YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

అన్నదాతపై ఎరువుల బరువు



ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఏది చూసినా ఆకాశంలోనే
భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు
రైతుకు శాపంగా మారిన ఎన్‌బీఎస్ విధానం
రెండేళ్లలోనే 12 సార్లు పెరిగిన ఎరువుల ధరలు
ఎన్‌బీఎస్‌కు ముందు డీఏపీ బస్తా రూ.486.. ఇప్పుడు రూ.1071
విత్తనాల ధరలు పెంచి నడ్డివిరిచిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఖరీఫ్‌ను తలచుకుంటేనే అన్నదాత గుండెల్లో దడ పుడుతోంది. ఎడాపెడా పెరిగిపోయిన ఎరువుల ధరలు.. చుక్కలనంటుతున్న విత్తనాల రేట్లు.. పదేపదే ఎగబాకుతున్న పురుగుమందుల ధరలు.. వీటికితోడు కూలీల కొరత! ఇక పెట్టుబడుల ఖర్చులు ఏటేటా తడిసిమోపెడవుతున్నాయి. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే పెట్టుబడి భారం ఒక్క ఏడాదిలోనే 25 నుంచి 30% దాకా పెరిగింది.

ఇన్ని సమస్యలను దాటుకొని ముందుకు సాగినా గిట్టుబాటు దక్కని పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని యూపీయే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు అన్నదాతను నిలువునా ముంచుతున్నాయి. సాగుకు ప్రధాన అవసరమైన ఎరువుల ధర విషయంలో కేంద్ర సర్కారు అమలు చేస్తున్న సూక్ష్మ పోషక విధానం (ఎన్‌బీఎస్) రైతులకు భారంగా మారింది. కంపెనీలకు ఇచ్చే రాయితీని స్థిరంగా ఉంచి అమ్మకం ధరలను పెంచేలా రెండేళ్ల కిందట అమల్లోకి తెచ్చిన ఈ విధానంతో ఎరువుల ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. నెలకోసారి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీ తగ్గింపే లక్ష్యంగా వచ్చిన ఎన్‌బీఎస్ విధానంతో యూరియా మినహా అన్ని రకాల ఎరువుల ధరలు రెండేళ్లలోనే ఏకంగా 12 సార్లు పెరిగాయి. గత ఖరీఫ్, రబీలోనే ఎనిమిది సార్లు పెరిగాయి. రైతులకు ఎక్కువగా వినియోగించే 50 కిలోల డీఏపీ బస్తా ధర ఎన్‌బీఎస్ అమలుకు ముందు రూ.486 ఉండగా ఇప్పుడు రూ.1,071కి చేరింది. కాంప్లెక్సుల్లో ఎక్కువగా వినియోగించే 17:17:17 బస్తా ధర రూ.రూ.301 నుంచి రూ.1,021కి పెరిగింది. పంటల దిగుబడి పెంచడంలో కీలకమైన పొటాష్ ధర కూడా రూ.231 నుంచి రూ.845కు పెరిగిపోయింది. 19:19:19 బస్తా ధర రూ.337 నుంచి రూ.949కి ఎగబాకింది. రైతులపై పెరిగిపోతున్న ఎరువుల భారాన్ని తగ్గించేందుకు వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా సరఫరా చేయడంలేదు.

ఆకాశంలో విత్తన ధరలు: ఖరీఫ్‌లో పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్న రైతులపై.. విత్తనాల ధరలు పెంచి రాష్ట్ర సర్కారు మరో పిడుగు వేసింది. సబ్సిడీపై సరఫరా చేసే సోయాబీన్, వేరుశనగ విత్తనాల ధరను భారీగా పెంచింది. గత ఏడాదిలో క్వింటాల్ సోయాబీన్ విత్తనాలను రైతులకు రూ.1,540కి పంపిణీ చేయగా ఇప్పుడు ఈ ధరను రూ.2,680కి పెంచింది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.3,600 ఉన్న వేరుశనగ విత్తనాల ధరను రూ.3,950కు పెంచారు. సోయాబీన్ విత్తనాలను గత ఖరీఫ్‌లో 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. ఇప్పుడు దీన్ని 33 శాతానికి తగ్గించారు.

దీంతో ఈ విత్తనాల ధర కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో ప్రధాన పంట వరి విత్తనాల ధరలూ పెరిగాయి. బీపీటీ-5204 రకం విత్తనాల ధర గత ఏడాది క్వింటాల్‌కు రూ.1,950 ఉండగా సర్కారు ఇప్పుడు దాన్ని రూ.2100కి పెంచింది. బాస్మతి బియ్యాన్ని పోలిన ఆర్‌ఎన్‌ఆర్-2332 విత్తనాల ధర రూ.1,850 నుంచి రూ.2,300లకు ఎగబాకింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే ఎంటీయూ-1010, ఎంటీయూ-1001 రకం విత్తనాల ధర రూ.1,850 నుంచి రూ.2 వేలకు పెరిగింది. మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జ విత్తనాలపై గత ఏడాది క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ ఇచ్చిన సర్కారు ఇప్పుడు దీన్ని రూ.1,200లకు తగ్గించింది. సబ్సిడీలో కోతలో ఈ పంటలు వేసే రైతులపై అదనంగా రూ.100 కోట్ల అదనపు భారం పడనుంది.

చోద్యం చూస్తున్న ప్రభుత్వం: దశాబ్దకాలంలో ఎప్పుడూ లేని రీతిలో గత ఏడాది దుర్భర కరువు నెలకొంది. 1076 గ్రామీణ మండలాల్లో 876 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 83,55,267 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన 52,37,960 మంది రైతులకు రూ.1,816 కోట్ల నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వాలని గతేడాది డిసెం బరులో రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. పంట నష్టపోయిన ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు నిర్వహించే ప్రజాపథంలో రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ చేస్తామని ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. ఆ తర్వా త మే 10 నుంచి మే 31 వరకు నిర్వహించిన రైతు చైతన్య యాత్ర ల్లో ఇస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం రూ.600 కోట్ల పరిహారం మాత్రమే పంపిణీ చేశారు. 52 లక్షల మంది రైతులకు పరిహారం అందాల్సి ఉండగా అరకొరసాయం అందించి చేతులు దులుపుకున్నారు. రైతుల వద్ద పెట్టుబడికి డబ్బుల్లేకపోవడంతో వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం తగ్గే పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!