YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

సోనియా ఇంట్లో సోదాలు చేయలేదేం?

*సోనియా కుటుంబంపై బోఫోర్స్ కేసు ఉన్నా రైడ్ చేయలేదేం?
*170 మంది ఎంపీలపై కేసులున్నాయి.. వారిని అరెస్టు చేయలేదేం?
*విచారణ ఎదుర్కొంటున్న మంత్రుల ఇళ్లలో తనిఖీలు చేయలేదేం?
*ఫోక్స్‌వ్యాగన్ కేసులో బొత్స ఇంటిపై దాడులు చేయలేదేం? -
*రోశయ్య మీద ఏసీబీ కేసు ఉన్నా.. విచారించలేదే? 
*సీబీఐ దర్యాప్తు కుట్రపై వైఎస్ విజయమ్మ ప్రశ్నా స్త్రాలు
*ఓదార్పు మొదలుపెట్టిన నాడే జగన్‌పై వేధింపులూ మొదలు
*వరుసగా ‘సాక్షి’కి ఐటీ నోటీసులు, సోదాలు, ఫోన్ ట్యాపింగ్‌లు
*18 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చేస్తాయేమోనన్నభయంతోనే జగన్‌ను జనానికి దూరం చేశారు


గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘నల్లకాల్వలో ఇచ్చిన మాటకు కట్టుబడి నా బిడ్డ ఓదార్పు యాత్ర చేస్తున్నందుకే, ప్రజల మధ్య తిరుగుతున్నందుకే ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు ఇలా వేధింపులకు గురిచేస్తున్నారు. ఓదార్పు యాత్ర మొదలు పెట్టిన నాటి నుంచే ఈ వేధింపులు, ఇళ్లలో సోదాలు, కేసులు మొదలయ్యాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తిగా కాంగ్రెస్ పెద్దల కుట్రేనని ఆమె ఉద్ఘాటించారు. ‘‘సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగానే జరిగితే.. అందరి విషయంలోనూ అలాగే జరగాలి కదా! దేశవ్యాప్తంగా 170 మంది ఎంపీలపై కేసులున్నాయట. 

వారందరినీ సీబీఐ అరెస్టు చెయ్యలేదే? సోనియా గాంధీ కుటుంబంపై బోఫోర్స్ కేసు ఉంది.. సీబీఐ వాళ్ల ఇంటిలో సోదాలు చెయ్యలేదే? మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ భూ కుంభకోణం కేసులో సీబీఐ ఆయనపైన, ఆయన ఇంటిపైన ఎందుకు రైడ్ చేయలేదు? అంతెందుకు ఫోక్స్‌వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ ఇంటి మీద దాడులు చేయలేదే? ఇప్పుడు 26 జీవోలకు సంబంధించి మంత్రులను విచారిస్తున్నారు. వారి ఇళ్లలో తనిఖీలు చేయలేదే? ప్రస్తుత తమిళనాడు గవర్నర్, మాజీ సీఎం రోశయ్య మీద ఏసీబీ కేసు ఉన్నా.. ఆయన మీద విచారణ ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆయన సోనియా గాంధీ విధేయుడు కాబట్టే..’’ అని విజయమ్మ.. దర్యాప్తు కుట్రను బట్టబయలు చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున, ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత తరఫున విజయమ్మ ప్రచారం నిర్వహించారు. కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, గుంటూరు రూరల్, ప్రత్తిపాడు మండలాల్లో తన కుమార్తె షర్మిలతో కలిసి రోడ్‌షో నిర్వహించిన ఆమె చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబంపై కత్తిగట్టిన కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. ఆమెకు అడుగడుగునా పెద్ద ఎత్తున జనం ఘనస్వాగతం పలికారు. విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

రెండు వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు..

జగన్ బాబుపై సీబీఐ తొమ్మిది నెలల నుంచీ ఎంక్వైరీ చేస్తోంది.. ఒక్క ఆధారమూ చూపలేదు. ఈ తొమ్మిది నెలలుగా సీబీఐ వారు.. మా దగ్గర పనిచేసేవాళ్లు, మా దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్లు, మా బంధువులకు సంబంధించిన 2 వేలదాకా ఫోన్లను ట్యాప్ చేశారు. అంతేకాకుండా వాళ్లను పిలిపించి విచారించారు కూడా. ఆధారాలేమీ లేకపోయినా జగన్‌బాబును అరెస్టుచేశారు. జగన్‌బాబు ఈ రెండున్నరేళ్ల నుంచీ ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజల మధ్యే ఉన్నాడు. అదే ఆ కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. కానీ నా బిడ్డ మాట మీద నిలబడే మనిషి.. 

అందుకే ఆయనపై ఈ వేధింపులు. ఓదార్పు యాత్ర మొదలైన నాటి నుంచే.. ‘సాక్షి’కి ఐటీ నోటీసులు, 28 సీబీఐ బృందాలు వచ్చి రైడ్‌లు మొదలుపెట్టాయి. దాదాపు 700 మంది ‘సాక్షి’ మీద రైడ్ చేశారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి జగన్ మీద దాడులు ముమ్మరం చేశారు. ‘సాక్షి’ ఖాతాలు స్తంభింపజేశారు. వెంటనే పత్రికకు, టీవీకి ప్రభుత్వ ప్రకటనలు నిలిపేశారు. ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆయన్ను ప్రజల మధ్య నుంచి తీసుకెళ్లిపోయారు. ఆయన ప్రజల మధ్యే ఉంటే.. ఒక ఎంపీ, 18 అసెంబ్లీ సీట్లన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చేస్తాయేమో.. వారికి ఒకటి, రెండు కూడా దక్కవేమోనన్న భయంతో జగన్‌ను సీబీఐ విచారణ పేరుతో ప్రజలకు దూరం చేశారు.

వైఎస్‌కు ముందు, తర్వాత విచారణ చేయరే?

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తేవడానికి వైఎస్ చాలా కష్టపడ్డారు. భూములు, కరెంటు, నీరు ఇస్తే కాని పరిశ్రమలు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో.. ఆయన వాటిని రాష్ట్రానికి వచ్చేలా చేసినందుకు దాన్నుంచి జగన్ ఏదో లాభం పొందాడని సీబీఐ అంటోంది. గత ప్రభుత్వాలు పరిశ్రమల మంజూరు కేటాయింపుల్లో అమలుచేసిన విధి విధానాల్నే దివంగత వైఎస్సార్ అమలు చేశారు. ఇది సీబీఐకి కనిపించదు. వైఎస్‌కు ముందు చంద్రబాబుపైన, వైఎస్ తరువాత ముఖ్యమంత్రులను మాత్రం వారు విచారించరట...ఒక్క వైఎస్సార్ మీద మాత్రమే విచారిస్తారట. ఎందుకంటే ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలన్నదే అసలు కుట్ర కాబట్టి.

వైఎస్ సీఎం కాకముందే జగన్‌కు ఆస్తులు...

కాంగ్రెస్, టీడీపీ కలిసి వైఎస్‌ను, జగన్‌ను ఎలా అప్రతిష్టపాలు చేయాలా అని చూస్తున్నారు. లక్ష కోట్లు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. జగన్ కనీసం ఏనాడూ సీఎం క్యాంపు కార్యాలయానికికానీ, సచివాలయానికి కానీ వెళ్లలేదు. అలాగే ఏనాడూ ఏ రాష్ట్రమంత్రితోనూ, అధికారి తోనూ మాట్లాడలేదు. రాజశేఖరరెడ్డి సీఎం కాకముందే జగన్ బాబుకు ఆస్తులున్నాయి. కర్ణాటకలో సండూర్ పవర్ ప్రాజెక్టు, ఇంకో హైడల్ ప్రాజెక్టు, కరీంనగర్‌లో సరస్వతీ ప్రాజెక్టు ఉంది. వైఎస్ సీఎం కాకముందే ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఆస్తుల వివరాలన్నీ ఇంటర్నెట్‌లో కూడా పెట్టారు. ఎవరైనా చూసుకోవచ్చు. ఇవన్నీ అవినీతి ఆస్తులనడం సమంజసమా? దేవుడి దయ వల్ల జగన్ సిమెంటు ఫ్యాక్టరీ షేర్లను ఫ్రెంచి కంపెనీ కొనుగోలు చేసింది. వైఎస్ చనిపోయాక ఆ షేర్లను జగన్ బాబు అమ్ముకున్నాడు. నిజంగా అవినీతి ద్వారా డబ్బులు సంపాదించే ఉంటే.. షేర్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి? దేవుడి దయ వల్ల ఆ షేర్లు ఫ్రెంచి వాళ్లు కొన్నారు.. ఇక్కడి వారెవరైనా కొని ఉంటే.. దానికీ ఏదో చెప్పి నిందలు వేసేవారు.

పన్నులు వేయని పాలన వైఎస్‌ది మాత్రమే

రాజశేఖరరెడ్డిగారు 25 ఏళ్లపాటు పోరాటాలు, ఉద్యమాలు చేసి కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ఆయన సీఎం అయిన తొలిరోజే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకాలు చేశారు. విద్యుత్ బకాయిలు రూ.1,300 కోట్లదాకా మాఫీ చేశారు. రైతుల పక్షాన నిలిచిన ఆయన 2001 నుంచి 2004 వరకు ఉన్న వ్యవసాయ రుణ బకాయిలను ప్రధాని ప్యాకేజీ కింద రూ.1,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.1000 కోట్లు ఇచ్చి మాఫీ చేశారు. అంతేకాదు కొత్త రుణాలు ఇచ్చారు. 

ఆయన హయాంలో ఎరువుల ధరలుగాని, ఆర్టీసీ చార్జీలుగాని, మున్సిపాల్టీ రేట్లుగానీ ఏవీ పెరగలేదు. ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పన్ను కూడా పెంచకుండా పాలించిన ప్రభుత్వమేదైనా ఉందంటే.. అది వైఎస్‌పాలన మాత్రమే. రైతులకు మద్దతు ధర ఏటా రూ.90 పెంచడానికి కూడా వైఎస్ ఎంతో తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన హయాంలో రైతుకు గిట్టుబాటు ధర దక్కేది. ఆ రోజు బీటీ విత్తనాల రేటును సుప్రీంకోర్టుకు పోయి రూ.1,800 నుంచి రూ.750కి తగ్గించేలా చేసింది వైఎస్సే. దేశవ్యాప్తంగా పేదలకు ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కడితే.. ఆయన హయాంలో ఒక్క రాష్ట్రంలోనే పేదలకు 48 లక్షల ఇళ్లు కట్టించారు. 28 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందించారు. 

30 లక్షల మంది కాలేజీ పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్ లబ్ధి పొందారు. రూ.75 పింఛనును వైఎస్ రూ.200 చేసి.. 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. అవి కూడా ఒకటో తేదీనే ఇచ్చేలా చేశారు. ఆరోగ్యశ్రీ కింద కొన్ని లక్షల ఆపరేషన్లు చేయించారు. వేల వేల గుండె ఆపరేషన్లు చేయించారు. రూ.2కే కిలో బియ్యం పథకంతో పేదలను ఆదుకున్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని పథకాలూ అందాలని తలచిన ఆయన్ను ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు అవినీతి పరుడంటున్నారు. మీరు(ప్రజలనుద్దేశించి) నమ్ముతారా? (లేదు.. లేదు.. మేం నమ్మం.. వైఎస్ మా దేవుడు అంటూ ప్రజల నుంచి భారీ స్పందన) అంతేకాదు.. సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ రెండు కళ్లుగా చూసేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. జలయజ్ఞం కింద 86 ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు, పథకాలు అన్నీ మూలనపడిపోయాయి. ఆయన ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఎంతవరకు పనులు జరిగాయో... ఇప్పుడూ అక్కడే ఉన్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!