YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

నా బిడ్డ చేసిన తప్పేమిటి?

* కర్నూలు జిల్లా ప్రచారంలో విజయమ్మ ఆవేదన
* ఎందుకిలా వేధిస్తున్నారు?.. వైఎస్సార్ రెండుసార్లు 
* కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినందుకా?
* వైఎస్ పేదవారి కోసం తపించి సంక్షేమ పథకాలు పెట్టినందుకా?
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ సమాధానం చెప్పాల్సిందే
* జగన్ సీఎం అయితే వైఎస్ పథకాలన్నీ అమలవుతాయి 

ఎమ్మిగనూరు, కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధులు: ‘‘నా బిడ్డ ఏం తప్పు చేశాడని వేధిస్తున్నారు? నా భర్త వైఎస్సార్ రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు నా బిడ్డను అరెస్టు చేశారా? పేద వారిసంక్షేమం కోసం తపించి వైఎస్ పథకాలు అమలు చేసినందుకు మా కుటుంబాన్ని వేధిస్తున్నారా? ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ సమాధానం చెప్పి తీరాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె తన కుమార్తె షర్మిలతో కలిసి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు.

ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రెండు సార్లు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినందుకు అప్పుడు వైఎస్‌ను అందరూ ఇంద్రుడూ చంద్రుడూ అన్నారని, ఇప్పుడేమో ఆయన్ను, జగన్ బాబును దోషిని చేసి మాట్లాడుతున్నారని, దీనికి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

వారినెవరినీ విచారించరేం?

రెండెకరాల ఆసామి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకొచ్చి వేల కోట్లు సంపాదించినా ఆయనపై సీబీఐ విచారణలు ఉండవు. బొత్స సత్యనారాయణపై ఫోక్స్ వ్యాగన్, మద్యం సిండికేట్ల కుంభకోణాల ఆరోపణలు వచ్చినా ఆయనపై సీబీఐ ఎలాంటి విచారణా జరపదు.బోఫోర్సు కుంభకోణంలో రాజీవ్ గాంధీపై ఆరోపణలు వచ్చినా ఆయన ఇంటిపై దాడులు చేయలేదేం? రోశయ్యపై ఆరోపణలు వచ్చినా ఏసీబీ విచారణ చేయకుండానే ఆయనకు గవర్నర్ పదవి ఎలా ఇచ్చారు? ఏ తప్పూ చేయని జగన్‌ను మాత్రం విచారణ పేరుతో వేధిస్తున్నారు. పేదవాడి సంక్షేమాన్ని కాంక్షించే నాడు రాజశేఖరరెడ్డిప్రతి ఫైలుపై సంతకం చేశారు. ఆ కాంక్షలో నుంచి పుట్టినవే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 104, 108 పథకాలు. ఆయన మరణించాక ఈ ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ తుంగలో తొక్కి.. ఆయనపైనే నిందలు వేస్తోంది.

మరణంపై అనుమానాలు బలపడుతున్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, సీబీఐ వేధింపులను చూస్తోంటే వైఎస్ మరణంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ అనుమానాలు నావి మాత్రమే కాదు.. ప్రజలందరివీ. వైఎస్ రచ్చబండకు బయల్దేరినప్పుడు కొత్త హెలికాప్టర్ ఉన్నా.. పాత హెలికాప్టర్ ఎందుకు తీసుకొచ్చారో ఇప్పటి వరకూ జవాబు చెప్పలేదు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో కొన్ని నిమిషాల సంభాషణే ఉంది.. అదీ పైలట్ల మాటలే. మరి మిగతా నిమిషాల రికార్డు ఏమైందన్న సంగతి బహిర్గతం చేయాలి. హెలికాప్టర్‌లో 200 కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు సరపడా ఇంధనం ఉంది. దాంతో ఆకాశంలోనే చక్కర్లు కొడుతూ రెండు గంటల దాకా ఉండవచ్చట. అయినా ఎందుకు ఉంచలేదు? సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న వెస్లీ తుపాకీలో తూటాలు మాయమయ్యాయి. వైఎస్ మరణించిన మరుసటి రోజే రష్యా మీడియా దీనిపై అనుమానం వ్యక్తం చేసినా మన ప్రభుత్వాలు స్పందించలేదు.

ఆయన్ను మేం చంపుకొంటామా?

వైఎస్‌ను మేమే చంపుకొన్నామని బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైన మాట ఇంకొకటుంటుందా? మా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎప్పుడైనా మీ ముందుకు వచ్చానా? నా భర్తను నేను ఎందుకు చంపుకొంటాను? జగన్‌బాబుకు అధికార దాహమంటున్నారు. రాజశేఖరరెడ్డి మృతి చెందినప్పుడు జగన్ బాబును సీఎం చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆశ ఉంటే జగన్ అప్పుడే సీఎం అయ్యేవాడు. ముఖ్యమంత్రిగా రోశయ్యను చేయాలని జగన్ ఎందుకు ప్రతిపాదిస్తాడు?

నా సూట్ కేసును తనిఖీ చేయడం బాధగా ఉంది..

ఒకవైపు భర్తను పోగొట్టుకున్నా.. మరోవైపు కుమారుడు జగన్ బాబును అక్రమంగా అరెస్టు చేశారు. న్యాయం కోసం వెళితే ప్రతి గేటు కూడా మూసివేయడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజల ముందుకు వచ్చాను. ప్రచారంలో తిరుగుతూ ఉంటే.. పోలీసులు నా బట్టలు ఉన్న సూట్‌కేసును బయటపెట్టి తనిఖీ చేస్తున్నారు. 

చాలా బాధగా ఉంది. ఇతర పార్టీ నాయకుల సూట్ కేసులు మాత్రం వీరు తనిఖీ చేయరట. ఇంకా ఎంతకాలం ఈ వేధింపులు? ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే జగన్‌ను జైల్లో పెడితే కాంగ్రెస్, టీడీపీలు ఉప ఎన్నికల్లో గెలవచ్చనే కుట్రతో ఆయన్ను అరెస్టు చేయించారు. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో మీ అభిమాన ఓటు ద్వారా.. కుట్రదారులకు బుద్ధి చెప్పాలి. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్నాయి. ఆ పథకాలన్నీ జగన్ ముఖ్యమంత్రి కాగానే నెరవేరుస్తాడు.

కర్నూలు జిల్లాతో విడదీయరాని బంధం

కర్నూలు జిల్లాతో ఆయనకు (వైఎస్) విడదీయ రాని బంధం ఉంది. ఈ జిల్లాలోనే ఆయన జలయజ్ఞం ప్రారంభించారు. ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ప్రాణాలు వదిలిందీ ఈ జిల్లాలోనే. రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెలాగిన వారి కోసం జగన్‌బాబు ఓదార్పు యాత్ర ప్రకటన చేసిందీ ఈ జిల్లాలోని నల్లకాలువ నుంచే. 

కర్నూలు జిల్లా ప్రచారంలో విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెన్నకేశవరెడ్డి, శోభా నాగిరెడ్డి, పార్టీ నేతలు గౌరు వెంకటరెడ్డి, వాసిరెడ్డి పద్మ, మారెప్ప, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!