YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

కుమార్తె ఇంట్లో కోట్లు దాచిన చిరంజీవిని ఏ చెట్టుకు కట్టేసి కొట్టాలి?

ఆస్తులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదు
26 జీవోలు సక్రమమో అక్రమమో చెప్పలేని మంత్రులు ఆ నెపాన్ని జగన్‌పై నెట్టేస్తున్నారు
బలవంతం వల్ల సంతకాలు చేశామంటున్నారు.. మరి మీరెందుకు.. గాడిదలు కాయడానికా?
కుమార్తె ఇంట్లో కోట్లు దాచిన చిరంజీవిని ఏ చెట్టుకు కట్టేసి కొట్టాలి?
ఆజాద్ మాటలు ప్రజలకు బాగా అర్థమయ్యాయి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై అవాకులు చవాకులు పేలుతున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన ఆస్తులపై బహిరంగ చర్చకు వస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సవాలు విసిరారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆస్తులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు గానీ, టీడీపీ నాయకులకుగానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక నాయకులందరి ఆస్తులు ఏ మేరకు ఉన్నాయో పరిశీలిస్తే అన్ని విషయాలూ బయటకు వస్తాయని ఆయన అన్నారు. బొత్స సొంత జిల్లా విజయనగరానికి వెళితే ఆయన బతుకేమిటో, ఆస్తుల సంగతి ఏమిటో బయటపడుతుందని జూపూడి అన్నారు. గురివింద గింజలైన ఈ నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేయడం తగదన్నారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులంతా రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌లాగా మారి టూరింగ్ టాకీస్ మాదిరిగా ఊర్లు తిరుగుతూ విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

26 జీవోల సంగతి తేల్చండి

జగన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోలు సక్రమమైనవో, అక్రమమైనవో చెప్పలేక పోయిన మంత్రులు ఆ నెపాన్ని జగన్‌పై నెట్టి వేయడం దారుణమని జూపూడి విమర్శించారు. ‘మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సమష్టి నిర్ణయాలని ఓ వైపు చెబుతూనే.. తాము సొంతంగా జీవోలు జారీ చేయలేదని, ఎవరో బలవంతం చేస్తే సంతకాలు చేశామని మంత్రులు చెప్పడం చూస్తూంటే తప్పులన్నీ వైఎస్‌పైనే నెట్టి తద్వారా జగన్‌ను దోషిగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఎవరి బలవంతంతోనో ఫైళ్లపై సంతకాలు చేస్తే ఇక మంత్రులుగా మీరెందుకు? గాడిదలు కాయడానికా? అసలు మీరేమైనా వేలి ముద్రగాళ్లా.. ఏమీ తెలియదని చెప్పడానికి?’ అని జూపూడి నిప్పులు చెరిగారు. 

‘మరణించిన వైఎస్ తిరిగి వచ్చి సమాధానం చెప్పలేరు కనుక మంత్రులంతా తమకేమీ తెలియన ట్లు తప్పంతా ఆయనదేనని చెబుతున్నారు. 2004-2009 మధ్య జరిగిందంతా అవినీతి అయితే ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ టికెట్లు తీసుకుని ఎందుకు పోటీ చేశారు? గెలిచిన తరువాత ఆయన మంత్రివర్గంలో ఎలా ప్రమాణ స్వీకారం చేశారు? అపుడు ఇవేమీ కనిపించలేదా!’ అని జూపూడి మంత్రులను సూటిగా ప్రశ్నించారు. ‘వైఎస్‌ను ప్రతిపక్ష నాయకులెవరైనా విమర్శించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సార్లు వైఎస్ ఇంట్లో విజయమ్మ వడ్డిస్తే భోంచేసిన మంత్రులు ఇపుడు ఇలా విమర్శించడానికి నోరెలా వచ్చింది? తిన్న ఇంటి వాసాలు లెక్కించడం అంటే ఇది కాదా!’ అని విమర్శించారు.

వైఎస్ కుటుంబాన్ని విమర్శించే అర్హత చిరుకి లేదు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టాలని మాట్లాడుతున్న చిరంజీవికి అసలు వైఎస్ కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని జూపూడి స్పష్టం చేశారు. ఏకంగా 70 కోట్ల రూపాయల డబ్బు కట్టలు కట్టలుగా దొంగతనంగా తన కుమార్తె ఇంట్లో దాచి పెట్టుకున్న చిరంజీవిని ఏ చెట్టుకు కట్టేసి కొట్టాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ సీటు కోసం పార్టీని అమ్ముకున్న చిరంజీవి... వైఎస్ కుటుంబాన్ని విమర్శించడం ఏమిటని అన్నారు. రోజురోజుకూ ప్రజాదరణ పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయ చిత్రం నుంచి తొలగించడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయన పై లేని పోని అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల సభలకు లభిస్తున్న జనాదరణను చూసి ఈ నాయకులకు మతులు పోతున్నాయనీ, అందుకే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని జూపూడి పేర్కొన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి, ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఆ మరుసటి రోజే తానలా అనలేదని, తాను ఉర్దూలో మాట్లాడింది మీడియా వారికి అర్థం కాలేదని మాట మార్చి తానే గందరగోళంలో పడ్డారని అన్నారు. కానీ ఆజాద్ చెప్పింది రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమయిందని జూపూడి వ్యాఖ్యానించారు. విజయమ్మ ఈ నెల 8న పరకాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని, తెలంగాణ ప్రజలు ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

1 comment:

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!