పత్రికా ప్రకటనల్లో రొటేషన్‌ను విస్మరించి ‘సాక్షి’కి ఇచ్చారంటూ విచారణ సర్క్యులేషన్ ప్రాతిపదికనూ పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన విస్మరణ ‘సాక్షి’ సర్క్యులేషన్ ఎక్కువ, ప్రకటనల ధర తక్కువ అన్నదీ పట్టించుకోరట ‘సాక్షి’ రాక ముందు ‘ఈనాడు’కూ ప్రకటనల్లో ప్రాధాన్యం ఇచ్చారు కదా అంటే.. ‘ఈనాడు’ తమ దర్యాప్తు పరిధిలోకి రాదంటూ కొట్టిపారేసిన సీబీఐ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కోర్టు నిర్దేశించిందా అంటే... లేదని జవాబు తమ ‘దృష్టికి’ వచ్చింది కాబట్టి దర్యాప్తు చేస్తున్నామంటూ సీబీఐ సమాధానం పరిశ్రమల విషయంలోనూ ఇదే తీరు.. బాబు చేస్తే ఒప్పు - వైఎస్ చేస్తే తప్పు! ఫార్మా సిటీని ‘బూట్’ నుంచి బిల్ట్, ఆపరేట్, ఓన్‌గా మార్చింది చంద్రబాబే టెండర్లు సైతం లేకుండా... ముందుకొచ్చిన ఏకైక సంస్థ రాంకీకి అప్పగింత అసెంబ్లీని రద్దు చేసిన రోజునే రాంకీ సంస్థకు ఫార్మా సిటీ అప్పగిస్తూ పచ్చజెండా బాబు చేసిన దాన్ని తప్పుగా పరిగణించని సీబీఐ... అక్కడ గ్రీన్‌బెల్ట్ పైనే దృష్టి అందులో గ్రీన్‌బెల్ట్ యథాతథంగా ఉన్నా తగ్గించారంటూ వైఎస్‌పై ఆరోపణలు వాన్‌పిక్‌లో పోర్టులు, ఎయిర్‌పోర్టును ‘బూట్’గానే కొనసాగించిన వైఎస్ పారిశ్రామిక కారిడార్‌ను బిల్ట్, ఓన్, ఆపరేట్‌గా మార్చటం నేరమన్న సీబీఐ అందుకే నిమ్మగడ్డ ప్రసాద్ ‘సాక్షి‘లో పెట్టుబడి పెట్టారంటూ ఆరోపణలు బాబు విధానాన్నే అనుసరించినా.. వైఎస్ సర్కారు నిర్ణయాలు తప్పని చెప్పే యత్నం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సీబీఐ ఉద్దేశంలో చంద్రబాబు చేసిన ఏ పనీ తప్పు కాదు! అదే పని వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగితే అది ‘క్విడ్ ప్రో కో’ కోసమే! ‘ఈనాడు’కు ఏ ప్రభుత్వం ప్రకటనలిచ్చినా తప్పుకాదు! ‘సాక్షి’కి ఎవరిచ్చినా తప్పే! సహజంగా దేన్నయినా తప్పో ఒప్పో తేల్చాలంటే రెండు పద్ధతులుంటాయి. ఒకటి - అదేమైనా చట్ట విరుద్ధంగా జరిగిందేమో చూడటం. రెండు - అప్పటిదాకా పాటిస్తున్న సంప్రదాయాలకు విరుద్ధంగా చేశారేమో చూడటం. మరి ఆ రెండింటినీ కూడా పక్కన పెట్టి దర్యాప్తు సాగిస్తుంటే ఏమనుకోవాలి? వై.ఎస్.జగన్‌ను, ఆయన సంస్థల్ని టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేయటానికే ఇదంతా సాగుతోందని స్పష్టంగా తెలియటం లేదా? సీబీఐ దర్యాప్తు తీరు ఎలా ఉందో చూస్తే...
రాష్ట్రంలో పెద్ద, మధ్యతరహా, చిన్న పత్రికలకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చేటపుడు రొటేషన్ పద్ధతి పాటించాలని 1994లో అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 37ను జారీ చేసింది. అయితే సర్క్యులేషన్, రీడర్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకోవాలని కూడా అందులో పేర్కొంది. రొటేషన్ అనే నిబంధన ఉన్నా.. ‘సాక్షి’ రాకముందు సర్క్యులేషన్, రీడర్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకుని ‘ఈనాడు’కే ఏ ప్రభుత్వమైనా అత్యధిక ప్రకటనలు ఇచ్చేది. ‘సాక్షి’ వచ్చాక దాని సర్క్యులేషన్ ఎక్కువ, ధర తక్కువ కావటంతో నాటి ప్రభుత్వం ‘ఈనాడు’కన్నా ‘సాక్షి’కే ఎక్కువ ప్రకటనలిచ్చింది. దీనిపై ‘సాక్షి’ డెరైక్టర్లను ప్రశ్నిస్తున్న సీబీఐ.. ‘రొటేషన్‌ను పక్కన పెట్టి మీకు ప్రకటనలు ఎక్కువ ఇచ్చారు కదా?’’ అని అడుగుతోంది. మరి అంతకుముందు ‘ఈనాడు’కూ ఇచ్చారు కదా? అని ఎదురు ప్రశ్నిస్తే.. ‘అది నిజమే కానీ.. ‘ఈనాడు’పై దర్యాప్తు మా పరిధిలో లేదు’’ అంటోంది. ‘అసలు కోర్టు ఈ అంశంపై దర్యాప్తు చెయ్యమని మీకు చెప్పిందా?’ అని అడిగితే.. లేదని జవాబిస్తూనే.. తమ దృష్టికి వచ్చిన అంశాలపై తాము దర్యాప్తు చేయొచ్చని చెప్తోంది.
‘సాక్షి’ సర్క్యులేషన్ ఎక్కువ.. రేటు తక్కువ!
గత మూడు సంవత్సరాల్లో.. అంటే 2008-11 మధ్య ప్రకటనల కోసం ప్రభుత్వం రూ. 286.17 కోట్లు కేటాయించింది. దీన్లో ‘సాక్షి’కి దక్కింది రూ. 89.09 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 32 శాతం. దీన్లో ‘ఈనాడు’కు ఎంత, ‘సాక్షి’కి ఎంత అని చూస్తే... సంవత్సరం సాక్షి ఈనాడు (రూ. కోట్లలో) 2008-09 42.42 22.04 2009-10 24.63 10.94 2010-11 22.04 20.23 మొత్తం 89.09 53.21 (క్లాసిఫైడ్, డిస్‌ప్లే, ఐ అండ్ పీఆర్ డెరైక్ట్)
ఇదీ వాస్తవం. ఇక్కడ ‘సాక్షి’ కన్నా ‘ఈనాడు’కు ప్రభుత్వ ప్రకటనల ద్వారా దాదాపు 38 శాతం తక్కువ ఆదాయం వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనే సందేహం సహజం. దీనికి సమాధానం మార్కెట్ సూత్రమే. అది.. తక్కువ ధర. ఎక్కువ మందిని చేరటం. అంతేకాదు.. వైఎస్ మరణించిన తర్వాత (2009) కూడా ప్రకటనల్లో ‘సాక్షి’కి గణనీయమైన ప్రాధాన్యమే ఇచ్చారు. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు మొదలైన తర్వాతే ప్రాధాన్యం తగ్గించటం గమనార్హం.
‘సాక్షి’ రాక ముందు ‘ఈనాడు’కూ 25 - 30 శాతం!
‘సాక్షి’ ఆరంభానికి ముందు ప్రభుత్వం ప్రింట్ మీడియాకు కేటాయించిన బడ్జెట్లో 25 నుంచి 30 శాతం నంబర్ వన్ స్థానంలో ఉన్న ‘ఈనాడు’కే దక్కేది. ‘సాక్షి’ తొలి ఏడాదే (2008-09) 12.67 లక్షల సర్క్యులేషన్‌తో (రాష్ట్రం వెలుపలి ఎడిషన్లు మినహా - సోర్స్: ఆర్‌ఎన్‌ఐ) రాష్ట్రంలో ఇతర పత్రికలకన్నా ముందు నిలిచింది. అప్పటికి.. అంటే జనవరి - జూన్ 2008 నాటికి ఏబీసీ ప్రకారం ‘ఈనాడు’ మొత్తం సర్క్యులేషన్ 11.55 లక్షలు. దీన్లో రాష్ట్రంలో ఉన్నది 11.03 లక్షలే. పెపైచ్చు కంబైన్డ్ ఎడిషన్లకు ఇచ్చే ప్రకటనలకు ‘ఈనాడు’ మామూలు రోజుల్లో చదరపు సెంటీమీటరుకు రూ. 1,350 ఆదివారాల్లో రూ. 1,570 వసూలు చేయగా.. ‘సాక్షి’ అన్ని రోజుల్లో రూ. 1,100 మాత్రమే వసూలు చేసేది.
అంటే ‘ఈనాడు’ రేట్లు ‘సాక్షి’కన్నా మామూలు రోజుల్లో 22.7 శాతం, ఆదివారాల్లో 42.6 శాతం అధికం. ముఖ్యమైన అంశమేంటంటే ‘ఈనాడు’లో డీఐపీఆర్ రేట్ల ప్రకారం ఒక ఎడిషన్‌కు మాత్రమే ప్రకటన ఇవ్వాలంటే కుదరదు. అవసరం ఉన్నా లేకున్నా మొత్తం రీజియన్‌కు ఇవ్వాల్సిందే. ‘సాక్షి’లో అలా కాదు. ఒక ఎడిషన్‌కు కావాలనుకుంటే ఆ ఎడిషన్‌కే ఇవ్వవచ్చు. ఇవన్నీ ‘సాక్షి’కి కలిసి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తన పథకాలు చేరుతాయన్న ఉద్దేశంతో ‘సాక్షి’కే ఎక్కువ ప్రకటనలు ఇవ్వటానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తగిన నిష్పత్తిలో ‘ఈనాడు’ పత్రికకూ ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకూ పెద్ద మొత్తం ఆదా అయింది.
ఎన్నికల సంవత్సరం కాబట్టే ఎక్కువ...
2006-07లో ప్రింట్ మీడియాకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ. 48 కోట్లు. మరుసటేడాది అది రూ.98 కోట్లకు, తర్వాతి ఏడాది రూ. 147 కోట్లకూ చేరటానికి కారణం ఎన్నికలే. తన పథకాలు విసృ్తతంగా జనంలోకి వెళ్లటానికి ఏ ప్రభుత్వమైనా ఎన్నికలపుడు ఎక్కువ ప్రకటనలు ఇస్తుంది. కానీ ఒక వర్గం మీడియా, కొందరు రాజకీయ నాయకులు మాత్రం అది ‘సాక్షి’ కోసమే పెంచినట్లుగా అవాస్తవ ఆరోపణలు చేస్తుండటం దురదృష్టకరం. ఈ సమయంలో ఒక్క ‘సాక్షి’కే కాదు.. అన్ని పత్రికలకూ, ముఖ్యంగా ‘ఈనాడు’కూ ప్రభుత్వం నుంచి రెవెన్యూ పెరిగింది. 2003-04లోనూ ఇదే జరిగింది.
అన్ని పత్రికలకూ నిబంధన సడలింపు!
ఇక 2008లో ‘సాక్షి’కి ప్రకటనలు ఇవ్వటం కోసం నాటి ప్రభుత్వం నిబంధనల్ని సడలించింది. ఆర్‌ఎన్‌ఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం, 18 నె లల పాటు ప్రచురించి ఉండటం వంటివి కొత్త పత్రికకు సాధ్యం కాదు కనక ఈ సడలింపు ఇచ్చింది. ఇదేదో ‘సాక్షి’కే ప్రత్యేకంగా ఇచ్చినట్లు ఓ వర్గం మీడియా చెలరేగిపోతుండటం గమనార్హం. నిజానికి చంద్రబాబు హయాంలో ‘వార్త’కు (జీవో 4121, తేదీ: 19.7.1996), ‘ఆంధ్రజ్యోతి’కి (జీవో 5739 తేదీ: 29.10.2002), వైఎస్సార్ హయాంలో ఎతెమాద్, సూర్య, సాక్షి పత్రికల కోసం ఇలా సడలింపులిచ్చారు. అంటే ప్రభుత్వమేదైనా ఇలా ఇవ్వటం సంప్రదాయమని తెలియటం లేదా? మరి ఇవన్నీ వదిలిపెట్టి సీబీఐ ఒక్క ‘సాక్షి’నే ఎందుకు టార్గెట్ చేస్తోంది? కోర్టు కూడా చెప్పలేదని చెప్తున్న సీబీఐకి ఇదంతా దర్యాప్తు చెయ్యాలని ఎవరు చెప్పారు? ఎవరికోసం సాగుతోంది ఈ దర్యాప్తు?
బాబు చేస్తే ఒప్పు... వైఎస్‌చేస్తే తప్పు!
వాన్‌పిక్‌లో రెండు పోర్టులు, ఎయిర్‌పోర్టు బూట్ (బిల్డ్, ఆపరేట్, ఓన్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలోనే ఉంటాయి. పారిశ్రామిక కారిడార్‌ను మాత్రం పరిశ్రమలు ముందుకు రావన్న ఉద్దేశంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘బూట్’ బదులు ‘బిల్ట్, ఆపరేట్, ఓన్’గా మార్చింది. అదే పెద్ద నేరమని.. అందుకే నిమ్మగడ్డ ప్రసాద్ ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారని సీబీఐ చెప్తోంది. ప్రసాద్ రిమాండ్ రిపోర్టులో దీన్నే ప్రధానంగా క్విడ్ ప్రో కోగా పేర్కొంది.
విశాఖలోని రాంకీ ఫార్మా సిటీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బూట్ పద్ధతిలోనే ప్రతిపాదించారు. కొన్ని కంపెనీలు ముందుకొచ్చినా నిబంధనల్ని పాటించలేదని వెనక్కి పంపేశారు. టెండర్ల ప్రక్రియ మధ్యలో.. 2003 జూన్ 13న బూట్‌ను బిల్ట్, ఓన్, ఆపరేట్‌గా మార్చారు. జూలై 31న రాంకీ సంస్థ ముందుకొచ్చింది. 2003 నవంబర్ 14న అసెంబ్లీని రద్దు చేస్తూ.. అదే రోజున రాంకీకి బాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ సీబీఐకి ఇది తప్పుగా కనిపించటం లేదు. ఈ వ్యవహారంలో కూడా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎక్కువ గ్రీన్‌బెల్ట్‌ను ప్రతిపాదించి తరవాత తగ్గించారని, అందుకే ‘సాక్షి’లో రాంకీ రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తోంది. 3వ చార్జిషీటులో ఈ అంశాన్నే పేర్కొంది. |
No comments:
Post a Comment