YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

జగన్‌పై సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన

ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు
విచారణ దశలోనే శిక్ష గురించి మాట్లాడుతున్నారు
టీడీపీ, కాంగ్రెస్ కరపత్రాల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి 
ఈ పత్రికల్లో కథనాలు పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలి
ఎక్కువ వాహనాలతో బాబు కోడ్ ఉల్లంఘించారు
బొత్స, సీఎం, చంద్రబాబు వాహనాలను ఎందుకు తనిఖీ చేయరు?

హైదరాబాద్, న్యూస్‌లైన్ : కేసులు విచారణ దశలోనే ఉండగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 ఏళ్ల వరకు బయటికి రాడని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వృథా అవుతుందంటూ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమే అవుతుందని ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతికూలంగా ఈ నెల 1న పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఐపీసీ171 సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని కోరింది. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనక్‌ప్రసాద్, శివకుమార్, కాశీవిశ్వేశ్వరరెడ్డిలు ఆదివారం సచివాలయంలో భన్వర్‌లాల్‌ను కలిసి ఈమేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచార వాహనాన్ని రోజూ తనిఖీ చేస్తున్న పోలీసులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుల విషయంలో అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశంలు కుమ్మక్కు అయ్యాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు కరపత్రంగా మారాయని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకతే లక్ష్యంగా వాస్తవాలకు విరుద్ధ కథనాలు ప్రచురిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు పార్టీలకు ప్రయోజనం కల్పించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురిస్తున్న కథనాలు, వార్తల జిరాక్స్ ప్రతులను అందజేశారు. రెండు పత్రికల్లో ప్రచురించిన కథనాలు, వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరగణించి అభ్యర్థుల ఖర్చులో ఈ మొత్తాన్ని జమ చేయాలని కోరారు. జూన్2న కర్నూలు ఎడిషన్‌లో ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బి.శోభానాగిరెడ్డి, వై.చెన్నకేశవరెడ్డిలకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలను ప్రచురించిన ఈనాడుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కథనాలనూ పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల ఖర్చులో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వందలాది వాహనాలతో కూడిన కాన్వాయ్‌తో వైఎస్‌ఆర్ జిల్లా రైల్వే కోడూరు ఉప ఎన్నికల ప్రచారం చేశారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. నిబంధనల కంటే ఎక్కువ ఉన్న వాహనాలను సీజ్ చేయాల్సి ఉండగా, అలా చేయలేదని టీడీపీ అభ్యర్థి అజయ్‌బాబు ఎన్నికల ఖర్చులో దీనిని జమ చేయాలని కోరారు.

1 comment:

  1. When all the institutions and Judiciary are behind the Government, the only independent institution remained to help the JUST is EC.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!