింది. కోర్టు విచారణకు స్వీకరించనంత వరకు చార్జిషీట్‌కు న్యాయబద్ధత ఉండదు. అయితే మే 10న రెండో చార్జిషీట్‌ను ప్రస్తావిస్తూ ఎల్లో మీడియా కథనాన్ని ప్రచురించింది. అలాగే జగన్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిన మే 22వ తేదీన.. వైఎస్‌ది నేరమే అంటూ మూడో చార్జిషీట్‌ను ప్రస్తావిస్తూ భారీ కథనాన్ని ప్రచురించింది.
జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా సంస్థల ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ఎల్లో మీడియా కథనాలను ప్రచురించాయి. అయితే 21న సీబీఐ సిటీ సివిల్ కోర్టులో అటాచ్‌మెంట్ పిటిషన్ వేసింది. కనీసం అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ఇచ్చిన జీవో ప్రతులను జగతి, ఇందిరా, జనని సంస్థలకు ఇచ్చేందుకు నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐలు ఎల్లో మీడియాకు మాత్రం లీకులు ఇచ్చాయి. |
No comments:
Post a Comment