YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

కాంగ్రెస్-టీడీపీ క్విడ్ ప్రొ కొ

ఉప ఎన్నికల్లో పక్కాగా అవగాహన
మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే తీరు
నరసన్నపేట, రామచంద్రపురం, నరసాపురం, మాచర్ల, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, ఆళ్లగడ్డ, రైల్వే కోడూరు, రాజంపేటల్లో కాంగ్రెస్‌కు టీడీపీ దన్ను
పాయకరావుపేట, ఉదయగిరి, పోలవరం, ప్రత్తిపాడు, రాయదుర్గం, ఎమ్మిగనూరుల్లో టీడీపీకి కాంగ్రెస్ మద్దతు
ఇరు పార్టీల పెద్దల స్థాయిలోనే నిర్ణయం
2009 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఇదే తంతు
ఈ ఎన్నికల్లోనూ కొనసాగింపునకు శ్రేణులకు నిర్దేశం


హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఇక్కడ మాకు సహకరించండి... అక్కడ మీకు సాయపడతాం..’
-ఇదీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల మధ్య కుదిరిన ఉప ఎన్నికల అవగాహన, ఉరఫ్ క్విడ్ ప్రొ కొ! 2009 సాధారణ ఎన్నికల తర్వాత నుంచీ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ రెండు పార్టీలూ ‘పరస్పర అవగాహన’ మంత్రం పఠిస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ దాన్ని పరిపూర్ణంగా కొనసాగించాలని అవి నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు మెజారిటీ నియోజకవర్గాల్లో ఇప్పటికే లోపాయికారీ అవగాహన కుదుర్చుకున్నాయి. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్, టీడీపీ రెండూ తమ ప్రథమ శత్రువుగా భావిస్తున్నాయి. ఫలితాలు తమకు పూర్తి ప్రతికూలంగా రావడం ఖాయమని రెండు పార్టీలూ విడిగా చేయించుకున్న పలు దఫాల సర్వేల్లో తేలిన కారణంగానే వైఎస్సార్‌సీపీని అడ్డుకునే చివరి ప్రయత్నంగా ఇలా తెరవెనుక ఎత్తుగడలకు దిగాయని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పరస్పరం సహకరించుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని కాంగ్రెస్, టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చాయి. ‘‘టీడీపీ కాస్త బలంగా ఉందని సర్వేల్లో తేలిన చోట దానికి కాంగ్రెస్ మద్దతివ్వాలి. అలాగేకాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకి టీడీపీ మద్దతివ్వాలి’’ అని ఇరు పార్టీల నేతలు పరస్పర అవగాహనకొచ్చారు. బలాబలాలను విశ్లేషించుకున్నాక.. నరసన్నపేట, రామచంద్రాపురం, నరసాపురం, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, ఆళ్లగడ్డ, రైల్వే కోడూరు, రాజంపేటల్లో కాంగ్రెస్‌కు ; పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, ఉదయగిరి, రాయదుర్గం, ఎమ్మిగనూరుల్లో టీడీపీకి రెండో స్థానం దక్కవచ్చని రెండు పార్టీలూ అంచనాకు వచ్చాయి. కాబట్టి ఆ స్థానాల్లో పరస్పరం సహకరించుకునేలా రెండు పార్టీల పెద్దలు అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని సెగ్మెంట్లలో కీలక నేతలకే సమాచారముండగా, మరికొన్ని చోట్ల అది కిందిస్థాయి నేతల దాకా చేరింది. చంద్రబాబు సీఎంగా ఉండగా తరచూ ఆయన నివాసానికి వచ్చి, పలు సందర్భాల్లో ఉదయం అల్పాహారం తీసుకుని వ్యక్తిగత తదితర పనులు చక్కబెట్టుకున్న కాంగ్రెస్ కీలక నేత ఒకరు ఇరు పార్టీల మధ్య ఈ లోపాయకారి అవగాహన కుదిర్చినట్టు సమాచారం.

నెల్లూరులో కాంగ్రెస్‌కు

ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాల కన్నా నెల్లూరు లోక్‌సభ స్థానాన్నే కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ఆర్థికంగా బలోపేతుడైన టి.సుబ్బరామిరెడ్డిని అక్కడ బరిలో దింంచిది. ఇక టీడీపీయేమో కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్న వంటేరు వేణుగోపాలరెడ్డిని నిలిపింది. ముందస్తు అవగాహన మేరకు ఆయన కొంతకాలం ఎన్నికల ప్రచారానికే వెళ్లకుండా దూరంగా ఉండిపోయారు. ఇక టీడీపీ నాయకుల్లో కొందరు బహిరంగంగానే కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నారు. కోవూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈసారి నెల్లూరును అంతగా పట్టించుకోవడమే లేదంటూ ఆ పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో సుబ్బిరామిరెడ్డికి సహకరించి, ప్రతిగా ఉదయగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేతలు టీడీపీకి తోడ్పడేలా అంతర్గత అవగాహన కుదిరినట్టు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు. నెల్లూరులో సుబ్బరామిరెడ్డికి సంపూర్ణంగా సహకరించటంతో పాటు సమన్వయపరిచే బాధ్యతను జిల్లాకు చెందిన ముఖ్య టీడీపీ నేత ఒకరికి అప్పగించారు! అక్కడ ప్రచారానికి వెళ్లాల్సిందిగా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఒకరిని పురమాయించినా, ఎటూ కాంగ్రెస్‌కు తోడ్పడాల్సిన చోటికి తానెందుకంటూ ఆయన వెళ్లలేదు. ఇక ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్థి విజయరామిరెడ్డి ఇటీవలి కాలం వరకూ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించిన అనుభవంతో స్థానికంగా రెండు పార్టీలను తానే సమన్వయ పరచుకుంటానని చెప్పారంటున్నారు!

తిరుపతి.. కిరణ్‌కు కీలకం

సీఎం కిరణ్, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గెలుపు కోసం పలువురు నేతలు టీడీపీ లోపాయకారిగా కష్టపడుతున్నారు. పరిస్థితులు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే, ఇటీవలి దాకా ప్రజారాజ్యం పార్టీలో ఉన్న చదలవాడ కృష్ణమూర్తిని టీడీపీ బరిలోకి దించిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎన్నికలను సమన్వయ పరిచే బాధ్యతను జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరికి అప్పగించారు. ఆయన టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి, కొద్దికాలం కాంగ్రెస్‌లో పని చేసి తిరిగి సొంతగూటికి చేరారు. తనకు రెండు పార్టీల నేతలూ ‘బాగా’ తెలుసని జిల్లాకు చెందిన ఇరు పార్టీ పెద్దలకు చెప్పి మరీ ఆయన ఈ బాధ్యతలు నెత్తికెత్తుకున్నట్టు తెలిసింది!

అనంత మాకు... రాయదుర్గం మీకు

అనంతపురం జిల్లా కేంద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించేందుకు టీడీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రతిగా జిల్లాలోని రాయదుర్గంలో టీ డీపీ అభ్యర్థికి కాంగ్రెస్ శ్రేణులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనేమో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్‌రెడ్డి గెలుపు కోసం టీడీపీ శ్రేణులు పని చేస్తున్నాయి. జిల్లాలోని ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థికి మేలు చేకూర్చేందుకే, ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శిగా పనిచేసిన రుద్రాగౌడ్‌ను కాంగ్రెస్ బరిలో దించింది. వారిద్దరూ కూడబలుక్కుని, టీడీపీని గట్టెక్కించే పనిలో పడ్డారు. ఇక జగన్‌ను ఆయన సొంత జిల్లాలో నిలువరించేందుకు కిరణ్‌తో పాటు చంద్రబాబు కూడా చెమటోడుస్తున్నారు. రాయచోటి, రాజంపేటల్లో టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్; బదులుగా రైల్వే కోడూరులో అధికార పార్టీకి టీడీపీ ‘అన్నివిధాలా’ సహకరించుకుంటున్నాయి. ఈ జిల్లాల్లో రెండు పార్టీల మధ్య అక్కడక్కడా నెలకొన్న విభేదాలను పరిష్కరించి ఒక్కతాటిపైకి తెచ్చి పరస్పరం సహకరించుకునేలా చేసే బాధ్యతను టీడీపీ యువనేత ఒకరికి అప్పగించినట్టు సమాచారం. ఇక శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెస్‌కు టీడీపీ, విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీకి కాంగ్రెస్ సహకరించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడికి అప్పగించారని,దాంతో ఈ మధ్యకాలంలో ఆయన తన దృష్టినంతా అక్కడే కేంద్రీకరించారని తెలిసింది. రామచంద్రాపురం, నర్సాపురం, మాచర్లల్లో తాము ఎటూ మూడో స్థానంలో ఉండటంతో కాంగ్రెస్‌కు సహకరించాల్సిందిగా పై నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని అక్కడి టీడీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ముఖ్య నేత ఒకరు తెలిపారు. బదులుగా పోలవరం, ప్రత్తిపాడుల్లో తమకు కాంగ్రెస్ సహకరిస్తుందంటూ వివరించారు. ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీలను సమన్వయ పరిచే బాధ్యతను జిల్లాల ఇన్‌చార్జికి అప్పగించినట్టు ఆ నేత వివరించారు. ‘మాకు మూడో స్థానమే గతి అనుకున్న చోట కాంగ్రెస్‌కు, వారికి మూడు ఖాయమన్న చోట మాకు.. ఈ ప్రాతిపదికన పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాం’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

ఈ ‘బంధం’ ఈనాటిది కాదు..!

కాంగ్రెస్‌తో ఈ ‘అవగాహన’పై టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు! ఎన్నికల సమయంలో ఇలాంటి ఎత్తుగడలు సహజమేనని కూడా చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గాల్లోని స్థానిక పరిస్థితుల మేరకు అభ్యర్థులు పరస్పరం సహకరించుకోవడం చాలాచోట్ల జరుగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. మరీ ఇదేం అవగాహన అని ప్రశ్నించగా, ‘‘ అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితి లేదు. కాకపోతే కొన్నిచోట్ల మాత్రం స్థానికంగా అవగాహనకు వస్తామని మా వాళ్లడిగారు. దాన్ని స్థానిక నిర్ణయానికి వదిలేశాం’’ అని అసలు విషయం వెల్లడించారు. గతంలో శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పరస్పరం సహకరించుకున్న విషయం బహిరంగ రహస్యమే. నిజామాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలోనూ అదే జరిగింది. టీడీపీ తరఫున తొలుత మైనారిటీని బరిలో దించినా, కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్‌కు సహకరించేందుకు అనువుగా చివరి నిమిషంలో ఆయన్ను మార్చి అర్కల నర్సారెడ్డికి టికెటిచ్చారు. అంతా ఊహించినట్టుగానే అర్కల నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. తరవాత అదే జిల్లాలోని బాన్స్‌వాడ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు సహకరించేందుకు టీడీపీ ఏకంగా పోటీకే దూరంగా ఉండిపోయింది!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!