YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

ఆ ‘మిస్టరీ’ వాళ్లకు తెలిసిందా?

వైఎస్ మరణం వెనుక ‘మిస్టరీ’ కోణం రష్యా పరిశోధనాత్మక జర్నలిస్టులకు వెంటనే తెలిసిందా? 
2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ అదృశ్యమయ్యాక.. దాని శకలాలను, అందులో ప్రయాణించిన వారి మృతదేహాలను గుర్తించటానికి 24 గంటల సమయం పట్టింది. ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 3వ తేదీన హెలికాప్టర్ దుర్ఘటన స్థలాన్ని గుర్తించారు. కానీ.. అదే సెప్టెంబర్ 3వ తేదీన రష్యాకు చెందిన ప్రఖ్యాత పరిశోధనాత్మక పక్ష పత్రిక ‘ద ఎక్సైల్డ్’ ఇంటర్నెట్ ఎడిషన్‌లో ఒక సంచలనాత్మక కథనం ప్రచురించింది. ‘అంతుచిక్కని పరిస్థితుల్లో హెలికాప్టర్ కూలి.. లారీ సమ్మర్స్ మాజీ యజమాని శత్రువు మరణం (ఎనిమీ ఆఫ్ లారీ సమ్మర్స్ ఎక్స్-బాస్ డైస్ ఇన్ మిస్టీరియస్ హెలికాప్టర్ క్రాష్)’ అన్నది ఆ కథనం శీర్షిక. ఈ కథనంలోని వివాదాస్పద అంశాలను ప్రస్తుతం ప్రస్తావించటం లేదు. అయితే.. వైఎస్ అనుమానాస్పద మరణం వెనుక భారీ స్థాయిలో కుట్ర జరిగి ఉండొచ్చన్నది ఆ కథనం సారాంశం. 

ఒకవైపు ఇక్కడ అదృశ్యమైన వైఎస్ హెలికాప్టర్ కోసం గాలింపు ఇంకా కొనసాగుతుండగానే.. వైఎస్ మృతదేహాన్ని ఇంకా గుర్తించకముందే.. ఎక్కడో రష్యాలో ఉన్న పరిశోధనాత్మక జర్నలిస్టులకు.. వైఎస్ హెలికాప్టర్ కూలిపోవటం వెనుక ఏదో ‘మిస్టరీ’ ఉందన్న విషయం ఎలా తెలిసింది? అసలు.. ఆసియాలో దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక ‘మిస్టరీ’ గురించి యూరప్ ఖండంలోని రష్యాకు చెందిన పరిశోధనాత్మక జర్నలిస్టులకు ఆసక్తి ఏమిటి? అందునా.. హెలికాప్టర్ కూలిందన్న విషయం ప్రపంచానికి తెలిసీ తెలియకముందే.. వారు ‘మిస్టరీ’ కోణాన్ని, దానివెనుక ఉండగల ‘శక్తుల’ గురించి ఎలా ప్రస్తావించగలిగారు. అంటే.. వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనపై ప్రపంచ మాఫియా వర్గాలకు ముందే ఉప్పందిందా? ఆ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారమే వారు అంత వేగంగా ‘మిస్టరీ’ కోణాన్ని స్పృసించగలిగారా? 

ఏమా పత్రిక చరిత్ర.. ఎవరా రచయిత? 

రష్యాతో పాటు అమెరికాలోనూ హింసా రాజకీయాలు, మాఫియా రాజకీయాలు, తదితర ప్రమాదకర అంశాలను పరిశోధిస్తూ.. కఠినమైన వాస్తవాలను నిర్భయంగా, నిస్సంకోచంగా, అత్యంత తీవ్రమైన పదజాలంతో బయటపెట్టే పత్రిక ‘ఎక్సైల్డ్’ అని సీఎన్‌ఎన్, న్యూస్‌వీక్ వంటి ప్రతిష్టాత్మక వార్తా సంస్థల నుంచి కితాబులు అందుకున్న చరిత్ర దానిది. 1997 నుంచి పక్ష పత్రికగా ప్రచురితమైన ఎక్సైల్డ్‌కు రష్యాలోనే కాదు, అమెరికాలోనూ విపరీతమైన పాఠకాదరణ ఉంది. కానీ.. రష్యా పాలకులు 2008లో ఈ పత్రిక ప్రచురణను నిలిపివేయించారు. అప్పటి నుంచీ అది ఇంటర్‌నెట్ ఎడిషన్ రూపంలో కొనసాగుతూనే ఉంది. వైఎస్ హెలికాప్టర్‌పై సెప్టెంబర్ 3వ తేదీన కథనం రాసిన మార్క్ అమీస్.. ఎక్సైల్డ్ వ్యవస్థాపక పాత్రికేయుల్లో ఒకరు. ఆయన ఒక్క ఎక్సైల్డ్‌లోనే కాదు.. ద నేషన్, న్యూయార్క్ ప్రెస్, ద సాన్‌జోస్ మెర్క్యురీ న్యూస్, ఆల్ట్‌మెట్, జీక్యూ వంటి అనేక ప్రతిష్టాత్మక పత్రికలకూ కథనాలు, వ్యాసాలు రాశారు. అంతేకాదు.. అమెరికా సమాజంలో స్కూళ్లు, ఆఫీసుల్లో ఆగ్రహావేశాలతో జరుగుతున్న హత్యల పరంపరను కొన్నేళ్ల పాటు అధ్యయనం చేసి, దానిని విశ్లేషిస్తూ.. ‘గోయింగ్ పోస్టల్: రేజ్, మర్డర్ అండ్ రెబెలియన్ - ఫ్రమ్ రీగన్స్ వర్క్ ప్లేసెస్ టు క్లింటన్స్ కొలంబైన్ అండ్ బియాండ్’ అనే పుస్తకమూ (2005లో ప్రచురితమయింది) రాశారు. అంతటి ప్రముఖమైన పరిశోధనాత్మక జర్నలిస్టు స్వయంగా బైలైన్‌తో.. వైఎస్ హెలికాప్టర్ క్రాష్ వెనుక ‘మిస్టరీ’ కోణంపై కథనం రాశారంటే.. అది కూడా కాప్టర్ క్రాష్ అయ్యి 24 గంటలు కూడా తిరగకముందే రాశారంటే.. అంత తేలికగా కొట్టిపారేయగలమా?

వాతావరణం బాగోలేకున్నా..


హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన రోజు.. చాపర్ ప్రయాణ మార్గంలో వాతావరణం ఏమీ బాగోలేదని, చాలా ప్రతికూలంగా ఉందని చెప్తున్నారు. అలాగైతే.. అసలు వైఎస్ హెలికాప్టర్ ప్రయాణానికి ఎలా అనుమతి ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్ణయించకుండానే క్లియరెన్స్ ఎలా ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు? హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు నిరాకరించలేదు? పోనీ.. చెన్నై ఏటీసీ విభాగం ఎందుకు హెచ్చరించలేదు? ఈ వాతావరణంలో ప్రయాణం ప్రమాదకరమని కానీ, విరమించుకోవాలని కానీ, వెనుదిరగాలని కానీ, మార్గం మళ్లించుకోవాలని కానీ.. ఏ ఒక్కరూ ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తుండగా.. ఆయన భద్రతపై ఎందుకంత ఉదాసీనంగా, ఎవరికీ ఏమీ పట్టని రీతిలో వ్యవహరించగలిగారు? పొంచివున్న ప్రమాదం గురించి హెచ్చరించకుండా వదిలేసిన ఈ నిర్లక్ష్యం కాకతాళీయమా? లేక ఉద్దేశపూర్వకమా? 

ఆ నాడే జగన్ లేఖ రాశారు కదా...?

వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనపై విమానయాన ఇంజనీరింగ్ నిపుణులు, సామాన్య ప్రజలు లేవనెత్తిన సందేహాలను.. వైఎస్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌పటేల్‌కు ఒక లేఖ ద్వారా అందించారు. కేసును తిరగదోడాలని కోరారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనూ తీర్మానం చేశారు. ఇప్పుడు శివాలెత్తుతున్న కాంగ్రెస్ నేతల గొంతుకలు అపుడెందుకు మూగబోయాయి? 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!