పత్రికలకు రాజకీయాలున్నాయేమో కానీ.. మాకు లేవు
ఇంతకుముందు కూడా మా పేరుతో తప్పుడు కథనాలు
జగన్ కేసులో ఇంకా పత్రాల పరిశీలన దశలోనే ఉన్నాం
ఆయన ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కదా!
ఇక మేం కొత్తగా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరమేంటి?
విచారణకు అందుబాటులో లేకపోతేనే కస్టడీ కోరతాం
జగన్‌ను ఢిల్లీకి తరలిస్తామనటం అసందర్భం, అవాంఛితం
మాకు తెలిసి విదేశాలకు ఎలాంటి బృందాన్నీ పంపలేదు
ఏ వ్యక్తి అయినా షెడ్యూల్డు నేరానికి పాల్పడ్డట్లు
అభియోగాలుంటే ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతాం
అటాచ్‌మెంట్ అంటే.. ఆస్తుల క్రయవిక్రయాల స్తంభనే
ఈ చర్యలు చేపట్టినా న్యాయస్థానాల్లో సవాల్ చేయొచ్చు
‘సాక్షి’కి స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వర్గాలు
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: ‘‘ఇది విడ్డూరం. నమ్మలేకపోతున్నాం. జగన్‌ను వెంటనే తీహార్ జైలుకు తరలించేందుకు మేం ప్రయత్నిస్తున్నామని, ఆయన్ను ఫలానా ప్రాంతంలో విచారించటానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పటం.. బుద్ధి లేని రాతలు. మీకు (పత్రికలకు) రాజకీయాలు ఉన్నాయేమో. కొందరు రాజకీయనాయకులను సంతృప్తి పరచటానికి మీరు ప్రయత్నిస్తున్నారేమో. కానీ మాకు రాజకీయాలు లేవు.. మేం అలా చేయం’’ - ‘ఈనాడు’ దినపత్రిక ‘పిలుస్తోంది ఈడీ’ అన్న శీర్షికతో బుధవారం ప్రచురించిన కథనంపై ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖల్లోని ఉన్నతస్థాయి వర్గాల స్పందన ఇది. ‘ఈనాడు’ కథనం చూసి ఆ వర్గాలు నవ్వేశాయి. ‘‘ఇంతకుముందు ఎవరో బయటి వ్యక్తులు చెప్పారంటూ ఒక కథనం రాసి.. అది మా అధికారులకు ఆపాదించిన పత్రికే కదా ఇది?’’ అంటూ ఎగతాళి చేశాయి కూడా. మారిషస్ నుంచి ప్రైవేట్ షెల్ కంపెనీ ద్వారా జగన్‌కు చాలా డబ్బు చేరినట్టు ఈడీ గుర్తించేసిందంటూ ‘6 దేశాల్లో ఆరా’ అనే పతాక శీర్షికన ‘ఈనాడు’ మే 31వ తేదీన ఒక కట్టుకథ ప్రచురించింది. ఈ ‘రహస్యాన్ని’ స్వయంగా ఈడీ అధిపతి ఎస్.ఎస్.దావ్రా, ప్రత్యేక డెరైక్టర్ ఎస్.ఎస్.వాజ్‌పేయిల సన్నిహిత వర్గాలే తన చెవిన వేశాయంటూ నమ్మబలికింది. కానీ నిజానికి అలాంటి పేరుతో డెరైక్టర్, ప్రత్యేక డెరైక్టర్లు కాదు కదా.. కనీసం మామూలు అధికారులు కూడా ప్రస్తుతం ఈడీలో ఎవరూ లేరు! ఈ విషయాన్ని ఈడీ అధికారులే స్వయంగా నిర్ధారించారు. ‘‘అలాంటి పేరున్న అధికారులెవరూ ప్రస్తుతం మా విభాగంలో లేరు. ఈడీ డెరైక్టర్ పేరు రాజన్ కటోచ్. ఇక ప్రత్యేక డెరైక్టర్లు ఎస్.కె.సాహ్నీ, బలేశ్‌కుమార్’’ అని వారు ఆనాడే స్పష్టం చేశారు. తాజాగా అలాంటి కట్టుకథనే ‘ఈనాడు’ మళ్లీ ఈడీ పేరుతో వండి వార్చింది. దీని గురించి ఈడీ, కేంద్ర ఆర్థికశాఖల్లోని ఉన్నతస్థాయి వర్గాలను ‘సాక్షి’ సంప్రదిస్తే.. వారు అదంతా వట్టి అబద్ధమని కొట్టిపారేశారు.
ఇంకా పత్రాలను పరిశీలిస్తున్నాం...
జగన్ కేసులో ఈడీ దర్యాప్తు ఇప్పుడు ఏ దశలో ఉందని అడగగా.. ‘‘ఆరోపణలను పరిశీలించేందుకు మేం సీబీఐ సహకారాన్ని కోరుతున్నాం. సంబంధించిన పత్రాల్లో కొన్ని పత్రాలను సేకరించాం. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నాం. ఆ వివరాలను మేం గుర్తించిన వాటితో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మనీ లాండరింగ్ తదితర అంశాలు చాలా క్లిష్టమైనవి.. దానికి సమయం పడుతుంది’’ అని ఆ వర్గాలు వివరించాయి. జగన్‌ను ‘ఈడీ కస్టడీలోకి తీసుకోవటం’ అనివార్యంగా జరుగుతుందా? అని ప్రశ్నించగా.. ‘‘ఎవరైనా ఒక వ్యక్తి మా విచారణకు అందుబాటులో లేకపోతే.. సదరు వ్యక్తి కస్టడీ కోసం కోరుతాం. అలాంటి సందర్భాల్లో కూడా మేం ముందు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది. మేం స్పందన కోసం వేచి చూస్తాం. బహుశా ఓ రెండు సార్లు సమన్లు జారీ చేసిన తర్వాత.. ఆ సమన్లకు ఎలాంటి స్పందనా లేకపోతే.. సదరు వ్యక్తిని కస్టడీకి అందించాలని ఏ కోర్టు ద్వారానైనా కోరుతాం. ఇక్కడ ఆయన (జగన్) ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయన్ని తాజాగా కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఎక్కడుంది? ఇక విచారణ అంటారా..? అవును. జరగొచ్చు. ఆయన్ను ఢిల్లీకి తరలిస్తారన్న మాట కూడా ఈ దశలో అసందర్భం, అవాంఛనీయం. అలా ఏమైనా చేయాలంటే మేం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశాయి.
విదేశాలకూ ఏ బృందాన్నీ పంపలేదు...
‘ఈనాడు’ పేర్కొన్న విధంగా.. ఏవైనా దర్యాప్తు బృందాలను విదేశాలకు పంపించారా? అని ప్రశ్నించగా.. ఈడీ వర్గాలు నవ్వేస్తూ.. ‘‘మేం ఏం చేయాలని మీరనుకుంటున్నారు? మేం ఏదైనా చేసే ముందు ఆ (ఈనాడు) విలేకరిని సంప్రదించాలా? ప్రతి రోజూ ఆయనకు వివరించాలా? ఆ విలేకరి మా గురించి ఏదైనా కథనం రాసే ముందు మా పనితీరు గురించి కొన్ని ప్రాధమిక విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయానికి వస్తే.. ఏ కథనం రాసే ముందైనా దానికి సంబంధించిన ప్రాధమిక విషయాలు తెలుసుకోవాలి. ఏదేమైనా.. మేం ఇప్పుడు ఆ పత్రాలను పరిశీలించటం మొదలుపెట్టాం. మేం ఏం చేయాలో అది చేస్తాం. అక్రమంగా సంపాదించిన సొమ్మును అటాచ్ చేయటం మాకు చాలా ముఖ్యం.. అందులో కూడా మేం చట్టపరమైన ప్రక్రియను పాటిస్తాం. మా పరిధిలోకి వచ్చే నేరాలు ఏవైనా జరిగాయా అన్న విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం. మాకు తెలిసయితే ఇప్పటివరకూ ఏ బృందాన్నీ విదేశాలకు పంపలేదు’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘మామూలుగా మనీలాండరింగ్ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ప్లేస్‌మెంట్ (మనీ లాండరర్ అక్రమ సొమ్మును దాచటం.. ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావటం), లేయరింగ్ (నిధుల ప్రవాహ పరంపరలు, మార్పిడులు జరగటం), ఇంటిగ్రేషన్ (పై రెండు దశల్లో విజయం సాధించి.. ఆ సొమ్మును దర్జాగా ఉపయోగించుకోవటం). ప్రతి అంశాన్నీ మేం క్షుణ్నంగా పరిశోధిస్తాం. మేం చేసే ప్రతి ఆరోపణనూ కేసు నడిచే ప్రతి కోర్టులోనూ తిప్పికొట్టవచ్చు, సవాల్ చేయవచ్చు’’ అని ఆ వర్గాలు వివరించాయి.
అటాచ్‌మెంట్ అంటే క్రయవిక్రయాల స్తంభన..
ఆస్తుల అటాచ్‌మెంట్ అంశం గురించి ఈడీ వర్గాలు పేర్కొంటూ.. ‘‘ఎవరైనా ఒక వ్యక్తి.. నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను కలిగివున్నట్లు మేం విశ్వసించటానికి కారణం ఉన్నట్లయితే.. సదరు వ్యక్తి షెడ్యూల్డు నేరానికి పాల్పడినట్లు అభియోగం నమోదైతే.. సదరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను మేం కోరుతాం. ఈ షెడ్యూల్డు నేరంలో మూడు విభాగాలున్నాయి. మొదటి విభాగం.. దేశంపై తిరుగుబాటు చేయటం, నకిలీ నోట్లు చెలామణీ చేయటం, మాదకద్రవ్యాల చట్టం కింద నేరాలకు సంబంధించినది. రెండు, మూడు విభాగాల కిందకు.. రూ. 30 లక్షలకు పైగా విలువగల అంశాలకు సంబంధించిన నేరాలు, సీమాంతర నేరాలు వస్తాయి. ఏదేమైనా.. అటాచ్‌మెంట్ అంటే సదరు ఆస్తులను సంబంధీకులు విక్రయించటం కానీ, కదిలించటం కానీ చేయరాదని మాత్రమే అర్థం. దానికి సంబంధించిన రోజు వారీ లావాదేవీలు, సాధారణ కార్యక్రమాలను నిలిపివేయటం కాదు. అయినప్పటికీ.. ఈ దర్యాప్తు అంశాలు, ప్రక్రియలన్నింటినీ ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేయవచ్చు’’ అని ఆ వర్గాలు వివరించాయి.
No comments:
Post a Comment