అవును, అతడు తప్పు చేశాడు
తప్పు మీద తప్పులు చేశాడు
నిర్జీవమైన, నిస్తేజమైన
నిస్సత్తువ పార్టీకి పాదయాత్రతో
ప్రాణం పోసి, ప్రభుత్వాన్ని తెచ్చి
నిజంగానే మొదటి తప్పే చేశాడు.
మరి ఆ తప్పు చేసిన అతడిపై-
మన భారత శిక్షాస్మృతి కింద
మొదటి చార్జిషీటు వేయాల్సిందే!
మొదలు నుండి నరుక్కొని రావాల్సిందే!!
నిశ్చయంగా, నిర్భయంగా
నిర్మలంగా, నిటారుగా నిలిచి
అభ్యుదయమే ధ్యేయంగా తలచి
ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను
ఐశ్వర్యవంతంగా మలచి
ప్రజల మనసులను గెలిచి
రెండోసారి కూడా అధికారం తెచ్చి
రెండో తప్పు చేశాడు
అందుకే అతడిపై - రెండో చార్జిషీటు వేయాల్సిందే!
బండబూతుల అభియోగాల్ని మోపాల్సిందే!!
డెబ్బై లక్షల అసహాయులకు
మొదటి తారీఖుననే
ఠంఛనుగా పింఛన్‌లిచ్చి
కోట్లాది ప్రభుత్వ ఖజానాను
కొల్లగొట్టాడనే నేరారోపణతో
అతడిపై - ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం
ఓ అదృశ్యశక్తి మూడ్ ప్రకారం
మూడో చార్జిషీటు వేయాల్సిందే!
వారి మూడు తరాలను పాడుచేయాల్సిందే!!
అనాథలకు, అభాగ్యులకు
అసహాయులకు, అనారోగ్యులకు
ఆరోగ్యశ్రీ ద్వారా పైసా ఖర్చులేకుండా
అత్యాధునిక వైద్యం కల్పించి
కోట్లాది ప్రభుత్వ నిధులు దోచిపెట్టాడనీ
కోట్లాది ప్రజల హృదులు దోచుకున్నాడనే నేరారోపణతో
అతడిపై - నాలుగో చార్జిషీటు వేయాల్సిందే!
నలిపి... నలిపి వందసార్లు చంపాల్సిందే!!
ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను
పేదసాదలకు పంచినందుకుగాను
విజయమ్మ తన ఐదవతనం
కుట్రపూరితంగా పోగొట్టుకున్నందుకుగాను
అతడిపై - ఐదో చార్జిషీటు వేయాల్సిందే!
కొరివి పెట్టిన కొడుకును కూడా
కోర్టులకు ఈడ్చాల్సిందే!!
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి
సాధ్యం కాని ఉచిత విద్యుత్తు
ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అమలుచేస్తారని
భారీ నిధులు బక్కచిక్కిన రైతన్నకు
బడ్జెట్‌లో ఎలా కేటాయిస్తారని
రాష్ట్రాభివృద్ధికిది విఘాతమని
ఆర్థిక వ్యవస్థకు అశనిపాతమని
అతడిపై - ఆరో చార్జిషీటు వేయాల్సిందే!
ఆరు నూరైనా శిక్షించాల్సిందే!!
ముప్పై లక్షల పేద విద్యార్థుల కోసం
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా
పిచ్చిపిచ్చిగా, వేలంవెర్రిగా
వేలాది కోట్ల ప్రజాధనాన్ని
వెచ్చించి, దుర్వినియోగం చేశాడనే నేరారోపణతో
అతడిపై - ఏడో చార్జిషీటు వేయాల్సిందే!
ఏదో ఒక శిక్ష పడాల్సిందే!!
అతడు ఎనిమిది లక్షల ఎకరాల అటవీ భూమిని
అప్పనంగా గిరిజనులకు అప్పగించినందుకు
కనికరం లేకుండా ప్రభుత్వ భూములను
కటిక పేదలకు పంచినందుకు
అతడిపై - ఎనిమిదవ చార్జిషీటు వేయాల్సిందే!
ఏదో నేరం మోపి ‘స్పాటు’ పెట్టాల్సిందే!!
రెండు రూకలకే మూడు పూటల
నాలుగు పచ్చడి మెతుకులు
పేదవాడికి అందించినందుకు
అతడిపై - తొమ్మిదో చార్జిషీటు వేయాల్సిందే!
తొండితో ఆ కుటుంబాన్ని తొక్కేయ్యాల్సిందే!!
పరమపదించి చూస్తూవుండగానే
పదివందల రోజులు భారంగానే గడిచాయి
మరణం కుట్రపై అనుమానాలు తీరకముందే
అతడిపై- పదో చార్జిషీటు వేయాల్సిందే!
‘చావు’ మీద చావుదెబ్బ తీయాల్సిందే!!
ఒక కోటి ఇరవై లక్షల మహిళామణులకు
పావలా వడ్డీనిచ్చి పల్లెల్లో, పట్నాల్లో
ఆర్థిక విప్లవం తెచ్చినందుకే
అతడిపై - పదకొండో చార్జిషీటు వేయాల్సిందే!
పచ్చని కుటుంబంపై మచ్చ వేయాల్సిందే!!
పన్నెండు వందల కోట్ల
విద్యుత్ బకాయిలు మాఫీ చేసి
ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడానికి
పన్నాగం పన్నాడనే అభియోగంతో
అతడిపై - పన్నెండవ చార్జిషీటు వేయాల్సిందే!
పరువును గంగలో కలపాల్సిందే!!
అరవై లక్షల ఇళ్లను నిరుపేదలకు ప్రసాదించి
సత్యదేవుడై నిత్యం పూజలందుకుంటున్న
అతడిపై - పదమూడో చార్జిషీటు వేయాల్సిందే!
పాముల్లా వ్యాజ్యాలు పడగలు విప్పాల్సిందే!!
దాదాపు పద్నాలుగు వందల కోట్ల
దళిత, బీసీల రుణాలు మాఫీ చేసి
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడనే
పక్కా నేరారోపణలతో
అతడిపై - పద్నాలుగో చార్జిషీటు వేయాల్సిందే!
బద్నాం చేసి బజారుకీడ్చాల్సిందే!!
వంద్యుల వ్యక్తిత్వహననానికి
పద్నాలుగు చార్జిషీటులేంఖర్మ
వంద చార్జిషీట్లు వేయాల్సిందే!
చచ్చిన వాడిని వందసార్లు చంపాల్సిందే!!
- ఆర్వీకే
8019679713
No comments:
Post a Comment